Dt.20/11/21
భూములిచ్చిన రైతులను చట్టం ముసుగులో మోసం చేస్తోంది
అనుచిత లబ్ధి కోసం శాసనాధికారాన్ని దుర్వినియోగం చేసింది
బిల్లులను ఆమోదించే క్రమంలో రాజ్యాంగ ఉల్లంఘనలు
రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ వాదనలు
రాజధాని వ్యాజ్యాలపై విచారణ సోమవారానికి వాయిదా
ఈనాడు, అమరావతి: రాజధాని వ్యాజ్యాల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు దుయ్యబట్టారు. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వరుసగా ఐదో రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. అమరావతికి భూములిచ్చిన రైతులను సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. భూములిచ్చిన రైతులకు రాజధాని అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పి చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఇదే తరహా ఒప్పందం ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగి ఉల్లంఘనకు గురైతే దాన్ని ‘మోసం’ అంటారని వివరించారు. అమరావతి కోసం రైతులు ఇచ్చిన వేల ఎకరాలకు తానే యజమాని అన్నట్లు ప్రభుత్వ వ్యవహరిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం చేయం.. భూములను మాత్రం తామే ఉంచుకుంటామంటే ఎలా అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. జీవనాధారం వదులుకొని పేద రైతులు ఇచ్చిన భూములను తీసుకొని.. తమకు నచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు. అనుచిత లబ్ధి పొందడం కోసం పాలన వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చి శాసనాధికారాన్ని దుర్వినియోగం చేసిందని తెలిపారు. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను తీసుకొచ్చే క్రమంలో ప్రతి దశలోనూ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని వాదించారు. ప్రభుత్వ వ్యవహార శైలిని ‘రాజ్యాంగం పట్ల వంచన’గా పేర్కొన్నారు.
శుక్రవారం జరిగిన విచారణలో అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు పానకాలరెడ్డి, మరికొందరి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధాని వ్యాజ్యాలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
* సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ..‘రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన స్థలాలను ‘నవరత్నాలు’ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం చూస్తోంది. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చకపోవడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఒప్పందం నుంచి ప్రభుత్వం వైదొలగాలంటే.. పూర్వస్థితిలో భూముల్ని తిరిగి ఇవ్వాలి, పరిహారం చెల్లించాలి. ప్రజల హక్కులకు విఘాతం కలిగే రీతిలో ప్రభుత్వాలు శాసనాలు చేసినప్పుడు వాటిపై సమీక్షాధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సీఆర్‌డీఏ చట్టం రైతులకు కల్పించిన రక్షణను ఏఎంఆర్‌డీఏ చట్టంతో తొలగించారు. దీంతో రైతుల హక్కులకు భంగం కలుగుతోంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను కొట్టేయండి’ అని కోరారు.
సభా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది: సీనియర్ న్యాయవాది రవిశంకర్
ఎమ్మెల్సీ అశోక్‌బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను పాస్ చేసే క్రమంలో ప్రభుత్వం సభా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది. శాసన మండలి ఛైర్మన్ బిల్లులను సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. కమిటీని ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. అయితే అలా చేయలేదు. ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి నిర్లక్ష్యం చేశారు. దీన్ని సవాలుచేస్తూ మండలి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్(ఏజీ).. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపినట్లు హైకోర్టుకు నివేదించారు. అందుకు భిన్నంగా కార్యదర్శి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తూ.. సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయలేదని న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారు. ఆరు నెలల గడువు ముగియక ముందే శాసనసభలో మరోసారి బిల్లులు ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ ఆమోదం కోసం పంపే బిల్లులు శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ సంతకం తప్పని సరి. ఛైర్మన్ సంతకం లేకుండా స్పీకర్ బిల్లులను గవర్నర్‌కు పంపడం రాజ్యాంగాన్ని వంచించడమే. ఇరువురి సంతకాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించకుండా గవర్నర్ బిల్లులను ఆమోదించడం చట్ట విరుద్ధం. ఈ నేపథ్యంలో ఆ చట్టాలకు విలువ ఉండదు. బిల్లులను ఆమోదించుకునే క్రమంలో ప్రభుత్వం ప్రతి దశలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది’ అన్నారు.
Dt.19/21/21
రాజధానిగా ఏది మంచిదో చెప్పం!
ప్రభుత్వం తెచ్చిన చట్టాల చట్టబద్ధతను తేలుస్తాం
హైకోర్టు స్పష్టీకరణ భూములు ఇచ్చిన వారిలో
చిన్న రైతులే ఎక్కువ
అక్బర్, తుగ్లక్ కూడా
రాజధానులు మార్చారు మళ్లీ పూర్వ స్థానానికే వచ్చారు
'అమరావతి'పై పిటిషనర్ల బలమైన వాదనలు
గత ప్రభుత్వంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ
మూడు రాజధానులతో ఇప్పుడు చేసిందేమీ లేదు
భూములు ఇచ్చిన వారిలో చిన్న రైతులే ఎక్కువ
అక్బర్, తుగ్లక్ కూడా రాజధానులు మార్చారు
వారు మళ్లీ పూర్వ స్థానానికే వచ్చేశారు
శివరామకృష్ణన్ నివేదిక మేరకు 'అమరావతి'
న్యాయవాదుల స్పష్టీకరణ విచారణ నేటికి వాయిదా
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ''రాష్ట్ర రాజధానిగా ఏ నగరమైతే బాగుంటుందో తేల్చడానికి మేం ఈ వ్యాజ్యాలపై విచారణ జరపడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు చట్టబద్ధమైనవేనా... కాదా... అనే విషయాన్ని మాత్రం తేలుస్తాం'' అని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేతప్ప రాజధానిగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, అమరావతి నగరాలలో ఏది ఉత్తమమైనదో తాము తేల్చడం లేదని పేర్కొంది. ఇది నగరాల మధ్య పోటీ వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. 'మూడు రాజధానుల'కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ఽత్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, ఉన్నం శ్రవణ్‌కుమార్, సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
'మూడు' వెనుక దురుద్దేశం...
రాజధాని నగరం ఎంపికపై సూచనలు చేసేందుకు విభజన చట్టంలోనే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారని న్యాయవాది ఉన్నం మురళీధరరావు గుర్తు చేశారు. కమిటీ తన ప్రతిపాదనల్లో వీజీటీఎం (విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి) ప్రాంతాన్ని రాజధాని ఏర్పాటుకు అనుకూలనమైనదిగా పేర్కొందని తెలిపారు. ''శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం సరికాదు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని మెజార్టీ ప్రజలు కోరుకున్నట్లు నివేదికలో ఉంది. సరైన చట్టం లేకుండా ల్యాండ్ పూలింగ్‌కి వెళ్లవద్దని కమిటీ సూచించింది. ఆ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం తీసుకొచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపించింది. కానీ... అక్కడ మూడు రాజధానుల భావన విఫలమైందని ఆ దేశ నిపుణులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన రికార్డులను కోర్టుముందు ఉంచాము.
అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వల్ల సహజంగా ప్రయోజనాలు ఉన్నాయి. కృష్ణానది పక్కన ఉండంటతో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నీ నదీ తీరాన ఉన్నవే. రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల రాకపోకలకు అనువుగా ఉంటుంది. భూసమీకరణకు ఇబ్బంది లేదు. ప్రకృతి విపత్తుల ప్రభావం అమరావతిపై తక్కువ. హైదరాబాద్, చెన్నైతో పోలిస్తే నిర్మాణ వ్యయం తక్కువ. రాజధాని కోసం కేంద్రం 5వేల ఎకరాలకు పైగా అటవీ భూములను డీనోటిఫై చేసింది. ఇతర నగరాలతో పోలిస్తే రాజధానిగా అమరావతి అనువైందని గత ప్రభుత్వం భావించింది'' అని మురళీధరరావు వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయనే వాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని... నిజానికి, వికేంద్రీకరణ గురించి గత ప్రభుత్వమే ఆలోచన చేసిందని తెలిపారు. ''అమరావతితోపాటు మరో 3 మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలని అప్పుడే నిర్ణయించారు. ప్రస్తుత పాలన వికేంద్రీకరణ బిల్లుతో కొత్తగా చేసేది ఏమీ లేదు. రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు'' అని తెలిపారు. నాడు జగన్ చేసిన ప్రకటనను కోర్టులో ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరారు.
''అధికారంలోకి రాగానే జగన్ మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన రైతుల వాదనలు వినలేదు. ఏకపక్షంగా నివేదికలు ఇచ్చాయి. వాటికి చట్టబద్ధత లేదు'' అని వాదించారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు చేయడం వెనుక ప్రభుత్వం, పలువురు మంత్రులు దురుద్దేశంతో వ్యవహరించారని తెలిపారు.
చిన్న రైతులే ఎక్కువ...
పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... ''అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలో మెజార్టీ ప్రజలు చిన్న రైతులే. సీఆర్‌డీఏ చట్టానికి చట్టబద్ధత కల్పించడంతో ఫలితం దక్కుతుందని ఆశించి భూములు ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనతో వారి హక్కులకు భంగం కలిగింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చు. మూడు రాజధానుల ప్రకటనకు అధికారంలో ఉన్న పార్టీ మారిందనే ఒక్క కారణం తప్ప మరే ఇతర కారణం లేదు'' అని అన్నారు.
ప్రభుత్వ వాదనలో అర్థం లేదు...
రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ అంతిమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు పేర్కొన్నారు. దాని ఆధారంగానే నాటి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందన్నారు. ''అమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల ఇతర ప్రాంతాల వారు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం సరికాదు. అంత అసంతృప్తి ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పుడే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? అమరావతి తమదనే భావన ఇతర ప్రాంతాల ప్రజలకు కలగడం లేదని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదు. దేశం మొత్తానికి ఒకే రాజధానిగా ఉంది. దానిని అందరూ అంగీకరించడం లేదా? రాజధానిగా అమరావతిని నిర్ణయించే విషయంలో అప్పటి ప్రభుత్వం తొందరపడిందని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. మరి... ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి?'' అని ప్రశ్నించారు. వికేంద్రీకరణ బిల్లుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆదినారాయణరావు తెలిపారు.
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గడువుకంటే ముందుగానే హైపవర్ కమిటీ తన నివేదకను ప్రభుత్వానికి అందజేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే తొందర కనపడిందని చెప్పారు. ''పునర్విభజన చట్టంలో 'ది క్యాపిటల్' అనే పదానికి ఒకటి కన్నా ఎక్కువ అనే అర్థం వస్తుందని ప్రభుత్వం పెడార్థాలు తీస్తోంది. చట్టంలో పేర్కొన్న విధానం ఒక రాజధాని ఏర్పాటునే సూచిస్తుంది. పిల్లి తన పిల్లలను ఇంటింటికీ మార్చినట్లు రాజధానులు మార్చడానికి వీల్లేదు. గతంలో అక్బర్, తుగ్లక్ చక్రవర్తులు రాజధానులు మార్చి... తిరిగి పూర్వరాజధానికి వచ్చిన చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి'' అని తెలిపారు. సీఆర్‌డీఏ చట్టం చేసేటప్పుడు అప్పటి ప్రభుత్వం ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకోలేదంటూ శాసనసభ వ్యవహారాలను తప్పుబట్టే రీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు. ''శాసనాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని చట్టసభలే పునఃసమీక్షిస్తాయి. లేదా న్యాయస్థానాలు ఆ విషయాన్ని తేలుస్తాయి. చట్టసభలు చేసిన శాసనాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరం చెప్పడం సరికాదు'' అని తెలిపారు.
అమరావతి భూముల కొనుగోలు విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారన్నారు. దీనిపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులను సమర్ధించిందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చిన సందర్భం దేశంలో ఇదే మొదటిసారని... దానిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆదినారాయణరావు పేర్కొన్నారు. వాదనలను విన్న అనంతరం ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
రాజధాని నిర్ణయించి, కేంద్రం నిధులిచ్చిన తర్వాత ఎలా మారుస్తారు?
ఆ హక్కు రాష్ట్రానికి లేదు
ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములిచ్చారు
రాజధాని అమరావతిపై హైకోర్టులో రెండో రోజు కొనసాగిన వాదనలు
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి.
విచారణ సందర్భంగా 'రాజధాని రైతు పరిరక్షణ సమితి' తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. రెండో రోజు విచారణ వివరాలను హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మీడియాకు వివరించారు.
''అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో నిన్న ప్రారంభమైన వాదనలు ఈరోజు కూడా కొనసాగాయి. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు ఏవిధంగా చట్ట వ్యతిరేకమో న్యాయవాది శ్యాం దివాన్ వివరించారు. అనేక చట్టపరమైన అంశాలను ఆయన వాదనలో ప్రస్తావించారు. పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు .. హైదరాబాద్ అనే భాగ్యనగరాన్ని ఏపీ కోల్పోతోంది కాబట్టీ... అందుకు ప్రత్యామ్నాయంగా ఒక మహానగరాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వమే తగిన సహాయం చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు ఏర్పడినప్పడు చేసిన చట్టాల్లో ఇలాంటి విషయం ఎక్కడా లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ప్రత్యేకంగా రాజధాని నిర్మాణానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఏవిధంగా సాయం చేయాలనేదానిపై విభజనచట్టంలో ప్రస్తావించారు. పార్లమెంట్ చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని ఒకసారి నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇక్కడ ఖర్చు చేసిన తర్వాత రాజధాని మార్చేస్తామనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాజధాని నిర్ణయం ఒకేసారి ఉండాలనేది పార్లమెంట్ చట్టం స్పిరిట్. రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా మరో చట్టం తీసుకురావడానికి వీల్లేదు.
ప్రభుత్వ హామీని నమ్మే రైతులు భూములిచ్చారు
సీఆర్‌డీఏ చట్టం తీసుకురావడం, దానిలో అంతర్భాగంగా మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం చేయడం జరిగింది. 29 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వాధికారులు రైతులతో సంప్రదింపులు జరిపి .. అనేక హామీలు ఇచ్చి, అభివృద్ధికోసం భూములు ఇవ్వాలని చెప్పి రైతులను ఒప్పించారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్ని ప్రక్రియలు చట్ట పరంగానే జరిగాయి. మాస్టర్ ప్లాన్ సీఆర్డీఏలో అంతర్భాగం అయినప్పుడు, మాస్టర్ ప్లాన్ ప్రకారమే నవ నగరాలు నిర్మిస్తామని ప్రతిపాదన చేశారు. అందుకు కొంత కాలపరిమితి కూడా పెట్టారు. పెద్ద నగరాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో నివసించే ప్రజల జీవన స్థితిగతులు మారిపోతాయని ప్రజలకు చెప్పారు. విద్య, వైద్య సంస్థలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఇదంతా నమ్మి రైతులు భూములు ఇస్తే .. సరైన కారణం లేకుండా, చట్ట ప్రకారం ఇచ్చిన హామీని ఉల్లంఘించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
రైతులకు రూ.33వేల కోట్ల ఆదాయం లేకుండా చేసే హక్కు లేదు
రాజధాని నిర్ణయం తీసుకునేముందు ఈ ప్రాంతంలో భూమి విలువ గజం రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ఉందని ప్రభుత్వం నియమించిన ఆస్తుల మదింపు కమిటీ చెప్పింది. రాజధాని ఏర్పడితే ఈ ప్రాంతంలో గజం విలువ రూ.44 వేల నుంచి రూ.86వేల వరకు పెరుగుతుందని అప్పట్లో కమిటీ స్పష్టం చేసింది. అమరావతి, విజయవాడలో భూముల విలువలు ఎలా పెరుగుతాయో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు అంచనాలు వేసి చెప్పాయి. ఆ విధంగా భూమి అభివృధ్ధి చేసిన తర్వాత రైతలుకు ఇచ్చే భూమిలో ఎకరానికి 1250 గజాల చొప్పున లెక్కగడితే.. ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు మించి ఇవ్వాల్సి వస్తోంది. దాదాపు రూ.33వేల కోట్ల రూపాయల ఆదాయం రైతులకు లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉందని రైతుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇలాంటి వివాదాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు, రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు వచ్చిన సమస్యలు, రాష్ట్రాలు చట్టాలు చేసేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలపై పలు తీర్పులను ధర్మాసనం ముందు పెట్టారు. రేపు కూడా ఆయన వాదనలు కొనసాగించనున్నారు. న్యాయవాది శ్యాం దివాన్.. వాదనలు చేసేటప్పుడు పలుమార్లు 'అవర్ క్యాపిటల్' అని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కిశోర్ మిశ్రా... న్యాయవాదిని ఉద్దేశించి.. 'అమరావతి మీ రాజధానే మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని. భారతదేశం.. స్వాతంత్ర్యం తెచ్చిన సమరయోధులదే కాదు...దేశ ప్రజలందరిదీ' అని వ్యాఖ్యానించారు
Ap News: రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
AP Highcourt Amaravati : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !
0 Comments:
Post a Comment