అప్పులు చేసి.. అన్నం పెట్టి
ఆవేదనలో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు
మచిలీపట్నం(గొడుగుపేట), గన్నవరం టౌన్, న్యూస్‌టుడే
రోజుకో రకంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కూరగాయల ధరలు కూడా పెరిగిపోతుండటంతో రూ.వేలు పెట్టుబడి పెట్టి విద్యార్థులకు ఎలా వండి పెట్టాలి..
ఇది మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులను వేధిస్తున్న ప్రశ్న. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో తరచూ అప్పులు చేసి పిల్లలకు వండిపెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గోరుముద్ద పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన బియ్యం, గుడ్లు, చిక్కీలు ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా మిగిలిన నిత్యావసరాలు వంట ఏజెన్సీలే సమకూర్చుకుంటున్నాయి. ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థి ఒక్కొక్కరికి రూ.7.48, ప్రాథమిక పాఠశాలల్లో వారికి రూ.4.97 చొప్పున ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లిస్తోంది. వీటితో పాటు నిర్వాహకులకు రూ.3,000 చొప్పన వేతనం చెల్లించాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు మాత్రం బిల్లులు ఇవ్వలేదు. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు విద్యార్థులకు వండి పెట్టిన బిల్లులతోపాటు గౌరవ వేతనాలు కూడా విడుదల కాలేదు. నవంబరులో కూడా సగం రోజులు గడిచిపోయాయి. ఈ పథకం నిర్వాహకులంతా పేదకుటుంబాలకు చెందినవారు కావడంతో అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టలేక అవస్థలు పడుతున్నారు.
తీవ్ర ఇబ్బందులు
సకాలంలో భోజన బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అసలే అంతంత మాత్రపు కుటుంబాలు కావడంతో అప్పులు చేసి పిల్లలకు భోజనాలు పెడుతున్నాం. ఏ నెలకు ఆనెల బిల్లులు ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- రజియా సుల్తానా, నిర్వాహకులు, గూడూరు
త్వరలోనే జమ
ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన బిల్లులు పూర్తిచేసి డైరెక్టరేట్‌కు పంపించాం. వీటిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల బిల్లులు సీఫ్‌ఎంఎస్‌లో ఉన్నాయి. అవి త్వరలోనే నేరుగా ఏజెన్సీ నిర్వాహకుల ఖాతాల్లో జమ అవుతాయి. ఆవెంటనే అక్టోబరు బిల్లు కూడా మంజూరవుతుంది.
- వేణుగోపాలరావు, పథకం ఏడీ
పేరుకుపోతున్న బకాయిలు
గతంలో మండలాల వారీగా బిల్లులు చేసి ఖజానా శాఖకు పంపిస్తే జిల్లాకు వచ్చిన నిధులను వారికి అందజేసేవారు. ప్రస్తుతం ఏరోజుకారోజు భోజనం చేసిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేస్తే ప్రతి నెలా నేరుగా వంట ఏజెన్సీ నిర్వాహకుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల వివరాలు క్రమం తప్పకుండా నమోదు చేస్తున్నారు. కానీ వారికి చెల్లించాల్సిన నిధులు మాత్రం విడుదల చేయడం లేదు.
జిల్లాలో మొత్తం పాఠశాలలు
3,127
విద్యార్థులు
3,20,83 మంది
0 Comments:
Post a Comment