Gold Price: బంగారం, వెండి ధరలు పెరగనున్నాయా? కారణమేంటంటే..?
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి నగల ధరలు త్వరలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జీఎస్టీ రేట్లను సవరించాలని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ చేసిన సూచనల్లో.. బంగారం, వెండిపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ రేటును కూడా పెంచాలని ప్రతిపాదించడమే ఇందుకు కారణం. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే నూలు, వస్త్రాలు, మానవ తయారీ నారపై ఒకే రీతిన 12 శాతం జీఎస్టీ విధించే ఆదేశాలను ప్రభుత్వం ఇటీవల నోటిపై చేసింది. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమలౌతున్న నేపథ్యంలో దుస్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ బంగారం, వెండి ధరలు కూడా పెరిగితే షాపింగ్ ఇక భారం కానుంది!
ప్రస్తుతం అమల్లో ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్లాబ్ రేట్లను సవరించాలని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఐదు శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 7 శాతానికి, 18 శాతంగా ఉన్న స్లాబ్ రేటును 20 శాతానికి పెంచాలని ఈ కమిటీ సూచించింది. అలాగే వేర్వేరుగా ఉన్న 12, 18 శాతం స్లాబ్ రేట్లను కలిపి 17 శాతం చేయాలన్న ప్రతిపాదన కూడా చేసింది. ఇందులో భాగంగా బంగారం, వెండి వస్తువులపై 3 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి పెంచాలని ఈ కమిటీ సూచించింది. ఈ కమిటీ ప్రతిపాదనలను మంత్రులతో కూడిన ఉపసంఘం ఆమోదించిన తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. జీఎస్టీ స్లాబ్ రేట్లు సవరిస్తారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రుల ఉప సంఘం నవంబర్ 27న సమావేశం కానుంది. ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిసెంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వ్యాపార వర్గాల అసంతృప్తి
జీఎస్టీ రేటును సవరించాలన్న నిర్ణయంపై బంగారం, వెండి వర్తకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్ లాక్‌డౌన్, హాల్‌మార్కింగ్ తప్పనిసరి వంటి నిర్ణయాలతో చాలా వరకు వ్యాపారం దెబ్బతిందని, పెళ్లిళ్ల సీజన్ కారణంగా గత రెండు నెలల నుంచి మళ్లీ అమ్మకాలు పుంజుకున్నాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఒకవేళ జీఎస్టీ రేటు పెంచితే ధరలు పెరిగి అమ్మకాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అలాగే, బంగారం బ్లాక్ మార్కెట్‌కు తరలే అవకాశం ఉంటుందని, గోల్డ్ స్మగ్లింగ్‌కు దారితీస్తుందని అభిప్రాయ పడుతున్నాయి. వినియోగదారులు అనధికారిక కొనుగోళ్ల వల్ల వారు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment