🔳ఉద్యోగ నేతలకు పరాభవం!
పీఆర్‌సీ నివేదిక కోసం ఎదురుచూపులు.. పట్టించుకోని సర్కారు
ఎందుకు బహిర్గతం చేయరు?.. రహస్యముందా?
ఆ రిపోర్టు మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్
ఈ ప్రభుత్వం రావాలని 2 చేతులతో ఓట్లేశాం
ఇప్పుడు మాపైనే చిన్న చూపు.. సీఎ్‌సను కలిశాం
శశిభూషణ్ ఇస్తారంటూ సీఎం దగ్గరకెళ్లారు
శశిభూషణ్ ఫోనే ఎత్తలేదు.. నేతల ఫైర్
సచివాలయం వద్ద 6 గంటలు బైఠాయింపు
స్పందించని అధికారులు.. చర్చలకూ పిలవని వైనం
విసిగి వేసారి వెనక్కి.. నేడు భవిష్యత్ కార్యాచరణ
పీఆర్సీ నివేదిక కోసం వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం వారిని కనీసం పట్టించుకోకుండా... పిలిచి మరీ పరాభవించింది. సచివాలయం ఆవరణలో గంటల కొద్దీ ఎదురుచూసినా... ఉన్నతాధికారులకు పదేపదే ఫోన్లు చేసినా, నిరసనకు దిగినా కనీస స్పందన కూడా లేకపోయింది. ‘సమయం మించి పోయింది. మీరు వెళ్లిపోండి’ అంటూ సచివాలయ భద్రతా సిబ్బంది సూటిగా చెప్పడంతో... ఉద్యోగ నేతలు అక్కడి నుంచి వెనుదిరిగి రావాల్సి వచ్చింది
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు పట్టుబట్టారు. వారం రోజుల్లో నివేదిక ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చి రోజులు గడిచిపోతున్నా.. నివేదిక ఇవ్వకపోవడంతో బుధవారం సదరు సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, హృదయరాజు తదితరులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో చివరకు వెనుదిరిగారు. గురువారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
గత నెల 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు పీఆర్‌సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. వారంలో విడుదల చేస్తామని సీఎస్ సమీర్ శర్మ ఆనాడు హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రకటనా, సమాచారమూ లేవు. అనంతరం సీఎం జగన్మోహన్‌రెడ్డితో బుధవారం చర్చించి నివేదిక ఇస్తామని సీఎస్ చెప్పడంతో వారంతా బుధవారం అమరావతి సచివాలయానికి వచ్చారు. సీఎ్‌సను కలిశారు. నివేదిక గురించి అడిగారు. సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇస్తారని, వేచిచూడాలని సీఎస్ తమకు చెప్పారంటూ.. సచివాలయం మొదటి బ్లాక్ సమీపంలోని మీడియా పాయింట్ వద్ద నేతలంతా ఎదురు చూశారు. సీఎంను కలవడానికి సీఎస్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో పీఆర్‌సీ నివేదిక రావచ్చని వారు భావించారు. ఈలోపు అక్కడి నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది వారికి సూచించారు. దీంతో నేతలు అక్కడి నుంచి మూడో బ్లాక్ ఎదురుగా ఉన్న పార్కులోకి వచ్చి బైఠాయించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9:20 వరకు ఎదురు చూశారు. ప్రభుత్వం నుంచి కనీసం సమాచారమైనా వస్తుందేమో, చర్చలకు పిలుస్తారేమోనని ఆశించారు. కానీ అలాంటివేమీ జరగలేదు. తీవ్ర నిరాశకు గురైన నేతలు.. నివేదిక ఇచ్చే వరకు సచివాలయం నుంచి వెళ్లేది లేదని సచివాలయ భద్రతాధికారులకు తేల్చిచెప్పారు. ఆందోళనకు దిగొద్దని పోలీసులు వారికి సూచించారు. ఈలోపు ఉద్యోగ సంఘాల నేతలతో శశిభూషణ్ సంప్రదింపులు జరుపుతారని రాత్రి 9 గంటల సమయంలో సీఎస్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో తాము శశిభూషణ్‌కు తాము ఫోన్ చేస్తే ఎత్తలేదని నేతలు వాపోయారు. సచివాలయంలోని పోలీసుల మీద ఉన్న గౌరవంతో.. వారిని ఇబ్బందిపెట్టడం, బాధపెట్టడం ఇష్టంలేక వెళ్లిపోతున్నామని, గురువారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఇరు జేఏసీల నేతలు స్పష్టం చేశారు. పీఆర్‌సీ నివేదిక ఈ రోజు ఇస్తామని చెప్పడం వల్లే సచివాలయానికి వచ్చామని, గంటల తరబడి వేచిచూసినా ప్రభుత్వం, అధికారుల నుంచి సమాచారం రాకపోవడంతో విసిగి వేసారి నిరసన తెలుపుతున్నామని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. సచివాలయం వద్ద బైఠాయింపునకు ముందు, ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.
నివేదిక దాచిపెట్టడం వింతగా ఉంది: బండి
‘పీఆర్‌సీ నివేదిక మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్. రెండ్రోజుల్లో అది ఇస్తామని సీఎస్ గతంలో హామీ ఇచ్చినా, ఇప్పటికీ విడుదల చేయకపోవడం బాధ కలిగిస్తోంది. మేం ప్రతి రోజూ తిరగడమే సరిపోతోంది. ప్రభుత్వం కనికరించడం లేదు’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పీఆర్‌సీ నివేదికను దాచిపెట్టడం, సీల్డ్ కవర్‌లో పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. నివేదిక ఇవ్వకపోవడంతో తమకు అనుమానాలు వస్తున్నాయని, పీఆర్‌సీ చైర్మన్ అశుతోష్ మిశ్రా ఏదైనా రహస్యం దాచిపెట్టారా అని మండిపడ్డారు. సీఎం బిజీగా ఉండడం వల్ల పీఆర్‌సీ విషయంలో ఆయనతో చర్చించలేకపోయామని.. అయితే బుధవారం నివేదిక ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పారు. ‘ఈ ప్రభుత్వం రావాలని మేం కూడా కుడి చేత్తో, ఎడమ చేత్తో ఓట్లేశాం. మేం సానుకూల ధోరణితో సహకరిస్తుంటే.. అధికారుల అలసత్వమో, ఈ ప్రభుత్వ తీరే ఇలా ఉందో అర్థం కావడంలేదు. ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఉద్యోగుల ప్రతినిధులమైన మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన తెలుపుతున్నాం. నివేదిక ఇస్తామన్న శశిభూషణ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో సీఎ్‌సను కలిశాం. ఈ అంశంపై సీఎంతో చర్చ జరుగుతోందని చెప్పడంతో వేచి చూశాం. సీఎ్‌సపై గౌరవంతో నివేదిక ఇస్తారని ఎదురుచూశాం. ఆయన ఓఎ్‌సడీకి ఫోన్ చేస్తే.. శశిభూషణ్ వచ్చి మాట్లడతారని చెప్పారు. కానీ ఆయన కూడా మాతో మాట్లాడలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు’ అని వాపోయారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలేదని మండిపడ్డారు. తమ డిమాండ్ల సాధన కోసం అవసరమైతే విధులు బహిష్కరిస్తామని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. ఉద్యోగులకు ఆర్ధికపరమైన బిల్లులు ఏవీ రావడం లేదని, రీయింబర్స్‌మెంట్ పేమెంట్లు కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగుల హెల్త్‌కార్డులు ఏ ఆస్పత్రిలోనూ చెల్లడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి తాము సానుకూలంగా ఉన్నా.. ఉన్నతాధికారులు తమ పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మంచి మనసుతో ఉద్యోగుల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. పీఆర్‌సీపై ఏం చేస్తున్నారో తెలియజేసి, నివేదికను తమకు అందజేయాలని డిమాండ్ చేశారు.
అధికారులే దూరం పెంచుతున్నారు: బొప్పరాజు
పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నివేదిక విడుదలను తరచూ వాయిదాలు వేస్తున్నా.. రెండు నెలలుగా తాము సహనంతో ఎదురుచూస్తున్నామని, మా ఉద్యోగులకు సంబంధించిన నివేదికను మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి బాధేందో తెలియడం లేదన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమలేదన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అధికారులే దూరం పెంచుతున్నారని ఆరోపించారు. ‘ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. పీఆర్‌సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఈ అంశాన్ని సెటిల్ చేయాలి. ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి రావలసిన కోట్లాది రూపాయలు పెండింగ్ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలి. 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయాలి. ఆ తేదీకి ఒక్క రోజు తక్కువైనా అంగీకరించం. 60ు మేర పీఆర్‌సీని పెంచి ప్రకటించాల్సిందే. గురువారం ఉద్యోగ సంఘాలతో సమావేశమై, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment