మూడు రాజధానులు, క్రిడా చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం నాటకీయంగా ఉపసంహరించుకుంది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే న్యాయపరమైన సమస్యలకు తావు లేకుండా కొత్తగా సమగ్ర బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం ద్వారా ఈ వివాదాన్ని ఇప్పట్లో ముగించదల్చుకోలేదని ఆయన చెప్పకనే చెప్పారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రాంతాలకు అతీతంగా మెజార్టీ ప్రజలు ఆకాంక్షించిన మాట వాస్తవం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గత టిడిపి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసిననాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. అందుకనే తన నివాసం రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో నిర్మించుకున్నట్లు ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చిన వెంటనే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెర పైకి తెచ్చారు. అమరావతి భగ్గుమంది. ఇప్పటికీ రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో రాజధాని నిర్మాణానికి బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిలువెత్తు వంచనకు పాల్పడిన వైనం తెర చాటుకు పోయింది.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాదే కొనసాగుతుందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా, తొలి ఏడాది బడ్జెట్ లోటును కేంద్ర బడ్జెట్‌తో భర్తీ చేయడం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక పన్ను రాయితీలు, పోలవరాన్ని కేంద్ర నిధులతో పూర్తిచేయడం వంటి వాగ్దానాలూ ఇచ్చింది. కాని అమరావతి నిర్మాణానికి పునాది పడినరోజే చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టితో మోడీ సర్కార్ తన బాధ్యతకు సమాధి కట్టేసింది. విభజన చట్టంలోని హామీలను సాధించుకోవడంలో నాటి టిడిపి ప్రభుత్వమూ చొరవ చూపలేదు. ఇప్పటి వైసిపి ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. 2024 వరకూ రాజధానిగా హైదరాబాద్‌లో కొనసాగే అవకాశాన్ని చేజార్చుకోవడం, గొప్పలకు పోయి రాజధాని, పోలవరం బాధ్యతలను నెత్తినేసుకోవడం వంటి తప్పిదాలను టిడిపి చేస్తే ఇప్పుడు మరోవిధంగా వైసిపి కూడా కేంద్రం బాధ్యతారాహిత్యం మీద గట్టిగా నిలదీయడం లేదు. ఇప్పటికైనా కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను, నిధులను సాధించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. అంతేకాని తప్పు మీదంటే మీదే అంటూ అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటే అసలు జవాబుదారీ అయిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేదెవరు? కేంద్రం ఆటలకు మద్దెల వాయించడం మానుకొని బిజెపిని నిలదీసి నిధులు, హక్కులు సాధించుకోవాలి.
రాజధానిని మూడు భాగాలుగా విడగొట్టి మూడు చోట్ల ఏర్పాటు చేయడమే అభివృద్ధి వికేంద్రీకరణగా ప్రభుత్వం చేస్తున్న వాదన కూడా అసంబద్ధమైనదే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల లోనూ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఆయా ప్రాంతాల వనరులను, పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి వుంటుంది. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం వంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బాధ్యత కూడా కేంద్రానిదేనన్న సోయి రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు లేకపోవడమే శోచనీయం. ఇప్పటికైనా వివాదానికి తెర దించి, ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. ప్రతిపక్షాలను కలుపుకొని ఉమ్మడిగా పోరు సల్పి కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, నిధులు, హక్కులను సాధించుకోవాలి.
0 Comments:
Post a Comment