దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని మ్యూచువల్ ఫండ్లకు (Mutual Funds) కేటాయిస్తున్నారు. ఫండ్స్ను ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ ఎలాంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనే ప్రశ్న పెట్టుబడిదారులను వెంటాడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ (Types of Mutual Funds) అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్టుబడి రకం, రాబడి, వ్యవధి వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఫండ్ను ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
కొత్తగా ఫండ్స్ను ఎంచుకునే సాధారణ పెట్టుబడిదారులు.. తెలిసిన వారు, బంధుమిత్రులు సూచించిన స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా సరైన పరిశీలన లేకుండా ఎంచుకునే పథకాల ద్వారా ఆశించిన రాబడి అందకపోవచ్చు. దీంతో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ను మధ్యలోనే విరమించుకుంటారు. కొంచెం శ్రద్ధ, అధ్యయనం చేసిన తరువాత మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం వల్ల ఇలాంటి నష్టాలకు చెక్ పెట్టవచ్చు. అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ల సలహాలు తీసుకొని ముందడుగు వేయవచ్చు.
ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
మ్యూచువల్ ఫండ్లో మదుపు చేసేవారు ముందు ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వివిధ రకాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఉపయోగపడతాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఫండ్స్ను ఎంచుకోవచ్చు. పెళ్లి ఖర్చులు, సొంత ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు, పదవీ విరమణ తరువాత మెరుగైన రిటైర్మెంట్ ఫండ్ జమ చేసుకోవడం, విదేశీ యాత్రలు.. వంటి వివిధ అవసరాల కోసం వివిధ రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే ముందే పెట్టుబడి లక్ష్యం ఏంటో నిర్ణయించుకోవడం మంచిది. ఆ లక్ష్యం ఆధారంగా ఫండ్ వ్యవధిని నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు పిల్లల ఉన్నత విద్యకు భవిష్యత్తులో నిధుల కోసం చూసేవారు.. పిల్లలకు తక్కువ వయసు ఉన్నప్పుడే పెట్టుబడులు ప్రారంభించాలి. ఇలాంటి లక్ష్యాలను బట్టి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి.
ఎంత రిస్క్‌ను భరించగలరు?
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో మదుపు చేసే ముందే రిస్క్ ఫ్యాక్టర్ను (నష్టభయం స్థాయి) ఎంతమేరకు తట్టుకోగలరో అంచనా వేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు తరచుగా ఒడుదొడుకులకు గురవుతాయి. కొన్నిసార్లు మార్కెట్లు పతనమైతే.. పెట్టుబడుల విలువ అమాంతం తగ్గుతుంది. ఈ రిస్క్ను తట్టుకోలేమని భావించేవారు ఈక్విటీ పథకాలను ఎంచుకోకపోవడమే మంచిది. మార్కెట్ ఆటుపోట్లు తట్టుకుని, దీర్ఘకాలం వేచి చూడగలం అనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇవి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని అందిస్తాయి. అందువల్ల పెట్టుబడి లక్ష్యం, రిస్క్ ఫ్యాక్టర్పై ఒక అవగాహనకు వస్తే, ఎలాంటి పథకంలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవడం తేలికవుతుంది.
స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగానే నిర్ణయం
తక్కువ వ్యవధిలో నిధులు సమకూర్చుకోవాలి అనుకునే వారు 2-3 సంవత్సరాల వ్యవధి కలిగిన స్వల్పకాలిక ఫండ్ను ఎంచుకోవచ్చు. 5- 7 సంవత్సరాల వరకు వ్యవధి ఉంటే మధ్యకాలిక.. 10 నుంచి 15, 20 సంవత్సరాల వరకు ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలుగా చెబుతారు. అయితే ఎంత వ్యవధిలో ఎంత మొత్తం ఆశిస్తున్నారనే విషయం ఆధారంగానే సంబంధిత స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ విభాగంలో మ్యూచువల్ ఫండ్స్ను లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ELSS అనే ఐదు కేటగిరీలుగా విభజించారు. వీటిపై ఇన్వెస్టర్లు అవగాహన పెంచుకోవాలి.
ఒకవేళ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వ్యవధి తక్కువగా ఉండాలనుకుంటే.. తక్కువ నష్టభయంతో కూడిన స్వల్పకాలిక పెట్టుబడులు ఎంచుకోవచ్చు. కొంచెం ఎక్కువ సమయం ఉంటే మధ్య కాలిక పెట్టుబడులు, మరింత మెచూరిటీ గడువు ఉంటే అధిక రిస్క్తో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకుని ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను సమతుల్యం చేసుకోవాలి. దీంతోపాటు మనం చేసే పెట్టుబడులు అనుకున్న సమయానికి ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అవసరమైన డబ్బును అందిస్తాయా లేదా అనేది కూడా అంచనా వేసుకోగలగాలి. ఒకవేళ ఈ లక్ష్యం చేరుకోకపోతే.. అదనంగా ఎంత పెట్టుబడి పెట్టాలనేది కూడా తెలుసుకోవాలి.
అలాగే మ్యూచువల్ ఫండ్ను ఎంచుకునేటప్పుడు, గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్లాన్ అందించిన రాబడిని తనిఖీ చేయాలి. రాబడుల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ పథకాల ర్యాంకింగ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ఆ స్కీమ్ నియమ నిబంధనలు, షరతులను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ పథకం ట్రాక్ రికార్డు, ఫండ్ మేనేజర్ నిర్వహణలోని ఆస్తుల గురించి కూడా ఆరా తీయాలి. సాధారణంగా ఎక్కువ ఆస్తులు నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్ సంస్థను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తుంటారు.
మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్కు సంబంధించినవి. అంటే ఇవి కూడా మార్కెట్ ఒడిదొడుకులకు గురవుతాయి. ఫలితంగా ఫండ్ పనితీరు సైతం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్లో మదుపు చేసేటప్పుడు, వివిధ రకాల ప్లాన్లను ఎంచుకోవడం ముఖ్యం. ఇది పెట్టుబడులలో ఉండే రిస్క్ను తగ్గిస్తుంది. మొత్తం పెట్టుబడుల రిస్క్ను ఇది సమతుల్యం చేస్తుంది. ఎక్కువ రిస్క్‌తో కూడిన కొన్ని ఫండ్స్ ఎంచుకుంటూ, అధిక రాబడిని పొందేవారు.. తక్కువ రిస్క్‌తో కూడిన కొన్ని ఫండ్స్‌ను సైతం ఎంచుకోవాలి.
ఫండ్ హౌస్లు దీని కోసం ఆన్లైన్ సలహా సేవలను కూడా అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ను ఎంచుకునేటప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ల సహాయం తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో అనేక సంస్థలు లేదా వ్యక్తులు ఇలాంటి సేవలను అందిస్తున్నారు. మదుపర్ల అంచనాలు, అవసరాలు, వ్యవధి, ఆదాయం, పెట్టుబడి సామర్థ్యం, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా వారు మెరుగైన పెట్టుబడి ఆప్షన్ను సూచిస్తారు.
కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది నిర్ణయించడానికి ముందుగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ అవసరాలు, పెట్టుబడి సామర్థ్యం, వ్యవధిని పరిగణనలోకి తీసుకుని మీకు సరిపోయే ప్లాన్ను ఎంచుకోండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి. సరైన ఫండ్లో పెట్టుబడి పెడితేనే మెరుగైన రాబడిని పొందుతూ ఆర్థిక లక్ష్యాలు సాధించగలుగుతారని గుర్తుంచుకోండి.
0 Comments:
Post a Comment