✍ఉద్యోగుల సమస్యలపై జిల్లాల్లో భేటీలు
🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయిన జాయింట్
స్టాఫ్ కౌన్సిల్ ఇకపై జిల్లా స్థాయిలో కూడా వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ. మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇవే సమావేశాలను శాఖల వారీగా కూడా నిర్వహించాలని నిర్దేశించారు. ఆర్థికశాఖ నేతృత్వంలో జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపైనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగుల్లో పిఆర్సి, డిఎ బకాయిలు, జిపిఎఫ్ చెల్లింపులు వంటివి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వీటిని జెఎస్సి సమావేశాల్లో పరిష్కారం అవుతాయని భావించినప్పటికీ, గత రెండు సమావేశాల్లో కొలిక్కి లేదు. ఆర్ధిక, సాధారణ పరిపాలనశాఖల అధికారులు కూడా దాదాపుగా ఈ అంశాలపై చేతులెత్తే సారు. ఈనేపథ్యంలోనే ఈ నెలాఖరులోగా పరిష్కారం కాకపోతే ఉద్యమించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శాఖల వారీగా, జిల్లాల వారీగా ఉద్యోగుల సమస్యలపై సమావేశాలు నిర్వహించా లని నిర్ణయించడం వెనుక పిఆర్సీ, ఇతర ఆర్ధిక అంశాల అమలులో జాప్యం కోసమేనన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల 15వ తేదీల్లోగా ఉద్యోగ సంఘాల నేతలతో శాఖలు, జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆదేశించడంతో అన్ని ఆర్ధిక అంశాల అమలు కూడా అప్పటివరకు వాయిదా పడినట్టే కనిపిస్తోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 15 తరువాత ఈ సమావేశాల ప్రగతిపై మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించాలని నిర్ణయించారు.
0 Comments:
Post a Comment