✍విలీనానికి ‘సమ్మతి’పై పునరాలోచన
♦ఆప్షన్లపై మళ్లీ తలో దారికి అవకాశం
♦జీవోలు రద్దు చేస్తేనే పూర్వ స్థితి
♦అయోమయంలో ఎయిడెడ్ విద్యార్థులు
🔺ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన నిర్ణయంపై యాజమాన్యాల పునరాలోచనకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. నాలుగు ఆప్షన్లు ఇచ్చి వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని ఈ నెల 17వ తేదీ సాయంత్రంలోగా రాత పూర్వకంగా తెలియజేయాలని సూచించింది. ఈ నిర్ణయంతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
🌻ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 15 : జిల్లాలో విలీనానికి తొలుత సమ్మతి తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పాఠశాల విద్యా రంగంలో 177, జూనియర్ కళాశాలల్లో 11, డిగ్రీ కళాశాలల్లో 12 ఉన్నాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తడం, హైకోర్టు జోక్యం, తదితర కారణాలతో పాఠశాల విద్యలో ఇప్పటి వరకు 120 ఎయిడెడ్ యాజమాన్యాలు సమ్మతి లేఖలను వెనక్కి తీసుకున్నాయి. ఇప్పటికే డీఈవో పూల్‌లోకి వచ్చిన 463 మంది ఎయిడెడ్ టీచర్లలో సమ్మతిని వెనక్కి తీసుకున్నారు. 120 విద్యా సంస్థల టీచర్లను మినహాయించి మిగిలిన 57 పాఠశాలల్లో పనిచేస్తున్న 192 మంది టీచర్లను ప్రభుత్వ పాఠశాలల్లోకి సర్దుబాటు చేయడానికి విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇక జిల్లాలో 11 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉండగా, వీటిలో పనిచేస్తున్న 63 మంది అధ్యాపకులను ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి తొలుత యాజమాన్యాలు సమ్మతి లేఖలను అందజేశాయి. తాజా నిర్ణయం నేపథ్యంలో ఆరు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు మళ్లీ విలీనానికే సమ్మతిని తెలియజేయగా, కేవలం ఒక్క కళాశాల యాజమాన్యం మాత్రమే సమ్మతిని వెనక్కి తీసుకుంది. మరో ఐదు కళాశాలల యాజమాన్యాలు తమ అభీష్టాన్ని తెలియజేయాల్సి ఉంది. ఇక ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు జిల్లాలో 13 (ఒక పాలిటెక్నిక్ సహా) ఉండగా వీటిలో 12 కళాశాలల యాజమాన్యాలు విలీనా టతనికి తమ సమ్మతిని గతంలోనే తెలియజేశాయి. ఈ కళాశాలల్లో పనిచేస్తున్న 102 మంది అధ్యాపక, 120 మంది అధ్యాపకేతర సిబ్బందిని ఇప్పటికే కౌన్సెలింగ్ ద్వారా ప్రభుత్వ కళాశాలలకు సర్దుబాటు చేయగా వీరంతా విధుల్లో చేరిపోయారు.
♦పూర్వ స్థితి వచ్చేనా ?
ప్రశాంతంగా కొనసాగుతున్న ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో నెలకొన్న ఆందోళనలు, భిన్న పరిస్థితులు ఇక పూర్వ స్థితికి రావడంపై అయోమయం నెలకొంది. ఎయిడెడ్ ఉపాధ్యాయులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకోవాల్సిందేనని ఇప్పటికే ఎయిడెడ్ ఉపాధ్యాయుల సంఘం గట్టిగా డిమాండ్ చేస్తుండగా, తమను తిరిగి వెనక్కి పంపిస్తే కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కొందరు ఉపాధ్యాయులు ఉన్నట్టు తెలిసింది. ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలల అధ్యాపకుల్లోనూ ఉన్నట్టు సమాచారం. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విధులు చేపట్టిన ఎయిడెడ్ అధ్యాపకుల్లో అత్యధికులు తిరిగి వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి ఇలా ఉంటే పలు యాజమాన్యాల ధోరణి మరోలా ఉంది. ప్రైవేటు రంగంగా మారితే ఫీజులు అధికంగా వసూలు చేసుకోవడానికి (ప్రభుత్వ షరతులకు లోబడి) వెసులుబాటుతోపాటు, స్వతంత్రంగా వ్యవహరించవచ్చునన్న అభిప్రాయంతో కొన్ని యాజమాన్యాలు ఉన్నాయి. ఇక ఆప్షన్లతో నిమిత్తం లేకుండా విలీనంపై జారీచేసిన జీవోలన్నింటినీ ప్రభుత్వమే రద్దు చేస్తే అసలు సమస్యే ఉండదని, ఇప్పుడున్న ఎయిడెడ్ విద్యాసంస్థలన్నీ యధాతధంగానే కొనసాగుతాయనే అభిప్రాయంలో మరికొన్ని ఉన్నాయి. జిల్లాలో ఎయిడెడ్ యాజమాన్యంలో ఉండేవి ఎన్ని, సమ్మతిని వెనక్కి తీసుకునే యాజమాన్యాలు ఎన్ని అనే దానిపై 17వ తేదీ తరువాతే స్పష్టత వస్తుంది.
♦ఎయిడెడ్‌ను కొనసాగించాల్సిందే
పెద్దిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ డెల్టా ప్రాంత విభాగం అధ్యక్షుడు
ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటినీ ఎయిడెడ్‌గానే కొనసాగించాలి. నాలుగు ఆప్షన్ల విధానం వల్ల కొందరు విద్యార్థులు నష్టపోతారు. ఆ మేరకు జీవోలు 42, 50లను ప్రభుత్వం రద్దు చేయాలి. దాతల సహకారంతో నిర్మించిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను అధ్యాపకులతోపాటు భవనాలతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుంది. జీవో 35 ఉత్తర్వులను రద్దు చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెడితే ఎయిడెడ్ విద్యా సంస్థలు మరింత వృద్ధి చెందుతాయి.
0 Comments:
Post a Comment