మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో భారీ లాభాలు....
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో భారీ లాభాలు
రిస్క్ తీసుకోవాలనుకునే వారికి ఈక్విటీ ఫండ్స్
నిలకడగా ఇన్‌కమ్ కావాలనుకుంటే డెట్ ఫండ్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లాంగ్‌టెర్మ్‌లో భారీ లాభాలను తెచ్చిపెడతాయి.
ఇన్వెస్టర్లు తీసుకునే రిస్క్‌ను బట్టి వివిధ ఫండ్ స్కీమ్స్ ఎక్కువ బెనిఫిట్స్‌ను ఇస్తాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ లేదా మిక్స్‌డ్ ఫండ్స్ వంటివి ముఖ్యమైనవి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు లాంగ్‌టెర్మ్ టార్గెట్లకు సరిపోతాయి. పేరులోనే ఉన్నట్టుగా ఈక్విటీ ఫండ్స్ మన డబ్బులను తీసుకెళ్లి మార్కెట్‌లో లిస్ట్ అయిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే రాబడులు నిలకడగా ఉండవు. గ్యారంటీ ఇన్‌కమ్‌కు హామీ ఉండదు. మార్కెట్లో లాభనష్టాలను బట్టి రాబడులు ఉంటాయి. ఈక్విటీ ఎంఎఫ్‌లు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయని వీటి ట్రాక్ రికార్డును చూస్తే అర్థమవుతుంది. ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ సమర్థంగా ఎదుర్కోగల అసెట్‌గా ఈక్విటీ ఎంఎఫ్‌లను పరిగణిస్తారు. అయితే స్వల్ప, -మధ్యకాలానికి మాత్రం ఎంఎఫ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్లు అనువుగా ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక టార్గెట్లు.. అంటే కనీసం 7 -10 సంవత్సరాల వరకు ఎదురుచూస్తే లాభాలకు అవకాశాలు ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు వద్దనుకుంటే ఇతర ఇన్వెస్ట్‌మెంట్లూ అందుబాటులో ఉన్నాయి.
స్థిరమైన రాబడిని కోరుకుంటే..
చాలా మంది రిటైరీలకు జాబ్ వదిలేసిన తరువాత నెలవారీ ఖర్చుల కోసం కొంత ఆదాయం అవసరం ఉంటుంది. ఇలాంటివారు తమ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రావాలని కోరుకుంటారు. వీరికి సంపద సృష్టించడం కంటే మూలధనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈక్విటీ ఎంఎఫ్‌లు వీరికి అంతగా సూట్ కావు. ఎఫ్‌డీలు, పెన్షన్ స్కీములు వంటివి ఎంచుకోవాలి. అయితే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీముల నుంచి రాబడులు తక్కువగా ఉంటాయి. పన్నులు ఎక్కువ ఉంటాయి. ఇన్‌ఫ్లేషన్ రేట్లను లెక్కలోకి తీసుకుంటే వచ్చే రాబడి చాలా తక్కువగా ఉంటుంది. రిటైరీలు ఇన్‌ఫ్లేషన్‌ను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఫండ్లలో, డెట్ ఫండ్‌లలో కొంత ఇన్వెస్ట్ చేయవచ్చు. 'ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రాకున్నా ఫర్వాలేదు.. లాంగ్‌టెర్మ్ టార్గెట్ల కోసం ఫండ్స్ కావాలి' అని అనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి.
ఇన్‌ఫ్లేషన్ రూపాయి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇప్పటి విలువతో పోలిస్తే రూపాయి విలువ తప్పకుండా తగ్గుతుంది. ఇన్‌ఫ్లేషన్‌ను అధిగమించడానికి, మీరు తక్కువ వడ్డీ రేటుతోనే ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. లేకుంటే, తక్కువ పొదుపులతో కూడా లాంగ్‌టెర్మ్‌లో ఇన్‌ఫ్లేషన్‌ను తట్టుకోవాలంటే ఈక్విటీల్లో డబ్బు పెట్టాలి.
హెచ్చుతగ్గులు వద్దనుకుంటే..
ఈక్విటీ అసెట్ క్లాస్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. రిస్క్ వద్దని అనుకుంటే రియల్ ఎస్టేట్, బంగారం లేదా బ్యాంకు డిపాజిట్లు, డెట్‌ఫండ్స్ వంటి వాటిలో డబ్బును పెట్టవచ్చు. అయితే, దీర్ఘకాల పెట్టుబడులు ఇన్‌ఫ్లేషన్ నుంచి రక్షణ కావాలంటే మాత్రం షేర్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ప్రయాణం మొదలుపెట్టాలి. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్ వైపు మారొచ్చు. షేర్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కష్టనష్టాలు ఉంటాయి. భారీ లాభాలూ ఉంటాయి. ఇన్వెస్టర్లు అన్నింటికీ సిద్ధపడాలి. కరెక్షన్ కనిపించినప్పుడు మరిన్ని యూనిట్లను కొనుక్కోవాలి.
అసెట్ అలోకేషన్ ప్లాన్లను మార్చితే మంచిదే..
చాలా మంది ఇన్వెస్టర్లు రాబడిని పొందడానికి ఒక అసెట్ క్లాస్ నుండి మరొక అసెట్ క్లాస్‌కి మారుతూ ఉంటారు. బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. ఆస్తి ధరలు పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏ మార్కెట్ బాగుంటే అందులోకి వెళ్లడమే తెలివైన పనే! అన్ని గుడ్లనూ ఒకే బుట్టలో పెట్టకూడదన్నట్టు. మొత్తం డబ్బును ఒకే అసెట్ క్లాస్‌లో ఉంచడం మంచిది కాదు. ఈక్విటీ ఫండ్స్‌తోపాటు గోల్డ్ ఫండ్‌లు, డెట్ ఫండ్‌లు, రియల్ ఎస్టేట్ ఫండ్‌లనూ ప్రయత్నించవచ్చు.
0 Comments:
Post a Comment