Bala-barathi-school పిల్లల్ని బడా కార్పొరేట్ స్కూల్లో చదివించాలనుకున్నారు వాళ్ళంతా. కానీ, వాళ్ళంతా సగటు మహిళలే. కార్పొరేట్ స్కూళ్ళకు పంపే ఆర్థికస్తోమత లేదు. కానీ, ఎలాగైనా సరే….పిల్లల్ని అలాంటి స్కూల్లోనే చదివించాలన్న పట్టు మాత్రం విడిచిపెట్టలేదు. ‘వేరే బళ్ళో ఎందుకు? మనమే ఒక స్కూలు పెట్టేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నారు. దాన్ని చేతల్లో చూపించారు. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఓస్కూల్ ను నిర్మించారు ఆంధ్రాలోని కర్నూలు జిల్లా మహిళలు.
మహారాజా ప్యాలెస్ లా కన్పిస్తున్న ఈ బిల్డింగ్ స్కూలు. రూపాయి రూపాయి పోగు చేసి, ఇటుకా ఇటుకా పేర్చి….చెమటోడ్చి కట్టుకున్న భవనం.
డ్వాక్రా పొదుపు మహిళలు తమ శ్రమశక్తితో నిర్మించుకున్న ఈ భవంతికి ఎంతో చరిత్ర ఉంది. ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే….అక్షరం ముక్క కూడా రాని 10 వేలమంది పొదుపు మహిళల ఎనిమిదేళ్ల శ్రమశక్తితో ఈ బిల్డింగ్ రూపుదిద్దుకుంది. మెల్లమెల్లగా రెండంతస్తులు పూర్తి చేసుకుని, మూడో అంతస్తు నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకోబోతోంది. తమకు ఎలాగూ చదువులేదు. కనీసం పిల్లలకైనా చదువు చెప్పిస్తే, వాళ్ళ బతుకులు బాగుపడతాయని అనుకున్న మహిళల ఆలోచనే ఈ భవంతికి పునాది.
ఈ చరిత్ర తెలుసుకుంటే….ఓ అద్భుతం చూసినట్టే ఉంటుంది. 1995లో ఓర్వకల్లు మండలం హుశేనాపురంలో ఒక్కో సంఘంలో పదిమంది చొప్పున రెండు డ్వాక్రా పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. ఆర్థికంగా ఒక్కో మెట్టు ఎదగడం ప్రారంభించాయా సంఘాలు. వీరి స్ఫూర్తి మండలంలోని 22 గ్రామాలకు పాకింది. మండలంలోని అన్నిగ్రామాల్లో దాదాపు వెయ్యిసంఘాలు ఏర్పడి పదివేలమంది సభ్యులుగా చేరారు. రోజుకో రూపాయి చొప్పున పొదుపు చేసుకుంటూ 8 కోట్ల రూపాయలు పోగుచేశారు. ఒక పక్క వాళ్ళు డెవలప్ అవుతూనే మరోపక్క పొదుపు సంఘం కూడా డెవలప్ అయ్యేటట్టు చూసుకున్నారు.
10 వేల మంది కలిసి పోగుచేసిన ఈ 8 కోట్ల రూపాయల్ని బ్యాంకు ఖాతాల్లో ఉంచకుండా, సంఘంలోని సభ్యులకే తక్కువ వడ్డీకి అప్పులుగా ఇచ్చారు. అలా వడ్డీ రూపంలో మరో ఐదున్నర కోట్ల రూపాయలు వచ్చింది. వీరి పొదుపు స్ఫూర్తిని చూసిన బ్యాంకర్లు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే మహిళలకు 70 కోట్ల రపాయల మేర అప్పులిచ్చారు. దీంతో ఓర్వకల్లు మండల సమాఖ్య టర్నోవర్ దాదాపు 84 కోట్ల రపాయలకు చేరుకోవడంతో, వారే సొంతంగా ఓ మహిళా బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు.
2008 లో వచ్చిన ఒక ఆలోచన ఈ మహిళల శక్తికి పెద్ద పరీక్షే పెట్టింది. 2008 లో ఓర్వకల్లు పొదుపు గ్రామైక్య సంఘం ఆఫీసు పక్కనే ఉన్న చిన్నగదుల్లో స్కూల్ ను మొదలుపెట్టారు. పొదుపు మహిళలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రోత్సహించిన సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి పేరు మీదనే తమ స్కూల్ కు ‘బాలభారతి’ అని పేరు పెట్టుకున్నారు. ఈ స్కూలుకు సొంత భవనం ఏర్పాటు చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు.
మామూలు స్కూళ్ళలా కాకుండా కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ఉంటేనే తమ పిల్లలు పైకొస్తారనుకుని పెడితే అలాంటి స్కూలే పెట్టాలనుకున్నారు. ఈ కల ఒక్కరోజులో నిజం కాలేదు. ఎనిమిదేళ్ళు పట్టింది. చివరకు కార్పొరేట్ స్కూల్ తరహాలోనే మంచి స్కూల్ ఏర్పడింది.
సొంతంగా బ్యాంకు ఏర్పాటు చేసుకున్న ఆత్మవిశ్వాసం, చేతిలో డబ్బూ ఉండడంతో ఆ స్కూలుకు సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అక్కడితో ఆగలేదు. ‘సంకల్పం ఉంటే చాలు, ఏదీ అసాధ్యం కాదు’ అని రుజువు చేశారు కూడా. ఓర్వకల్లుకు కిలోమీటరు దూరంలో ఏడెకరాల స్థలాన్ని కొనుక్కున్నారు. బిల్డింగ్ ప్లాన్స్ రెడీ చేసుకుని, తరువాత స్కూలు భవంతికి వాళ్ళే కూలీలయ్యారు. పునాదులు తవ్వడం మొదలు ఇటుకలు, సిమెంటు, ఇసుక మోస్తూ.. తమ కుటుంబాలతో కలసి ఎనిమిదేళ్లుగా శ్రమించారు. తామే కూలీలుగా.. మేస్త్రీలుగా మారిపోయారు. ఏ ఒక్కరూ రూపాయి కూలీ తీసుకోలేదు. వంతుల వారీగా శ్రమదానం చేస్తూ, నిర్మాణాన్ని చాలావరకు పూర్తి చేశారు.
మూడంతస్తుల్లో, సువిశాలమైన 60 క్లాసు రూములు కడదామనుకున్నారు. ఇప్పటికి 40 క్లాసు రూములు కట్టడం పూర్తి చేశారు. మిగిలిన 20 గదులను కూడా రేపో మాపో పూర్తి చేయబోతున్నారు. అలాగే మూడెకరాల్లో సువిశాల మైదానాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆట వస్తువులను కూడా సమకూర్చుకున్నారు.
నిర్మాణం పూర్తి చేసుకున్న రూముల్లో క్లాసులు నడుస్తున్నాయి. ఫర్నీచర్ క్వాలిటీతో ఉండేలా చూశారు. కారిడార్లు కానీ, స్కూల్లో మిగతా ప్లేసెస్ కానీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్నారు. పిల్లల యూనిఫామ్ కూడా స్టయిలిష్ గా ఉంటుంది. స్కూలుకి బస్సులు కూడా ఉన్నాయి. విద్యావేత్తల సలహాలు, సూచనలతో పూర్తిగా క్వాలిఫైడ్ టీచర్లను నియమించుకున్నారు. సీసీ కెమెరాలు, మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
పొదుపు మహిళలు దాచుకున్న సొమ్ము 7 కోట్ల రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో కట్టిన ఈ స్కూల్ భవంతి నిర్మాణంలో పాలుపంచుకున్న వారంతా పొదుపు మహిళలు, వారి భర్తలు….ఇతర కుటుంబసభ్యులే. పూర్తిగా తమ పొదుపు మొత్తాల నుండి సేకరించిన డబ్బుతో కట్టారిది. బహుశా ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా జరిగి ఉండకపోవచ్చని పొదుపు సంఘాల సలహాదారు విజయభారతి అంటున్నారు.
ఇక్కడ పొదుపు సంఘాల సభ్యుల పిల్లలకు చదువు ఫ్రీ గా చెప్తారనుకుంటే పొరపాటే. వాళ్ళ పిల్లలకు కూడా ఫీజులుంటాయి. 5 వేలనుంచి 10 వేల వరకు ఫీజులుంటాయి. స్కూలు మెయింటెనెన్స్ కోసం ఇది అవసరమని వాళ్ళు డిసైడై, అలాగే నడిపిస్తున్నారు.
ఈ స్కూల్లో ఈ సంఘాల సభ్యుల కుటుంబాల పిల్లలకే కాదు. 36 మంది అనాథలకు, మరో 40 మంది బాలకార్మికులకు కూడా స్కూల్లో ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించారు.
0 Comments:
Post a Comment