✍రాష్ట్ర నీట్ ర్యాంకుల వెల్లడి
♦అర్హత పొందిన వారిలో 65.24% అమ్మాయిలే
♦దరఖాస్తుల స్వీకరణ తర్వాతే ప్రతిభావంతుల జాబితా వెల్లడి
🌻ఈనాడు, అమరావతి:
ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాసిన విద్యార్థుల ర్యాంకుల జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. ఇటీవల విడుదలైన జాతీయ ర్యాంకులకు కొనసాగింపులో భాగంగానే ఈ జాబితాను వెల్లడించింది. అయితే... ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న అనంతరమే మెరిట్ జాబితా విడుదల చేస్తామంది. నీట్ రాసేందుకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ఇంటర్ బోర్డు పరిధిలో చదువుతున్నారన్న దానికి ఇచ్చిన సమాధానాన్ని అనుసరించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ కిందటేడాది వరకు అందచేసింది. ఈసారి రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల జాబితాను మాత్రమే కేంద్రం పంపినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ జాబితాలో పేర్లు లేకున్నా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కొందరు హైదరాబాద్, ఇతరచోట్ల పరీక్షలు రాశారు. వీరి పేర్లు ఈ జాబితాలో లేనందున ఆందోళన చెందుతున్నారు.
♦65.7% మంది అర్హత
నీట్‌ను రాష్ట్రంలో 59,951 మంది విద్యార్థులు రాయగా 39,388 మంది అర్హత సాధించారు. వీరిలో 25,700 మంది అమ్మాయిలు(65.24%) ఉన్నారు. ఓసీ కటాఫ్ 138, ఓసీ వికలాంగులు-122, ఎస్సీ, ఎస్టీ, బీసీ 108 మార్కులు కటాఫ్‌గా ఉన్నాయి. తొలి విద్యార్థికి 715, చివరి విద్యార్థికి 108 చొప్పున మార్కులు వచ్చాయి.
♦11 ఉత్తమ ర్యాంకర్లలో పది మంది అబ్బాయిలే
నీట్‌లో వచ్చిన 715 మంది మార్కులతో చందం విష్ణు వివేక్(ఓబీసీ) మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో ర్యాంకును రుషిల్ (715 మార్కులు), 3. పి.వెంకటకౌశిక్‌రెడ్డి(710), 4. కె.గోపిచంద్‌రెడ్డి(710), 5. టి.సత్యకేశవ్(710), 6. పి.వెంకటసాయి అమిత్ (710), 7. పి.కార్తిక్ (706), 8. ఎస్.వెంకటకల్పజ్(705), 9. కె.చైతన్యకృష్ణ(705), 10. సాకేత్ (705), 11వ ర్యాంకును నిఖిత(705) దక్కించుకుంది. ఈ ఉత్తమ ర్యాంకర్లలో ఒకరే అమ్మాయి కావడం గమనార్హం.
♦వచ్చే నెలాఖరులో మెరిట్ జాబితా
- కె.శంకర్, రిజిస్ట్రార్, విశ్వవిద్యాలయం
యూజీలో ప్రవేశాల కోసం మెరిట్ జాబితా వెల్లడించే ముందు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రారంభిస్తాం. ఇందుకు డిసెంబరు నెలాఖరు వరకు సమయం పట్టొచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అవగాహన నిమిత్తం 2020-21 విద్యా సంవత్సరంలో ర్యాంకుల వారీగా కేటాయింపు జరిగిన సీట్ల వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కేంద్రం నుంచి స్పష్టత రానందున పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు ఇంకా కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. అందుకే ఎంబీబీఎస్‌లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టేందుకు ఆలస్యం అవుతోంది.
0 Comments:
Post a Comment