✍పీఆర్సీపై తాడోపేడో!✍
♦నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమమే
♦ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వెల్లడి
🌻గుంటూరు, నవంబరు 15: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోందని, పీఆర్సీపై తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం గుంటూరులోని ఎన్జీవో కల్యాణమండపంలో జరిగిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపిక పట్టే ప్రశ్నేలేదన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 27న ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 28న అన్ని కేడర్ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 1న జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా, ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.కోట్ల మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటికి రెండేళ్లు గడిచినా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని చెప్పారన్నారు.
0 Comments:
Post a Comment