✍ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ
♦ఉచిత చదువు, తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు కారణం
♦కరోనా కారణంగా పెరిగిన ప్రైవేటు ట్యూషన్లు
♦ప్రథమ్ సంస్థ ఆసర్ నివేదికలో వెల్లడి
*🌻ఈనాడు, అమరావతి:* దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 4.5% ప్రవేశాలు పెరిగాయి. నిరుడు (2020) 65.8% ప్రవేశాలు ఉండగా... ఈసారి 70.3 శాతానికి చేరింది. ఇందుకు... కరోనాతో వచ్చిన ఆర్థిక కష్టాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సౌకర్యాలు, లాక్‌డౌన్‌తో వలసలు, ప్రైవేటులో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటివి కారణాలని ప్రథమ్ సంస్థ విడుదల చేసిన 16వ గ్రామీణ వార్షిక విద్యా స్థితి నివేదిక(ఆసర్) పేర్కొంది. 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఫోన్ ద్వారా నిర్వహించిన సర్వే నివేదికను బుధవారం విడుదల చేసింది. కొవిడ్ తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపుతున్నందున విద్యా వ్యవస్థలో మార్పును గ్రహించేందుకు ఈ సర్వే నిర్వహించింది.
♦ప్రైవేటులో అబ్బాయిలే ఎక్కువ
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య పెరిగినా... ఇప్పటికీ ప్రయివేటు పాఠశాలల్లో అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. అన్ని తరగతుల్లోనూ బాలురు, బాలికలు ట్యూషన్ వెళ్లేవారు పెరిగారు. తల్లిదండ్రులు తక్కువగా చదువుకున్న వారిలో 12.6%, బాగా చదువుకున్న వారిలో 7.2% మంది పెరిగారు. 2020 సర్వే ప్రకారం 32.5% మంది ట్యూషన్లకు వెళ్లగా... ప్రస్తుతం 40 శాతానికి పెరిగారు. ఈ కారణంగా పేద పిల్లలకు, ట్యూషన్‌కు వెళ్తున్న వారికి మధ్య అభ్యసన వ్యత్యాసం ఉంటోంది. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఇంటి వద్ద తల్లిదండ్రులు చదువు చెప్పేలా చూడాలని, పిల్లలకు ఎలా సాయం చేయాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించింది. సంప్రదాయ బోధన, అభ్యసనను మిళితం చేయాలని నివేదిక సూచించింది.
♦చదువులో తండ్రుల సాయం తక్కువే
* పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఇళ్ల వద్ద విద్యార్థులకు తల్లిదండ్రులు చదువు చెప్పడం తగ్గింది. పిల్లలకు చదువులో సాయం చేయడంలో తండ్రులు సంఖ్య తక్కువగా ఉంది. ఆన్‌లైన్ తరగతుల కారణంగా 2018తో పోల్చితే స్మార్ట్‌ఫోన్ల సంఖ్య రెండింతలు పెరిగింది. గతంలో 36.5% మందికి స్మార్ట్‌ఫోన్లు ఉండగా... ఇప్పుడది 67.6 శాతానికి పెరిగింది.
* 6-14 ఏళ్ల వయస్సు వారిలో బడికి వెళ్లని విద్యార్థుల శాతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. జాతీయ స్థాయిలో 4.6 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2018 సంవత్సరంలో 1.2% ఉండగా... 2020లో 6.4 శాతానికి పెరిగింది. తెలంగాణలో 11.8% మంది పిల్లలు బడుల్లో చేరలేదు. ఈ సంఖ్య 2018లో 0.6% ఉండగా.. 2020లో 4.4 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 15-16 ఏళ్ల విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. ఇది 2018లో 57.4% ఉండగా ప్రస్తుతం 67.4శాతానికి పెరిగింది.
* ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తగ్గాయి.
* పాఠశాలలు పునః ప్రారంభమైన చోట ఇంటి పనిలో భాగంగానే అదనపు మెటీరియల్‌ను ఇస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో సంబంధం లేకుండా విద్యార్థులకు ఇచ్చే మెటీరియల్ పాఠశాలలు తెరిచిన చోట ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 91.9% మంది పిల్లలకు పాఠ్యపుస్తకాలు ఉన్నాయి.
♦జాతీయ సర్వే ఇలా..
గ్రామాలు: 17,184
కుటుంబాలు: 76,706
5-16ఏళ్ల పిల్లలు: 75,234
పాఠశాలలు: 7,299
♦ఏపీలో ఇదీ పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 2018లో 62.2%, 2020లో 66.9% ఉండగా, 2021లో 70.6 శాతానికి పెరిగారు. నిరుటితో పోల్చితే పెరుగుదల జాతీయ స్థాయిలో 6.1% ఉండగా... ఏపీలో 8.4% ఉంది. రాష్ట్రంలో ప్రైవేటు ట్యూషన్‌కు వెళ్తున్న వారు గతేడాది 4.1% ఉండగా... ఈ ఏడాది 22.9 శాతానికి పెరిగారు. పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన వారిలో 72.3% మందికి ఇంటి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. 57.3% మంది ప్రభుత్వ విద్యార్థులకు, 76% మంది ప్రైవేటు విద్యార్థులకు చదువులో ఇంటివద్ద తల్లిదండ్రులు సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో 390 గ్రామాల్లో 4,442 కుటుంబాలు, 1,507 మంది 5-16 ఏళ్ల మధ్య వయసు వారి నుంచి వివరాలు సేకరించారు.
♦తెలంగాణలో ఇదీ పరిస్థితి
తెలంగాణలో 6-14 ఏళ్ల వయసు వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 2018లో ప్రవేశాలు 56.4%, 2020లో 54.8% ఉండగా 2021లో 60 శాతానికి పెరిగాయి. పెరుగుదల జాతీయ స్థాయిలో 6.1 శాతంగా ఉండగా... రాష్ట్రంలో 3.7 శాతం మాత్రమే ఉంది. ట్యూషన్‌కు వెళ్తున్న వారు గతేడాది 5.3% ఉండగా ప్రస్తుతం 9.6శాతంగా ఉంది. పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన వారిలో 79.3% మందికి ఇంటి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఫోన్ల సంఖ్య 33.5% పెరిగింది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 59.4% మందికి, ప్రైవేటులో 63.8% మంది పిల్లలకు తల్లిదండ్రులు ఇంటి వద్ద చదువు చెబుతున్నారు. రాష్ట్రంలో 270 గ్రామాల్లో 3,254 కుటుంబాలు, 1,115 మంది 5-16 ఏళ్ల మధ్య వయసు వారి నుంచి వివరాలు సేకరించారు.
0 Comments:
Post a Comment