వేతనం అందక వేదన!
విద్యాశాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడు వసంతరావు
శ్రీకాకుళం విద్యావిభాగం, న్యూస్‌టుడే: వారంతా హిందీ పండితులు.
2002 డీఎస్సీలో పరీక్ష రాశారు. అన్ని అర్హతలున్నా ఉద్యోగం రాలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం దక్కలేదు. ఎక్కడా న్యాయం దొరక్క న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పుతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కొలువులు పొందారు. విధుల్లో చేరి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ మొదటి నెల జీతం అందలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 39 మంది హిందీ పండితులకు 2019 జులై 6న నియామక పత్రాలు అందజేశారు. సుదీర్ఘకాలం తరువాత కొలువు రావడంతో ఆనందంగా విధుల్లో చేరారు. ఆ సంతోషం ఎంతో కాలం లేదు. రెండున్నరేళ్లుగా జీతాలందక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి, రాష్ట్రస్థాయి విద్యాశాఖాధికారులను కలిసినా ఫలితం లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడిని కలిసి రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, జిల్లా శాఖ ప్రతినిధులు వినతి పత్రం కూడా అందజేశారు. అయినప్పటకీ న్యాయం జరగలేదు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతం..
జీతాలందుకోక 39 మందిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఇప్పటికే వారిలో ఒకరు గుండె నొప్పితో, మరొకరు రహదారి ప్రమాదంలో చనిపోయారు. మిగిలినవారితో కూడా ప్రభుత్వం 29 నెలలుగా పైసా ఇవ్వకుండానే పని చేయిస్తోంది. ఆర్థిక, న్యాయశాఖల అనుమతితోనే వీరందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. జీతాలు ఇచ్చేసరికి ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తోంది. ఇప్పటివరకు గుర్తింపు సంఖ్యలు కూడా కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మానవత్వంతో ఆలోచించాలి..
మా విషయంలో మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యోగంలో చేరామనే ఆనందం కొంతకాలం కూడా లేకుండా పోయింది. జీతాలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖాధికారులు మానవత్వంతో ఆలోచించి ఆదుకోవాలని కోరుతున్నాం.
- చింతపల్లి వెంకట రమణమూర్తి, హిందీ పండితుడు
ఉన్నతాధికారులకు నివేదించాం..
హిందీ పండితుల జీతాలకు సంబంధించి ఖజానా శాఖకు బిల్లులు పెట్టాం. మంజూరు కాలేదు. దీనిపై కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.
- జి.పగడాలమ్మ, డీఈవో
0 Comments:
Post a Comment