ప్రభుత్వ కార్యాలయమైనా కట్టాల్సిందే!!
విద్యుత్తు బకాయిలపై ఈఆర్‌సీ ఆగ్రహం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు (ఈపీడీసీఎల్) బకాయిలు గుదిబండగా మారుతున్నాయి.
వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 150 కోట్లకు పైగా విద్యుత్తు బిల్లులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సి ఉంది.
ప్రతినెలా ఇవి అంతకంతకు పెరుగుతుండటంపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిర్ణీత గడువులోగా ఆ బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వ, స్థానిక సంస్థలకు విద్యుత్తు సరఫరా నిలిపేయాలని డిస్కంలను ఆదేశించింది. దీంతో ఈపీడీసీఎల్ అధికారులు ఎలాగైనా వసూలు చేయాలని భావిస్తున్నారు. మరో వైపు కార్యాలయాల నిర్వహణకే సొమ్ములు లేకుంటే కరెంటు బిల్లులు ఎలా చెల్లించగలమని పలువురు అధికారులు అంటున్నారు.
జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు 16,71,979 వరకు ఉన్నాయి. వీటి నుంచి ప్రతినెలా సుమారు రూ. 410 కోట్లు బిల్లుల రూపంలో వసూలు కావాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుతు వినియోగదారులు ప్రతినెలా బిల్లులు చెల్లించేస్తుంటారు. ఒకవేళ చెల్లించకుంటే విద్యుత్తు సరఫరా నిలిపేస్తుంటారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల విషయంలో మాత్రం దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వ సంస్థలే కదా ఎప్పుడో ఒకనాడు చెల్లిస్తాయని భావిస్తున్నారు. దీంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. వీటిని వసూలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా కరెంటు సరఫరా నిలిపేయాలని విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది.
* నిధులు వస్తేనే: జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సంబంధించి 26,849 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి గత నెలాఖరు నాటికి సుమారు రూ. 153 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని ఈపీడీసీఎల్ అధికారులు తేల్చారు. వీటిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ. 46 కోట్లు ఉంటే అత్యధికంగా స్థానిక సంస్థల నుంచి రూ. 107 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నామని, అక్కడి నుంచి నిధులు మంజూరు చేస్తే చెల్లించగలమని అంటున్నారు.
కొన్ని శాఖల వారీగా విద్యుత్తు బకాయిలు (రూ. కోట్లలో)
వైద్యారోగ్య శాఖ 6.51
గ్రామీణ నీటి సరఫరా 1.18
విద్యా శాఖ 7.87
సాంఘిక సంక్షేమం 2.39
ఇతర శాఖలు 5.95
పంచాయతీలు 99.72
మున్సిపల్ కార్పొరేషన్ 1.29
పురపాలక సంఘాలు 6.26
నోటీసులిస్తాం...
బకాయిలపై ఏపీఈఆర్‌సీ స్పష్టంగా చెప్పింది. వారి సూచనల మేరకు బకాయిపడిన సంస్థలన్నింటికి ముందు నోటీసులు ఇస్తాం. 14 రోజుల్లోగా చెల్లించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన లెక్కలు సిద్ధం చేస్తున్నాం.
- సూర్యప్రతాప్, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్
0 Comments:
Post a Comment