PDF MLC: మద్యం ఆదాయంతో సంక్షేమమా..?
అమ్మఒడికి లింక్‌పెట్టడం సరికాదు - మండలిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి సంక్షేమ పథకాలను మద్యం నుండి వచ్చే ఆదాయంతో అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టసవరణపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బడిలో చదువుకునే విద్యార్థికి తాను తాగుబోతులు తాగడం వల్ల వచ్చే ఆదాయంతో చదువుకుంటున్నానే మెస్సేజ్ పోతే ఎలా అంటూ పిడిఎఫ్ ఫ్లోర్‌లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం ప్రశ్నించారు. బుదవారంనాడు శాసన మండలిలో దేశంలో తయారైన విదేశీ మద్యం వ్యాపార చట్టం సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకురావడంలేదని, కేవలం గతంలో వున్న చట్టానికి సవరణలను చేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలను మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో అమలు చేస్తామని తెలిపారు. ఇందుకు పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి తొందరపాటుతో చట్టాలు చేయడం తర్వాత సరిదిద్దు కోవడం సర్వసాధారణం అయ్యిందన్నారు. ఈ చట్టం కూడా ప్రభుత్వం పరువుపోగొట్టుకునే అంశమని అన్నారు. పారిశ్రామిక సంస్థలనుండి సామాజిక బాద్యత ప్రోగ్రామ్ కింద పన్నును వసూలు చేస్తున్నట్లు తాగుబోతులకు అమ్మఒడి బాద్యతను అప్పగించడం ప్రభుత్వం బాద్యతా రాహిత్యం అవుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. మద్యపాననిషేదాన్ని దశలవారీగా ఎత్తివేస్తామని హామి ఇచ్చి ఇపుడు తాగుబోతులకు ఎక్కువ తాగండి అనే బాద్యతను ప్రభుత్వం ఇచ్చినట్లుగా వుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. బిజెపి ఎమ్మెల్సీ మాదవ్ మాట్లాడుతూ సంక్షేమం కోసం మద్యం ఆదాయం అనే మాట వినేందుకు కూడా హాస్యాస్పదంగా వుందని అన్నారు. ప్రభుత్వం మద్యం విధానాన్ని సమీక్షించుకోవాలని అన్నారు.
డిఎడ్ 2018 ప్రైవేట్ వారికి పరీక్షలు : లక్ష్మణరావు
డిఎడ్ 2018-20 విద్యాసంవత్సరం ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు శాసన మండలిలో డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ మోషేను రాజు ద్వారా ప్రత్యేక ప్రస్తావనతో ప్రభుత్వం దృష్టికి బుధవారం ఈ అంశాన్ని తీసుకెళ్లారు. 2018-20 ప్రభుత్వ విద్యార్థులకు జరిగాయని, ప్రైవేట్ వారికి జరగలేదన్నారు. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లు చేసుకున్నాయని వివరించారు. యాజమాన్యాలు చేసిన తప్పుకు విద్యార్థులను బలి చేయడం సరికాదని వెంటనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మరో ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు. ఇరుకైన భవనాల్లో డిగ్రీ కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని వై శ్రీనివాసులు రెడ్డి మరో ప్రస్తావన తీసుకొచ్చారు.
0 Comments:
Post a Comment