🔳AIDED :'ఎయిడెడ్'పై నిరంకుశ వైఖరి -మండలిలో విమర్శ
లోపాలు సవరించి బలోపేతం చేయాలని సూచన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
ఎయిడెడ్ విద్యాసంస్థలపై రాష్ట్రప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని శాసనమండలిలో పలువురు ఎంఎల్‌సిలు విమర్శించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలక గ్రాంటును ఉపసంహరించుకునేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్య చట్టం సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుతం బుధవారం మండలిలో ప్రవేశపెట్టింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు బదులు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో పిడిఎఫ్, బిజెపి, స్వతంత్ర సభ్యులు కత్తినరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లోపాలుంటే వాటిని సరిచేసి బలోపేతం చేయాలని సూచంచారు. ఎయిడెడ్‌గానే కొనసాగుతామని చెప్పిన విద్యాసంస్థల్లో పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కనీస చర్చ జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం బిల్లు నుతీసుకొచ్చిందన్నారు విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో పలు యాజమాన్యాలు ఎయిడెడ్‌గా కొనసాగేందుకు సిద్ధపడుతున్నాయని చెప్పారు. ఈ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం నాలుగు ఆప్షన్లను ఇచ్చిందన్నారు. పెరుగాంచిన స్టెల్లా కళాశాల వంటి వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా అని ప్రశ్నించారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలను ప్రభుత్వం ఎందుకు నడపడం లేదని నిలదీశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు గ్రాంటు కొనసాగేలా మరో రూపంలో బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ఎయిడెడ్ విద్యాసంస్థలు ఎంతో సేవ చేశాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు కూడా వీటిల్లోనే చదువుకున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల వైపు నుంచి ఎందుకు ఆలోచన చేయడంలేదని ప్రశ్నించారు. కొన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని, ఎయిడెడ్ సంస్థలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వీటిని మూసివేయడంతో విద్యార్థులు ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించారు. కత్తినరసింహారెడ్డి మాట్లాడుతూ 1982లో ఈ చట్టం చేసేందుకు 23 గంటలు అసెంబ్లీలో చర్చ జరిగిందని, ఇప్పుడు కనీసం ఐదు నిమిషాలు కూడా చర్చించలేదన్నారు. పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ ఎయిడెడ్ వ్యవస్థలు బలహీన పడటానికి ప్రధాన కారణం తెలియకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లడం సరికాదన్నారు. బిజెపి సభ్యులు మాధవ్ మాట్లాడుతూ ఉన్న లోపాలను సవరించి ఎయిడెడ్‌ను బాగు చేయాలని సూచించారు.
మంత్రి వ్యాఖ్యలపై పిడిఎఫ్ ఆగ్రహం
చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ప్రభావంలో కొందరు సభ్యులు పడిపోతున్నారంటూ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము ప్రతిపక్షం చేత ప్రేరేపితమయిన వాళ్లం కాదని ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలు ఎయిడెడ్ పోస్టుల భర్తీ నిషేదం విధిస్తూ ఇచ్చిన జిఓలు రికార్డుగా ఉన్నాయని తెలిపారు. ఇద్దరు కలిసి 20ఏళ్లల్లో ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఈ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు. వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పోస్టులను 20 ఏళ్లుగా భర్తీ చేయకుండా వాటిని చంపేశారని తెలిపారు. 20ఏళ్లు అధికారంలో ఏవరూ ఉన్నారని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పోస్టులు భర్తీచేయకుండా ఇచ్చిన జిఓలు సభ ముందు పెడితే ఏ ప్రభుత్వాలు ఇచ్చాయో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు భర్తీ చేయకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.
బలోపేతం చేసేందుకే : మంత్రి కన్నబాబు
విద్య వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలోనే రాష్ట్రప్రభుత్వం ఎయిడెడ్ సంస్థల్లో కూడా సంస్కరణాలు చేపడుతోందని మంత్రి కన్నబాబు చెప్పారు. దానిలో భాగంగానే భాగంగానే బిల్లును తీసుకొచ్చామని అన్నారు. స్వాతంత్రం ముందు ప్రభుత్వ విద్యకు ఖర్చు చేయలేక గ్రాంటు ఇచ్చిందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు నాడు-నేడు కిందపాఠశాలలను బలోపేతం చేస్తుందన్నారు.
0 Comments:
Post a Comment