✍అష్ట కష్టాలు..
♦ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరుకు సాంకేతిక సమస్యలు*
♦హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల్లో ఆందోళన
ఈనాడు, అమరావతి
జిల్లాలో కొన్ని పాఠశాలల్లో స్టూడెంట్ యాప్ తెరుచుకోవడం లేదు. దీని వల్ల పిల్లలకు హాజరు వేయలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొందరికి యాప్ తెరుచుకుంటున్నా ఒక తరగతిలో ఒకటి కన్నా ఎక్కువ సెక్షన్లు ఉంటే ఇప్పటికే సబ్‌మిట్ అని వస్తోందని చెబుతున్నారు. సెక్షన్ల వారీగా కాకుండా తరగతుల వారీగా దానికి రూపకల్పన చేసి ఉండొచ్చని, అందువల్లే అలా వస్తోందని ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ యాప్ పనిచేస్తున్నా దాన్ని నమోదు చేయడానికి చాలా సమయం తీసుకుంటోందని, రెండు, మూడు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రధానోపాద్యాయులు కొందరు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల వైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రిజిష్టర్‌లో హాజరు వేస్తున్నారు.
♦స్టూడెంట్ యాప్‌లోనే హాజరు!
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 నుంచి స్టూడెంట్ యాప్‌లోనే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ఆదేశించింది. అమ్మఒడి పథకం వర్తింపునకు యాప్‌లో నమోదు చేసిన 75 శాతం హాజరునే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి ఆన్‌లైన్ హాజరు వేసుకోవడం అనివార్యమని భావించింది. ప్రభుత్వం ఆరేడు నెలల క్రితం తీసుకొచ్చిన స్టూడెంట్ యాప్‌ను కొంచెం అప్‌డేట్ చేసింది. దీన్ని యాండ్రాయిడ్ ఫోన్‌లో ఓపెన్ చేసుకుని హాజరు నమోదు చేయాలని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాలో 3250 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు క్లాస్ టీచర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రధానంగా పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా హాజరు నమోదుకు చాలా సమయం పడుతోందని చెబుతున్నారు. బెల్లంకొండ, అచ్చంపేట, వెల్దుర్తి, బొల్లాపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఇది సమస్యగా ఉందని చెబుతున్నారు.
♦ప్రాథమిక పాఠశాలల్లో...
అప్‌డేట్ అయిన యాప్‌లోనే చాలా వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో హాజరు నమోదు చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ పాఠశాలల్లో పిల్లలు తక్కువ సంఖ్యలో ఉండడం, ప్రతి తరగతిలో ఒక్కటే సెక్షన్ ఉండడంతో వారు సులభంగానే హాజరు నమోదు చేస్తున్నారని తెలుస్తోంది. గడిచిన విద్యా సంవత్సరంలోనే స్టూడెంట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో రాష్ట్రంలో జిల్లా హాజరు నమోదులో రెండు, మూడు స్థానాల్లో ఉంది. ప్రస్తుతం అప్‌డేట్ చేసిన యాప్‌లో పిల్లవాడి హాజరుతో పాటు భోజనం తీసుకున్నారా లేదా అనే టిక్కులు పెట్టాలి. ఒకేసారి రెండు టిక్కులకు సబ్‌మిట్ కొట్టాల్సి రావటంతో చాలా సమయం తీసుకుంటోందని ప్రధానోపాద్యాయులు తెలిపారు. ఈ యాప్‌లను రద్దు చేయాలని కొన్ని సంఘాలు ఇటీవల ఆందోళనలు చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా స్టూడెంట్ యాప్‌లోనే హాజరు నమోదు చేయాలని స్పష్టం చేయటంతో ఆ మేరకు జిల్లా విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. అది పనిచేసిన రోజు నమోదు చేస్తున్నామని, లేనిరోజు మాన్యువల్‌గానే స్కూల్‌కు వచ్చారా లేదా అనేది హాజరుపట్టీలో వేస్తామని ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకుడొకరు తెలిపారు. క్లాసుల వారీగా ఉండే టీచర్లు కొన్ని తరగతులకు హాజరు వేసేలా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటున్నా అసలు యాప్ పనిచేయకపోతే ఏం చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
0 Comments:
Post a Comment