🔳నాన్న తాగడం వల్ల.. అమ్మఒడి వచ్చిందా??
పిల్లలకు స్కూళ్లలో ఇలా చెబుతారా?
తక్షణం ఉపసంహరించుకోండి..
మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
విఠపు, ఐవీ, కత్తి ఆగ్రహం
జగన్‌కు పక్క రాష్ట్రంపై ప్రేమెందుకో?
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘అమ్మ ఒడి పథకం మీ నాన్న తాగడం వల్ల వచ్చిందని స్కూల్లో పిల్లాడికి చెబుతారా? చాలా తమాషాగా ఉంది ఈ బిల్లు. మద్యం ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నామని చెప్పడమేంటి? ఈ బిల్లుతో ప్రభుత్వం అప్రతిష్ఠపాలవుతుంది. వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఏపీ ట్రేడ్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎ్‌ఫఎల్) చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ అంది.. ఈ విధానం అమల్లో ఉందా? ఉంటే రాష్ట్రంలో తాగేవారి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా?’ అని నిలదీశారు. మరో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు ఈ బిల్లు ద్వారా ఇచ్చే సందేశం బాగోలేదన్నారు. దశల వారీ మద్య నిషేధమంటూ ఈ బిల్లు ఎందుకు తెచ్చారని ఇంకో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి నిలదీశారు.
నవ్వులపాలే: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
సీఎం జగన్‌కు మన రాష్ట్రం కన్నా పక్క రాష్ట్రంపై ప్రేమ ఎందుకో అర్థం కావడంలేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ఈ బిల్లు వల్ల ప్రభుత్వం నవ్వులపాలు కాకతప్పదన్నారు. సరైన బ్రాండు దొరక్క తెలంగాణ నుంచి మద్యం తెచ్చుకుంటున్నారని, పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని అన్నారు. మద్యం ఆదాయాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ పథకాలకు ఖర్చు చేయనున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు.
స్విమ్స్ నిర్వహణ టీటీడీకి భారమైతే?
శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్సిటీ సవరణ బిల్లును ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం) ఆళ్ల నాని ప్రవేశపెట్టారు. దానిపై వాడీవేడిగా చర్చ జరిగింది. భవిష్యత్‌లో టీటీడీకి స్విమ్స్ నిర్వహణ ఆర్థికంగా భారమైతే పరిస్థితి ఏంటని బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. వచ్చే ఫిబ్రవరి నుంచి రైతులకు డ్రిప్ అందేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి కన్నబాబు చెప్పారు. ఉద్యానవన నర్సరీల రిజిస్ట్రేషన్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. ఏపీ సీడ్ కార్పొరేషన్‌తో నర్సరీ యజమానులు ఎంవోయూ చేసుకోవాలని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా మొక్కలను రైతులకు సరఫరా చేస్తామని తెలిపారు. కాగా.. ఈ బిల్లులతో పాటు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం బిల్లు, అసైన్డ్ భూముల సవరణ బిల్లు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, హిందూ ధార్మికచట్టం సవరణ బిల్లు సహా మొత్తం 11 బిల్లులను బుధవారం మండలి ఆమోదించింది.
0 Comments:
Post a Comment