పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టండి
అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు వెళ్ళలేదు
పొత్తుల గురించి మీకెందుకు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
తిరుపతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాతో జాతీయ కార్యవర్గ సభ్యుల భేటీ సోమవారం తిరుపతిలో జరిగింది. ఏపీలో పార్టీ బలోపేతంపై ఈ భేటీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలకు అమిత్ షా పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్యక్రమాలకు రాకుండా ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యనేతలను అమిత్ షా నిలదీశారు. అసలు బీజేపీ వార్తలను కవర్ చేయని సాక్షి మీడియాను బహిష్కరించకుండా పేరున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థను ఎలా బహిష్కరిస్తారని అమిత్ షా ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎవరు వార్తలు రాసినా.. సమర్ధించాల్సిందేనని షా స్పష్టం చేశారు.
పొత్తుల గురించి మీకెందుకు..?
బీజేపీ కీలక నేతలైన సుజనాచౌదరి, సీఎం రమేష్‌తో అమిత్ షా గంట సేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పొత్తుల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని ఇద్దరు నేతలను అమిత్ షా నిలదీశారు. పొత్తుల గురించి చెప్పాల్సింది అఖిల భారత పార్టీ అధ్యక్షులు అంటూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై అమిత్ షాకు ఇరువురు ఎంపీలు వివరించారు. అయితే అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు వెళ్లలేదని అమిత్ షా నిలదీశారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా పార్టీ తీర్మానం చేసిన తర్వాత పాదయాత్రకు మద్దతు ఇవ్వాలి కదా అని సూచించారు. పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలను రాష్ట్ర నాయకులు వివరణ అడగడంపైనా షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఒక సామాజిక వర్గం పాల్గొంటుందని కొంతమంది నేతలు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ తరపున రైతుల మహాపాదయాత్రలో పాల్గొనాలని రాష్ట్ర నేతలను అమిత్ షా ఆదేశించారు. కేంద్రంలోని పెద్దల పేర్లు చెప్పుకుని రాష్ట్రంలో పెత్తనాలు చేయవద్దని ఇరువురు నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, దాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవడంలో విఫలమవుతున్నామని కొంతమంది నేతలు అమిత్ షాకు వివరించారు. పార్టీ బలోపేతంపై చర్చకు రెండు మీటింగ్‌లు నిర్వహించాల్సి వచ్చినప్పుడే మీలో అభిప్రాయ బేధాలు ఉన్నట్లు తెలిసిపోయిందని రాష్ట్ర నేతలను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం, వారిని గౌరవించడం నేర్చుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ, అవినీతి పార్టీనని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి షా సూచించారు. ఎవరి మీదనో ఆధారపడవద్దని, అందరూ పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు.
0 Comments:
Post a Comment