త్వరలో మరో మహాపాదయాత్ర
అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ వెల్లడి
ప్రస్తుత పాదయాత్రకు సంఘీభావంగా విజయవాడలో మినీ యాత్ర
విజయవాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర పూర్తికాగానే మరో మహాపాదయాత్రను ప్రారంభిస్తామని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ నేతలు ప్రకటించారు.
ప్రస్తుతం జరుగుతున్న మహాపాదయాత్రకు సంఘీభావంగా విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో మంగళవారం సంఘీభావ పాదయాత్రను నిర్వహించారు. గుణదలలోని పడవలరేవు సెంటర్ నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు నాలుగు కిలోమీటర్ల వరకు యాత్ర సాగింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని నినాదాలు చేశారు. రైతులు చేస్తున్న మహాపాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని, దీనికి భిన్నంగా పాదయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో పూలవర్షం కురుస్తోందన్నారు. యాత్ర తిరుమలకు చేరుకునేలోగా కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయడం తమ విజయమని పేర్కొన్నారు. పాదయాత్రలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మహిళా జేఏసీ కన్వీనర్ పెన్మత్స దుర్గాభవాని, సభ్యులు సుంకర పద్మశ్రీ, యలమంచిలి అంజలి, గద్దె అనురాధ, రావి సౌజన్య, టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment