Apps Burden to Teachers: గురువులపై యాప్‌ల బరువు!
మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల వరకూ పర్యవేక్షణ
గురువులపై ఫొటో తీయడం.. అప్‌లోడ్ చేయడం
గంటల తరబడి సమయం వృథా
ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు కూడా..
ఇక చదువు చెప్పేందుకు సమయమేదీ?
పిల్లలకు నాణ్యమైన బోధనపై ప్రభావం
విద్యార్థి పాఠశాలకు రాగానే హాజరు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. మధ్యాహ్న భోజనానికి ముందు పాత్రలన్నీ శుభ్రం చేసిన ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
వండిన ఆహార పదార్థాలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయో, లేవో స్వయంగా చూసి ఫొటోలు తీసి, వాటినీ అప్‌లోడ్ చేయాలి... ఇలా ఫొటోలు తీయడం, వాటిని అప్‌లోడ్ చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా మారింది. బడిలో బోధనకు కేటాయించాల్సిన విలువైన సమయంలో తమపై ఈ యాప్‌ల భారమేంటని గురువులు గగ్గోలు పెడుతున్నారు.
పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ‘అదనపు’ పనుల బరువుతో సతమతమవుతున్నారు. విద్యార్థి పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచీ బోధనపై దృష్టి సారించాల్సిన వీరంతా ఇప్పుడు యాప్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. చదువుకు మించి వారితో చేయిస్తోన్న అనేక ఇతర పనులతో నిత్యం నలిగిపోతున్నారు. ‘నాడు-నేడు’ పనుల పర్యవేక్షణతో పాటు మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల పరిశుభ్రత వరకూ అన్నీ టీచర్లే చూసుకోవాలి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్ చేయాలి. గురువులకు ఈ పనులే భారంగా మారగా, ఇప్పుడు విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం లాంటి పనులూ అదనంగా చేరాయి. మొత్తంగా ఈ పనులన్నీ చేసేందుకు పాఠశాలకో ఉపాధ్యాయుడిని పూర్తిగా కేటాయించాల్సి వస్తోంది. ఇద్దరు టీచర్లు చేస్తే రెండేసి గంటలు పడుతుందని అంచనా. ఆ మేరకు వీరు తరగతులు తీసుకునేందుకు అవకాశం ఉండటం లేదు.
బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఇతర పనులకు కేటాయించడంతో విద్యలో నాణ్యత తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులే ఈ పనులు చేస్తున్నారు. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఈ పనులు మరింత భారంగా మారాయి. ఈ క్రమంలోనే ఇటీవల గుడ్లు, చిక్కీల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయలేదంటూ టీచర్లకు ఉన్నతాధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. వాస్తవానికి కాంట్రాక్టర్లు వాటిని సరఫరా చేయకపోవడంతో ఫొటోలు తీయలేకపోయారు.
విద్యార్థులకే నష్టం
ఈ పరిణామాలు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించడం మాట అటుంచి, దీనివల్ల విద్యార్థులకే ఎక్కువ నష్టమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు నాణ్యమైన బోధన చేయడం, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని అంచనా వేయడం, తల్లిదండ్రులతో పిల్లల గురించి చర్చించడం, వారు మరింత రాణించేందుకు ఏం చేయాలన్న ప్రణాళికలపై ఆలోచించే సమయం లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతారని వివరిస్తున్నారు. ఈ యాప్‌లతో ఉపాధ్యాయులకు సమయం వృథా కావడం, విద్యార్థులపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులకు విద్య నాణ్యతపై నమ్మకం పోయే పరిస్థితిని కల్పిస్తాయని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వ్యక్తిగత సామర్థ్యాలను అంచనా వేసి సరైన దిశగా నడిపిస్తేనే వారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడం సాధ్యపడుతుంది. కానీ అలాంటి వాటికి సమయం ఇవ్వకుండా, కనీసం బోధనకు కూడా అవకాశం లేకుండా టీచర్లపై యాప్‌ల భారం వేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫొటోలు తీసేందుకు షరతులు
మరోవైపు ఈ ఫొటోలు తీయడానికి కూడా అనేక నిబంధనలు విధించారు. వెలుతురు సరిగా ఉండాలి. ఫొటో స్పష్టంగా ఉండాలి. టాయ్‌లెట్‌లో ఫొటో తీస్తున్నప్పుడు నీడలు ఉండకూదు. మరుగుదొడ్లో కమోడ్ సాధ్యమైనంత లోపలి ప్రాంతంతో సహా పూర్తిగా కనిపించాలి. గోడలు కనిపించకూడదు, కెమెరా ఫోకస్ టాయ్‌లెట్ కమోడ్, ఫ్లోర్‌పైనే ఉండాలి. అస్పష్టంగా ఉంటే కుదరదు. ట్యాబ్, కంప్యూటర్ మొదలైన స్ర్కీన్ల నుంచి చిత్రాలు తీయకూడదు... అంటూ అనేక షరతులు విధించారు. చాక్‌పీసులు పట్టుకుని తరగతి గదిలో బోధన చేయాల్సిన సమయంలో... సెల్‌ఫోన్లు పట్టుకుని మరుగుదొడ్లలో రోజూ ఫొటోలు తీసే దుస్థితి వచ్చిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
0 Comments:
Post a Comment