విలీనం.. గందరగోళం
146 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలపాలని తాజాగా లెక్కలు
16,000 మంది విద్యార్థులపై ప్రభావం
రావికమతం, బుచ్చెయ్యపేటల్లో తల్లిదండ్రుల నిరసన
అధకారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 146 ప్రాథమిక పాఠశాలల్లో గల 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయను న్నారు.
ప్రభుత్వం మొదట పంపిన ఉత్తర్వుల ప్రకారం అయితే...179 ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు. కానీ, ఏ యాజమాన్యం పరిధిలో వున్న పాఠశాలలను ఆ యాజమాన్యంలోని పాఠశాలలోనే విలీనం చేయాలని విద్యా శాఖ అధికారులు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. అంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల పిల్లలను సమీపంలో వున్న జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రమే విలీనం చేయాలి. అలాగే మునిసిపల్ ప్రాఽథమిక పాఠశాల నుంచి తరగతులను అదే యాజమాన్యంలో వున్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలి. దీంతో మొదట ఎంపిక చేసిన 179 పాఠశాలల్లో ముప్పై మూడింటిని మినహాయించి మిగిలిన 146 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను మాత్రమే విలీనం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ 146 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు 16 వేల మంది ఉన్నారు. వీటిల్లో ఎంతమంది టీచర్లు ప్రాథమిక పాఠశాలల్లో 1,2 తరగతుల బోధనకు ఉంటారు?, ఎంతమంది సమీపంలో ఉన్నత పాఠశాలల్లో బోధనకు వెళతారు? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో టీచర్ల సంఖ్యపై కసరత్తు పూర్తవుతుందని విద్యా శాఖ అంచనా వేసింది. అయితే నూతన విద్యా విధానం అమలులో భాగంగా జిల్లాలో 146 పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వెళ్లి బోధన చేస్తున్నారు. మధ్నాహ్న భోజనం మాత్రం ప్రాఽథమిక, ఉన్నత పాఠశాలల్లో వేర్వేరుగా అందిస్తున్నారు.
పాఠశాలలను విలీనం చేయొద్దు
రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో ఆందోళనలు
రావికమతం, నవంబరు 2: ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన తెలిపారు. రావికమతం పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొశిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మండల విద్యా శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాథమిక పాఠశాలలో అన్ని వసతులతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నందున మెరుగైన బోధన అందుతుందని, మధ్యలో విలీన ప్రక్రియను తీసుకొచ్చి తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు పాఠశాలలో హెచ్‌ఎం ఆరోగ్యరాజు సమావేశం ఏర్పాటుచేసి 3, 4, 5 తరగతులు సమీప బాలికల ఉన్నత పాఠశాలలో విలీనం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలపగా, తల్లిదండ్రులు మక్తకంఠంతో వ్యతిరేకించారు.
విలీనంతో చదువులు దెబ్బతింటాయి
బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయవద్దని పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విలీనం ప్రతిపాదనను వ్యతిరేకించారు. విద్యా సంవత్సరం మధ్యలో పిల్లలను హైస్కూల్‌కు పంపిస్తే చదువులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పిల్లలను హైస్కూల్‌కు పంపేది లేదని స్పష్టంచేశారు. అనంతరం ఎంఈవో దేముడమ్మకు పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్ల గంగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జి.శ్రీనివాసరావు, నాయకులు శానపతి శ్రీనివాసరావు, మణికంఠ, చిన్ని అప్పారావు, తాటికొండ రాజు వినతిపత్రం అందజేశారు.
0 Comments:
Post a Comment