రాజధాని బిల్లుల రద్దు అందుకే ? చంద్రబాబు ఎపిసోడ్ డైవర్ట్- మరో బిల్లు పెట్టినా, పెట్టకపోయినా ?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కాదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం ఇప్పుడు మళ్లీ మొదటికే వచ్చిందా ? ఏపీ రాజధానిగా అమరావతిని అంగీకరించిన ఏపీ ప్రజలను సీఎం గా జగన్ వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయం గందరగోళానికి గురిచేసిందా?
మూడు రాజధానులు ఏర్పాటు బిల్లును చట్ట సభల్లో చట్టం చేసి, మళ్లీ ఇప్పుడు రద్దుచేసి, మరోమారు మెరుగైన బిల్లు ప్రవేశపెడతామని జగన్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అనిశ్చితిలోకి నెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఏపీ రాజధాని ఏది? అమరావతినా లేక మరేదైనానా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం అందరి మనసులను తొలిచి వేస్తుంది.
రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు
2019 ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరమే అని రాష్ట్ర ప్రజలంతా ఫిక్స్ అయ్యారు. నాటి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సమయంలో ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలని, అంతర్జాతీయ పెట్టుబడులు అమరావతిలో పెట్టేలా చూడాలని నాటి సీఎం చంద్రబాబు చాలా ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెట్టుబడుల ఆకర్షణ కోసం రాజధాని నగరాన్ని ఉన్నత స్థాయి ప్రమాణాలతో ప్రపంచం దృష్టి సారించేలా నిర్మించాలని పడరాని పాట్లు పడ్డారు.
జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల ప్రకటన ..అమరావతిపై నీలి నీడలు
ఇక జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి రాజధాని అమరావతిని పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తరువాత ఏపీ రాజధాని నగరాన్ని మార్చాలనే ఆలోచన తెర మీదకు తీసుకువచ్చి, అనేక కమిటీలు వేసి, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటనతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఉన్న రాజధాని నగరం ఏదో అర్థం కాక పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు. ఇక మరో వైపు ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి నుండి పరిపాలన రాజధానిని విశాఖ కు తరలిస్తారని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటన రాజధాని నగరమైన అమరావతి ప్రాభవాన్ని కోల్పోయేలా చేసింది.
ఏపీకి మూడు రాజధానుల ప్రకటన, అమలు శూన్యం, మళ్ళీ బిల్లు రద్దు..ఏపీ రాజధానిపై అనిశ్చితి
ఏపీకి మూడు రాజధానులు అని చెప్పుకొచ్చిన ప్రభుత్వం, న్యాయ పరమైన, సాంకేతికమైన ఇబ్బందుల కారణంగా మూడు రాజధానులు ఏర్పాటును చేయలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజధానులు పేరుతో ప్రారంభించిన గందరగోళానికి దాదాపు రెండేళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు ఈ మూడు రాజధానులు ఏర్పాటు జరిగింది లేదు. ఏపీ రాజధానుల విషయంలో ఒక స్పష్టత వచ్చింది లేదు. ఇక తాజాగా మరోమారు మూడు రాజధానులు బిల్లును ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టులో చెప్పి సంచలనం సృష్టించింది. ఇక ప్రజలంతా ఏపీకి రాజధాని అమరావతినే ఉంటుందని భావిస్తున్న సమయంలో, అబ్బే అదేం లేదు.. వికేంద్రీకరణ బిల్లులలో న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని, వాటన్నింటినీ సమగ్రంగా సరిదిద్ది మరో కొత్త బిల్లులతో సభ ముందుకు వస్తామని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసింది. ఇవేం నిర్ణయాలు అని అంతా ఆలోచించేలా చేసింది.
రాజధానిగా ఒకటా ? మూడా? మళ్ళీ బిల్లు తెస్తారా? ఈ సారి ఏం చెయ్యబోతున్నారు? అంతా గందరగోళం
మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకు వస్తారా? లేదా ఏపీ రాజధానిని మార్చి బిల్లును తీసుకు వస్తారా? అన్నది ఇప్పుడు మళ్లీ గందరగోళం సృష్టిస్తుంది. మళ్ళీ కథ మొదటికి వచ్చిందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి కాకుండా ఏపీకి రాజధాని విశాఖ చేస్తూ బిల్లు తెస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీకి ఏకైక రాజధానిగా విశాఖను రాజధాని నగరంగా మార్చితే రాయలసీమ ప్రజలు అసలే ఒప్పుకోరు అంటూ చర్చ జరుగుతోంది. ఒకే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే, అమరావతి నే కొనసాగిస్తే బెస్ట్ అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరైనా ఏపీ రాజధాని ఏంటి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలని చర్చలు చేస్తున్నారు.
చట్టం చేసిన బిల్లుల రద్దు ప్రభుత్వ వైఫల్యం .. ఏపీ రాజధానిపై స్పష్టత లేని ప్రభుత్వ గందరగోళం
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక నిర్ణయాన్ని తీసుకుని, చట్టసభల దాకా తీసుకు వచ్చి, బిల్లును పాస్ చేసి చట్టం చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా తెలివి తక్కువ చర్య అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టులో వికేంద్రీకరణ బిల్లు వీగిపోతాయి అన్న భయంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ నిర్ణయంతో జగన్ మరోమారు ఏపీ రాజధాని వ్యవహారాన్ని గందరగోళంలో పడేశారని ప్రజల్లోనూ అసహనం వ్యక్తం అవుతుంది. జగన్ తాజా నిర్ణయంతో రాజధాని సమస్యను మరింత జటిలం చేశారని, ఏపీ ప్రజల్లో రాజధానిపై గందరగోళం సృష్టించారని ఏపీ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రాంతాల మధ్య విద్వేషాలకు జగన్ నిర్ణయాలు కారణంగా మారుతున్నాయన్న చర్చ జరుగుతుంది.
చంద్రబాబు మీద కక్ష సాధింపుకే రాజధాని మార్పు .. జగన్ నిర్ణయాలపై ఏపీలో చర్చ
అసలు జగన్మోహన్ రెడ్డిని మూడు రాజధానులు అడిగింది ఎవరు? ఇప్పుడు ఈ గందరగోళం అంతా దేనికీ? అంటూ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపు చర్యగా, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్మించిన రాజధాని అమరావతి నగరాన్ని రాజధాని కాదంటూ జగన్ నిర్ణయం తీసుకున్నాడని, అంతే తప్ప ప్రాక్టికల్ గా 3 రాజధానుల నిర్ణయం సక్సెస్ కాదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రగడ ముందు ముందు ఏ మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
0 Comments:
Post a Comment