🔳బోధనా యాప్‌లా?
ఆందోళనలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ వర్గం
ఈనాడు-అమరావతి
బోధనా యాప్‌లా?
జిల్లాలోని పాఠశాలల్లో నెట్‌వర్క్ సమస్యతో స్టూడెంట్ అటెండెన్స్, మధ్యాహ్న భోజన ఐఎంఎంఎస్ యాప్‌లు సక్రమంగా పనిచేయడం లేదు. తరచూ మొరాయిస్తున్నాయి. ఎంతమంది విద్యార్థులు బడికి వచ్చారు? ఎందరు భోజనం చేశారు? తదితర వివరాలు నిత్యం యాప్‌ల్లో అప్‌లోడ్ చేయడానికే గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగాలేక అవస్థలు పడుతుంటే, ఇవి చాలవన్నట్లు తాజాగా ప్రతి తరగతి గదిలో ఎంతమంది పిల్లలున్నారో, వారంతా కనిపించేలా ఫొటో తీసి ఐఎంఎంఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలంటూ కొత్త విధానం తేవడంపై ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పనుల నిర్వహణకే తమకున్న సమయాన్ని కేటాయిస్తే, బోధన ఎప్పుడు చేయాలని ప్రశ్నిస్తున్నారు. సగటున ప్రతి ఉపాధ్యాయుడికి ఈ యాప్‌ల గోల ఉంది. అందరూ భాగస్వాములైతే తప్ప హాజరు నమోదు, భోజనం చేసే విద్యార్థుల వివరాలు అప్‌లోడ్ చేయటం సాధ్యపడటం లేదని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.
యాప్‌లు తొలిగించమంటే
ఇంతకుముందే యాప్‌లను రద్దు చేయాలని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ధర్నాలు చేసింది. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోగా సరికొత్త అంశాలను యాప్‌ల్లో చేర్చడంపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది. తాజాగా ఐఎంఎంఎస్ యాప్‌లో పిల్లలందరూ కనిపించేలా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫొటో తీసి పంపాలని సూచించడంతో చాలా పాఠశాలల్లో మంగళవారం దాన్ని పరిశీలించారు. ఫొటో తీసి అప్‌లోడ్ చేయడానికి చాలా సమయం పడుతోందని, సబ్మిట్ కొట్టినా చక్రం తిరుగుతూనే ఉంటోందని పలువురు హెచ్‌ఎంలు సమస్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా టెలిఫోన్ నెట్‌వర్క్‌లు బలహీనంగా ఉండడంతో ఫోన్లలో హాజరు వేయడానికే చాలా సమయం తీసుకుంటోందని, పిల్లలందరూ కనిపించేలా ఫొటో పంపుతుంటే, సైజు పెద్దదిగా ఉండటంతో స్వీకరించడానికి కొన్ని బడుల్లో అంతర్జాల సమస్యలొస్తున్నాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా యాప్‌ల్లోనే పిల్లల అటెండెన్స్, మీల్స్ టేకెన్ వివరాలు పంపాలని సూచించడాన్ని ఉపాధ్యాయ వర్గం తప్పుబడుతోంది. ఈ పనులకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన ఆపరేటర్లను సమకూర్చాలని కోరుతోంది. కాగా ఈ పనులన్నీ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత ఫోన్లతోనే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరికరాలు సమకూర్చలేదు.
తల్లిదండ్రులకు తెలియజేయండి
జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ నుంచి స్టూడెంట్ యాప్‌లోనే హాజరు నమోదు చేయాలనే ఆదేశాలు వెళ్లాయి. ఈనెల 8 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లేనని పిల్లల తల్లిదండ్రులకు, అమ్మఒడికి 75 శాతం హాజరు తప్పనిసరనే సమాచారం ఇవ్వాలని సూచించారు. మొత్తంగా యాప్‌ల్లో నానాటికి కొత్త అంశాలు చేర్చనుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. హాజరు ఎప్పటిలోగా వేయాలో చాలామంది ఉపాధ్యాయులకు సందేహం ఉంది. దీనిపై జిల్లా విద్యాశాఖ వర్గాలు స్పందిస్తూ నిర్దేశిత పాఠశాల సమయంలో ఎప్పుడైనా వేయొచ్చని ప్రత్యేకించి పలానా సమయంలో వేయాలనే నిబంధన లేదన్నారు.
యంత్రాంగం భారీగా ఉన్నా
అసలు పిల్లలు ఎంతమంది బడికి వచ్చారు, ఎందరు మధ్యాహ్న భోజనం చేశారో క్షేత్రస్ధాయిలో పరిశీలించడానికి విద్యాశాఖకు బోలెడెంత యంత్రాంగం ఉంది. ఎంఈఓ, డీవైఈఓలు, సచివాలయాల పరిధిలో ఎడ్యుకేషన్ సెక్రటరీలు ఇలా అనేకమంది ఉన్నారు. వీరు స్కూళ్లకు వెళ్లి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం తరగతి గదితో సహా పిల్లలను యాప్‌లో అప్లోడ్ చేయించడం వెనుక, ఉన్నతాధికారులే యాప్ ద్వారా ప్రతి బడిలో ఎంతమంది భోజనం తిన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా గుర్తించడానికే దీన్ని ప్రవేశపెడుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికే మరుగుదొడ్ల శుభ్రతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రీడ్ చేసి ఆమేరకు వాటి పరిశుభ్రతకు గుడ్, బ్యాడ్ రిమార్క్స్ ఇస్తోంది. సాంకేతిక పద్ధతులతో భోజనం చేసే పిల్లలను లెక్కించటం ద్వారా పారదర్శకంగా ఉంటుందని, ఎలాంటి లొసుగులకు తావుండదని అధికారులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment