ఎయిడెడ్' విలీనం పూర్తిగా స్వచ్ఛందం
ఇష్టం లేకుంటే యథాప్రకారంగా నడుపుకోవచ్చు
ఇప్పటికే విలీనానికి అంగీకరించినవారు కూడా నిరభ్యంతరంగా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవచ్చు
బడుల్లో సమస్యలపై కాల్‌సెంటర్ ఏర్పాటు
ఆంగ్ల ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై శ్రద్ధ
పిల్లలకు రోజూ మూడు పదాలు నేర్పించాలి
పాఠశాలలకు హెడ్‌మాస్టర్లే కుటుంబ పెద్దలు
విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం పూర్తిగా స్వచ్ఛందమేనని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
వివిధ కారణాలతో బడులు నడపలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే ఇచ్చిందన్నారు. ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని, లేకుంటే యథాప్రకారంగా నడుపుకోవచ్చని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించినవారు కూడా తమ నిర్ణయాన్ని నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చన్నారు. నూతన విద్యావిధానం-సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలుచేయడానికి, విలీనాల తర్వాత అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మొత్తం ప్రక్రియ పూర్తయ్యే నాటికి అవసరమైన ఉపాధ్యాయులను కూడా గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని డైట్ కళాశాలల సామర్థ్యం పెంచాలన్నారు. టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని నిర్దేశించారు. పాఠశాలల్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్ చేసేలా ఒక నంబరు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రతి పాఠశాలలో కనిపించేలా ఆ నంబరును ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసి, ఫీడ్‌బ్యాక్ తీసుకుని, పరిష్కార చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు.
మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు
ఆంగ్ల ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం పేర్కొన్నారు. దీనికోసం పాఠ్య ప్రణాళికపై దృష్టిపెట్టాలన్నారు. పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజూ కనీసం మూడు పదాలు నేర్పించి, వాటిని వినియోగించడం పిల్లలకు నేర్పించాలని సూచించారు. మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో... పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా అలాగే ఉండాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలన్నారు. పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలని, మధ్యాహ్న భోజనం నుంచి ఇతర మౌలిక సదుపాయాలపై తనిఖీలు చేసి సవ్యంగా ఉండేలా వారే చూసుకోవాలన్నారు. బడుల్లో వసతులపై రోజూ పర్యవేక్షణ జరగాలన్నారు. గోరుముద్దపై పిల్లలు, తల్లుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు ఈ పథకం అమలును పర్యవేక్షించాలన్నారు. లెర్న్ టు లెర్న్ కాన్సె్‌ప్టను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.
మూడేళ్లలో 25,396 పాఠశాలలు విలీనం
నూతన విద్యావిధానంలో భాగంగా మూడేళ్లలో రాష్ట్రంలోని 25,396 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నామని సీఎంకు అధికారులు వివరించారు. తొలిదశలో భాగంగా ఈ ఏడాది 2,663 స్కూళ్లు, వాటిలోని 2,05,071 మంది విద్యార్థులను విలీనం చేశామన్నారు. సీబీఎ్‌సఈ కింద 2021-22 విద్యా సంవత్సరంలో 1,092 పాఠశాలల అఫిలియేషన్ జరిగిందన్నారు. ఈ విద్యార్థులు 2024-25 నాటికి పదో తరగతి పరీక్షలు రాస్తారన్నారు. అంతర్జాతీయంగా 24వేల పాఠశాలలకు మాత్రమే సీబీఎ్‌సఈ గుర్తింపు ఉందని, అలాంటిది ఒక రాష్ట్రంలో ఇన్ని పాఠశాలలకు ఒకే ఏడాదిలో అఫిలియేషన్ ఇవ్వడం రికార్డు అని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు బుడితి రాజశేఖర్, ఎ.ఆర్.అనూరాధ, బీఎం దివాన్, కృతికా శుక్లా, వెట్రిసెల్వి, వి.చినవీరభద్రుడు, వి.రాములు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment