విధాన నిర్ణయాలు ఏకపక్షమైతే.. కోర్టు జోక్యం చేసుకోవచ్చు
దేశ ప్రతిష్ఠతో ముడిపడిన రాజధాని
రైతుల హక్కులు పరిరక్షించకపోతే
భూసమీకరణ విధానానికే చెడ్డపేరు
ప్రభుత్వాలపై అపనమ్మకానికి వీలు
వికేంద్రీకరణ చట్టాలు రద్దుచేయాలి
రైతుల తరఫు న్యాయవాది దివాన్
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఏకపక్ష, విధానపరమైన నిర్ణయాలతో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ అన్నారు.
బుధవారం హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. ''మాస్టర్ ప్లాన్‌ని అమలుచేయాల్సిన ప్రజావిధి(పబ్లిక్ డ్యూటీ) ప్రభుత్వంపై ఉంది. మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోవడం అంటే అమరావతి ఆత్మను చంపేయడమే. రైతులకు ఇచ్చిన చట్టబద్ధ హామీలు అమలుచేయకపోతే ల్యాండ్ పూలింగ్ విధానం దేశవ్యాప్తంగా చెడ్డదిగా భావించే అవకాశం ఉంది. ఆ ప్రభావం రాష్ట్రంపైనే కాకుండా దేశం మొత్తం మీద పడుతుంది. ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోతుంది'' అని తెలిపారు. బుధవారం జరిగిన విచారణలో ఆయన తన వాదనలు ముగించారు. రైతు ఇడుపలపాటి రాంబాబు మరికొందరి తరఫున న్యాయవాది బీఎన్ సురేశ్ తన వాదనలు పూర్తి చేశారు. ఇతర వ్యాజ్యాలపై వాదనలు వినేందుకు విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొంతమంది రైతులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖ లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానంలో(భౌతికం, ఆన్‌లైన్) తుది విచారణ జరుపుతోంది. బుధవారం శ్యాం దివాన్ తన వాదనలు కొనసాగిస్తూ.... మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు గండిపడిందని చెప్పారు. ''భూకేటాయింపులు, కాంట్రాక్ట్‌లు అప్పగించే విషయంలో అధికారులు తప్పుచేస్తే వాటిని చక్కదిద్దాలి తప్ప మొత్తం ప్రాజెక్టునే రద్దు చేస్తామనడం సరికాదు. మాస్టర్ ప్లాన్‌కు చట్టబద్ధత ఉంది. సరైన కారణాలు లేకుండా దానికి సవరణలు, రద్దు చేయడానికి వీల్లేదు. అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని అప్పటి ప్రభుత్వం 2014లో తీర్మానం చేసింది. అందులో భాగంగా మూడు మెగాసిటీలు, 14స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా పాలనా వికేంద్రీకరణ చట్టం చేయాల్సిన అవసరం లేదు'' అని వాదించారు.
అంతా రివర్స్ చేశారు..
అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా మారిన పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రద్దు చేయాలని శ్యాం దివాన్ కోరారు. ''ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6, 93లో ఇంగ్లీష్ పదం 'ది క్యాపిటల్' అని స్పష్టంగా ఉంది. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపధ్యంలో దానిని ఒక రాజధాని అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఒకసారి ఏపీ రాజధాని అమరావతి అని నిర్ణయించిన తరువాత దానిని మార్చడానికి వీల్లేదు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తదుపరి వచ్చే ప్రభుత్వం కొనసాగించాల్సిందే. రాజకీయ కారణాలతో అవాంతరాలు సృష్టించడానికి వీల్లేదు. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ...2014లో ప్రభుత్వం తీర్మానం చేసింది. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలతో గతంలో తీసుకున్న నిర్ణయాలు రివర్స్ చేసినట్లు అయింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును పూర్తిగా వదిలేసింది. భూసమీకరణ పథకానికి సమాజంలో విలువ లేకుండా చేసింది'' అని తెలిపారు.
హక్కులు హరించారు
మూడు రాజధానుల నిర్ణయంతో రైతుల హక్కులు హరించారని శ్యాం దివాన్ అన్నారు. ''రాజధాని నిర్మాణం వల్ల కొత్త జీవితం వస్తుందనే ఉద్దేశంతో వంశపార్యంపరంగా వస్తున్న వ్యవసాయాన్ని పిటిషనర్లు త్యాగం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 30వేల రైతు కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుంది. భూములు ఇచ్చిన రైతులే కాకుండా భవిష్యత్తుతరాల ప్రయోజనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అభివృద్ధి చేసిన అమరావతిలో రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు. స్థానికసంస్థల సమ్మతి లేకుండా మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయడానికి వీల్లేదు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలతో భూసమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను సాధారణ వర్గంలోకి నెట్టేసినట్టు అయింది. వారిని ప్రత్యేక తరగతిగా(క్లా్‌స)గా చూడాలి. వారి హక్కుల రక్షించే క్రమంలో వారి త్యాగాలను ప్రత్యేకంగా చూడాల్సిందే. మాస్టర్ ప్లాన్‌ని అమలు చేయకపోవడం పూర్తిగా చట్టవిరుద్ధం' అని వాదించారు.
మళ్లీ అధ్యయనం అక్కర్లేదు
అమరావతి నిర్మాణం కోసం చేసుకున్న ఒప్పందాలకు చట్టబద్ధత ఉందనీ, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని శ్యాం దివాన్ అన్నారు. ''మూడు రాజధానుల నిర్ణయంతో పూర్వం చేసుకున్న ఒప్పందాలకు విలువ లేకుండా చేశారు. గుత్తేదారులు వారంతటవారే వైదొలిగేలా పరిస్థితులు కల్పించారు. ముందుగా నిర్ణయించిన మేరకే మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఆ కమిటీ నివేదికలకు చట్టబద్ధత లేదు. పునర్విభజన చట్టానికి అనుగుణంగా రాజధాని ఏర్పాటు విషయంలో సూచనలు చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీ వేశారు. కమిటీ నివేదిక పరిశీంచాక అప్పటి ప్రభు త్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజధాని ఏర్పాటుపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు'' అని శ్యాం దివాన్ వాదించారు.
''అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని అప్పటి ప్రభుత్వం 2014లో తీర్మానం చేసింది. అందులో భాగంగా మూడు మెగాసిటీలు, 14స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా పాలనా వికేంద్రీకరణ చట్టం చేయాల్సిన అవసరం లేదు''
''ప్రభుత్వ నిర్ణయాలు ప్రగతిశీలంగా ఉండాలిగానీ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లేవిగా ఉండకూడదు. సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలతో గతంలో తీసుకున్న నిర్ణయాలను రివర్స్ చేసినట్లయింది. వాటి కారణంగా అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది''
''రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది. ఆ సొమ్మును రాజధాని అభివృద్ధి కోసం కాకుండా ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడుకుంది''
- పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్యాం దివాన్
0 Comments:
Post a Comment