విద్య చుట్టూ.. వివాదాలు..!
విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఆందోళనలే..
నేడు జాతీయ విద్యా దినోత్సవం.
అందరూ చదవాలి..
అందరూ ఎదగాలి ఇదీ సమగ్ర శిక్షాభియాన్ నినాదం. దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేస్తూ విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని విధానాలు సత్ఫలితాలు సాధిస్తుంటే మరికొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
ఇటీవల సర్కారు అమలులోకి తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం, ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మఒడి, ఆంగ్ల మాధ్యమ బోధన, చదవటం మాకిష్టం, నాడు-నేడు వంటి కార్యక్రమాలు విద్యాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. దేశంలో అక్షరాస్యత పెరగడానికి, విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అందరికీ విద్య అందేలా కృషిచేసిన మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 11వ తేదీన జాతీయ విద్యాదినోత్సవం జరుపుకొంటున్నాం.
ఎయిడెడ్‌పై తొలిపోరు..
జిల్లాలో 89 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటిలో 71 అన్ ఎయిడెడ్‌గా మారడానికి సమ్మతించాయి. వీటిలోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో తల్లిదండ్రుల అనుమతితో చేర్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని జ్ఞానాపురం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఎయిడెడ్ విలీనం వల్ల పేదలకు విద్య భారమవుతుందని ఆందోళన చేపట్టారు. తర్వాత అనేకచోట్ల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు రేగడంతో విలీనానికి బలవంతమేమీ లేదని సర్కారు ప్రకటించింది. విలీనం నుంచి వెనక్కిరాకుంటే ఆ పాఠశాలలు ప్రైవేటు సంస్థలుగా మారిపోనున్నాయి.
3,4,5 తరగతుల విలీనంపై..
నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో 146 పాఠశాలలకు చెందిన 16 వేల మంది విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది.
* నర్సీపట్నం మండలం వేములపూడి ప్రాథమిక పాఠశాలలో 169 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3-5 తరగతులకు చెందిన 119 మందిని అదే ప్రాగంణంలోని బాలికల హైస్కూల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. బాలికల హైస్కూల్లో బాలురను పంపడానికి కుదరదంటూ మరుసటి అధికారుల నుంచి మౌఖిక సూచనలు వచ్చాయి. దీంతో పిల్లలు మళ్లీ ప్రాథమిక పాఠశాలలోనే ఉండిపోయారు.
* బుచ్చెయ్యపేట మండలంలో దిబ్బిడి, విజయరామరాజుపేట పాఠశాలల్లో పిల్లలను వేరే పాఠశాలకు తరలించే విషయంలో తల్లిదండ్రులు, గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
సీఆర్టీలు లేక.. బడుల మూత
ఏజెన్సీలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని 139 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సీఆర్టీల నియామకాల పునరుద్ధరణలో నెలల తరబడి జాప్యం జరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు ఆయా బడులన్నీ మూతపడే ఉన్నాయి. ఆశ్రమ పాఠశాల్లోనూ మరో 122 మంది సీఆర్టీలను నియమించకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్ట్ బోధన నిలిచిపోయింది. మన్యంలో గిరిజన తెగల పిల్లలకు వారి భాషలోనే బోధిస్తేనే విద్య సులువుగా అర్థమవుతుందనే ఉద్దేశంతో 708 మంది భాషా వాలంటీర్లను గతంలో నియమించారు. కోందు, ఒరియా, కొండ భాషలలో వీరు బోధిస్తుంటారు. ఈ ఏడాది ఆ వాలంటీర్ల నియామకాల పునరుద్ధరణ జరగలేదు. వీరి సేవలను పునరుద్ధరించాలని ఇటీవల ఏపీ ఆదివాసీ జేఏసీ, గిరిజన సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిపై ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పుష్ఫశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి వారి సేవలను పునరుద్ధరణకు సంబంధించి అనుమతి తీసుకున్నారు. దీంతో విద్యా సంవత్సరం మొదలైన మూడు నెలలు తర్వాత ఈ పాఠశాలలు తెరుచుకునే అవకాశం కలిగింది.
కొత్త..కొత్తగా..
* జిల్లాలో నాడు-నేడు పథకం ద్వారా రూ. 310 కోట్లతో మొదటి దశలో 1,133 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు. గతంలో అధ్వానంగా ఉండే బడులన్నీ నేడు చూడడానికి కొత్తగా కనిపిస్తున్నాయి. బల్లలు, ప్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. మరుగుదొడ్లు మెరుగుపడ్డాయి.
* అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలకు రూ.15 వేలు చొప్పున జమచేస్తున్నారు. గతేడాది జిల్లాలో 4.10 లక్షల మందికి ఈ ఆర్థిక సాయం అందింది. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
* ఈ ఏడాది ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తిచేసి పంపించారు. ప్రభుత్వ పాఠశాలల్లోను ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధించే అవకాశం రావడంతో చాలామంది ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను సర్కారు పాఠశాలలకు మార్చేస్తున్నారు. గతేడాది కంటే 38 వేల మంది విద్యార్థులు కొత్తగా చేరారు.
* విద్యావిధానంలో వచ్చే మార్పులపై మొదట్లో కొంత గడబిడ ఉన్నా తరువాత అంతా సర్దుకుంటుందని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీఈవో చంద్రకళ చెబుతున్నారు. అన్ని పాఠశాలల్లో జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
0 Comments:
Post a Comment