✍ఆ 10వేల మంది విధ్యార్ధులేమైనట్టు ??
♦పాఠశాలల్లో మిగిలిపోయిన జగనన్న కిట్లు
♦లెక్కల్లో డొల్లతనంపై అధికారుల ఆరా
🔺ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 9 రకాల వస్తువులతో కూడిన జగనన్న కిట్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. లేని విద్యార్థులను కూడా పాఠశాలల్లో అధికంగా చూపించిన వైనం బయటపడుతోంది. దాదాపు 10 వేల మందికి పంపిణీ చేయాల్సిన కిట్లు మిగిలిపోవడం తాజాగా చర్చనీయాంశమవుతోంది
🌻ఒంగోలు నగరం, న్యూస్‌టుడే:
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతమందంటే విద్యాశాఖ కూడా లెక్కలు చెప్పలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. గత ఏడాది ఉపాధ్యాయుల రేషనలైజేషన్ సమయంలో విద్యార్థుల సంఖ్య తగ్గితే అక్కడ పోస్టులు పోతాయనే ఆందోళనతో గ్రామాల్లో బడిఈడు పిల్లలందరినీ చేర్పించారు. తరువాత కొంతమంది ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోగా, మరికొందరు అర్ధంతరంగా మానేశారు. ఎంఈవోలు పాఠశాలల్లో నమోదుల ఆధారంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి లెక్కలు పంపారు. ఆ మేరకు 9 రకాల వస్తువులు (బ్యాగు, పుస్తకాలు, షూస్, సాక్సులు, ఏకరూప దుస్తులు, బెల్ట్, డిక్షనరీ తదితరాలు)తో కూడిన జగనన్న కిట్లు కేటాయించారు. అందుబాటులో ఉన్న పిల్లలకు వాటిని పంపిణీ చేసి మిగిలినవి పక్కన పెట్టారు. కిట్లు పొందిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరి వేలిముద్రతో బయోమెట్రిక్ వేసి ఆన్‌లైన్ చేయాలనే నిబంధన పెట్టారు. దీంతో లేని విద్యార్థుల తల్లిదండ్రులను ఎలా తీసుకురావాలో తెలియక సమస్య నెలకొంది. చైల్డ్ ఇన్‌ఫో లెక్కల ప్రకారం జిల్లాలో 3.50 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 90 శాతం పిల్లల తల్లిదండ్రుల వేలిముద్రలు మాత్రమే సేకరించగలిగారు.
♦మానేసినవారినీ చేర్చి..
విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. బడి మానేసిన పిల్లలను మళ్లీ బడిలో చేర్చేందుకు ఈ నెల 20 వరకు గడువు విధించి ఆ బాధ్యతను ఎంఈవోలు, ఎంపీడీవో, సీఆర్‌పీ, హెచ్‌ఎంలకు అప్పగించారు. గత ఏడాది సీఆర్‌పీలు, సచివాలయ సిబ్బంది ద్వారా చేయించిన సర్వే నివేదికను మండల విద్యాశాఖాధికారులకు అప్పగించారు. వాస్తవానికి అప్పట్లో కరోనా వల్ల సర్వే తూతూమంత్రంగా సాగింది. జిల్లా మొత్తం మీద 2,900 మంది డ్రాపవుట్లు(మధ్యలో బడిమానేసినవారు) ఉన్నట్లు లెక్కలు సమర్పించారు
*♦మండలాలు, గ్రామాల వారీగా* ఇప్పుడు ఇంటింటా పరిశీలించి ఆ విద్యార్థులు ఏ పాఠశాలల్లో ఉన్నారనే వివరాలు సేకరించాలని ఆదేశించారు.సోమవారం నుంచి కార్యాచరణ చేపట్టారు. వారిని గుర్తించి బడిలో చేర్చే ప్రక్రియ సజావుగా జరుగుతుందా, ఒకవేళ చేర్చినా వారు మళ్లీ మానేయకుండా ఉంటారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిబంధన ప్రకారం నెలరోజులు వరుసగా రాని విద్యార్థి పేరు తొలగించాలి. ఒకవేళ ప్రైవేటు పాఠశాలలో చేరి ఉన్నట్లయితే పూర్వ ప్రభుత్వ పాఠశాలలో ఆ విద్యార్థి పేరు తొలగించి డ్రాప్‌బాక్స్‌లో ఉంచాలి. ప్రైవేటు బడుల్లో చదివే వారికి జగనన్న కిట్లు ఇవ్వరు. ఈ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో లెక్క తేలడంలేదు. ఇలా మానేసిన పిల్లలు 10 వేల కన్నా పైనే ఉంటారని అంచనా.
♦హెచ్‌ఎంలకు తాఖీదులు
జగనన్న కిట్లకు బయోమెట్రిక్ వేయించడంలో వెనుకబడిన పాఠశాలల జాబితాను సిద్ధం చేసి తాఖీదులు ఇవ్వాలని సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులిచ్చారు. రెండు రోజుల్లో రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో 60 నుంచి 70 శాతం వరకే బయోమెట్రిక్ వేయడం జరిగింది. మిగిలిన విద్యార్థులు ఏమయ్యారు, ఎక్కడున్నారు. ఎందుకు వారి తల్లిదండ్రులతో వేయించలేకపోయారనే అంశంపై హెచ్‌ఎంలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో లేని పిల్లల పేర్లు రాసి లెక్కలు సమర్పించారు. విలీన సమయంలో అది కూడా వెలుగుచూడనుంది. దీనిపై డీఈవో బి.విజయభాస్కర్‌ని సమాచారం కోరగా ఈ ఏడాది నుంచి బోగస్ నమోదులకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయోమెట్రిక్ తక్కువగా వేయడానికి కొన్నిచోట్ల యంత్రాలు మరమ్మతులతో ఉండటం కారణమన్నారు. దేనివల్ల వేయించలేకపోయారో తెలుసుకునేందుకు తాఖీదులు ఇస్తామన్నారు.
0 Comments:
Post a Comment