చర్చలు విఫలం : ఉద్యోగ సంఘాల ఆగ్రహం
శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
పిఆర్‌సి నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగసంఘాలు గురువారం జరిపిన చర్చలు విఫలమైనాయి. చర్చలు జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆ విషయం తన చేతిలో లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ధోరణి ఇదే మాదిరి కొనసాగితే తాడోపేడో తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జెఎసిల నేతలు ప్రకటించారు. అయితే, శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో, ఆ సమావేశంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలని, ఎటువంటి సానుకూల ఫలితం లేకపోతే ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఐదో బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనికి నోడల్ అధికారిగా ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి కె ఆదినారాయణను ప్రభుత్వం నియమించింది. ఈ సమావేశానికి హాజరుకావాలని 13 సంఘాలకు ఆర్థికశాఖ ఆహ్వానం పంపించింది. ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ సమావేశంపై ఉద్యోగుల దృష్టి కేంద్రీకృతమైంది. బుధవారం సచివాలయంలో చోటుచేసుకున్న పరిణామల నేపధ్యంలో ఉద్యోగసంఘాలతో చర్చించడానికి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆయనతో ఎపి జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఇతర నాయకులు ఆయనతో సమావేశమైనారు. అయితే, కీలకమైన పిఆర్‌సి నివేదిక విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు. నివేదికను బయటపెట్టే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సిఎస్ సమీర్ శర్మలు మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన తమతో చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు చెప్పారు. పిఆర్‌సి నివేదిక కోసం శుక్రవారం జరగనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పట్టుబడతామని ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. పిఆర్‌సి నివేదికను వెల్లడించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా, లేదా అని ప్రశ్నించారు.
మైలేజి కోసమే...: వెంకట్రామిరెడ్డి
పిఆర్‌సి నివేదిక కోసం రెండు జెఎసిలు పట్టుబడుతుండగా సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంటకట్రామిరెడ్డి మాత్రం దీనికి భినుంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన 'మైలేజి కోసం కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి' అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు చూస్తే బాధేస్తోందని చెప్పారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తరువాత పిఆర్‌సి నివేదికపై స్పష్టత వస్తుందన్నారు.
0 Comments:
Post a Comment