DA: ఉద్యోగులకు త్వరలోనే డీఏ
సత్వరమే జోనల్ అమలు ప్రక్రియ
టీజీవోలతో సీఎం కేసీఆర్
, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కరవు భత్యం(డీఏ) విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
కొత్త జోనల్ విధానం అమలు ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామని, ఉద్యోగులను సర్దుబాటు చేసిన తర్వాత శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఇతర నేతలు సహదేవ్, వెంకటయ్య, కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ సీఎంను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అధికారులకు సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ వారితో మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగినందున జోనల్ విధానం అనుకున్న సమయానికి అమల్లోకి రాలేదని, ఉద్యోగాల భర్తీలో జాప్యానికి ఇదే కారణమని చెప్పారు. ఈ ఏడాది జూన్ 30న జోనల్ విధానం అమల్లోకి వచ్చాక.., దాని అమలుపై పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే ఉద్యోగుల వర్గీకరణ పూర్తయిందని, త్వరలోనే జిల్లాలు, శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారవుతుందని తెలిపారు. వెంటనే వారికి జోనల్‌లోని జిల్లాలకు ఐచ్ఛికాలు, సీనియారిటీ ఆధారంగా బదలాయింపులు ఉంటాయన్నారు. తద్వారా ఏర్పడే ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. జోనల్ ప్రక్రియ ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. జోనల్ విధానం అమలు, ఉద్యోగుల బదలాయింపులు, కొత్త నియామకాలకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. మమత, సత్యనారాయణ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తూ జోనల్ విధానం తెచ్చారని, దానిద్వారా ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు. జోనల్ అమలు ప్రక్రియకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా డీఏ గురించి టీజీవోలు ప్రస్తావించగా... సీఎం వెంటనే స్పందించి, త్వరలోనే ఇస్తామని చెప్పారు.
0 Comments:
Post a Comment