యాప్ సోపాలు!
🌻- న్యూస్‌టుడే, సోంపేట, రాజాం(శ్రీకాకుళం)
🔺ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కన్నా బోధనేతర కార్యక్రమాల వల్ల సమయం వృథా అవుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. హాజరు నుంచి మధ్యాహ్న భోజన నిర్వహణ వరకూ నమోదు, చిత్రాలు తీయడం తలకుమించిన భారంగా మారిందని వాపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే సిగ్నల్స్ లేకపోవడం, యాప్‌లు తెరుచుకోకపోవడంతో అవస్థలు తప్పడ[ం లేదు. ఆయా సమస్యలు పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు.
ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఈ పనుల కోసమే పూర్తిస్థాయిలో ఉండాల్సిన పరిస్థితి. ఈ అంశాలు తలనొప్పిగా మారాయని వారు వాపోతున్నారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా యాప్‌లతో పరిశీలించి నోటీసులు జారీ చేస్తుండటంతో అవస్థలు పడుతున్నామని పేర్కొంటున్నారు. బడికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. ఇటీవల డ్రై రేషన్ జాబితాలు తయారు చేయించారు. జగనన్న విద్యాకానుక కిట్లు అందించే సమయంలో పిల్లల తల్లిదండ్రుల బయోమెట్రిక్ సేకరించాల్సి వచ్చింది.
* సోంపేట మండలం గొల్లవూరు ప్రాథమిక పాఠశాలలో 60 మంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒకరు రోజంతా యాప్‌ల విధులకే పరిమితం కావడంతో ఒకరే చదువు చెప్పే పరిస్థితి. ఒకరు సెలవు పెడితే బోధనకూ సెలవే.
* కొరంజభద్ర ఏకోపాధ్యాయ బడిలో ఐదు తరగతులకు ఒక్కరే పాఠాలు చెప్పాలి. వివరాలు అప్‌లోడ్ చేయాలి. ఇలాంటి చోట్ల కూడా నిర్వహణ చిత్రాలు సరిగా కనిపించలేదంటూ నోటీసులొస్తున్నాయని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
♦ఏకోపాధ్యాయ పాఠశాలల్లో తిప్పలు
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. వివరాలన్నీ నమోదు చేసుకుంటే తప్ప బోధనకు ఉపక్రమించలేని పరిస్థితి. ఇటీవల వందల కొద్దీ ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనమయ్యాయి. దీంతో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగింది.
నెట్‌వర్క్ కష్టాలు
ఇంత ప్రక్రియ చేపట్టాలంటే అంతర్జాల సౌకర్యం అవసరం. నెట్‌వర్క్ లేని చోట ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంకేతాలు (సిగ్నల్స్) సరిగా లేనిచోట ఒక్కో చిత్రం తీసి అప్‌లోడ్ చేసేందుకు చాలా సమయం పడుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని బడుల్లో ఈ అవస్థలు ఎక్కువగా ఉన్నాయి.
♦నమోదు చేయాల్సిన వివరాలు
* ఐరిస్ ఆధారంగా ఉపాధ్యాయుల హాజరు
* విద్యార్థుల హాజరు, గైర్హాజరైనవారి వివరాలు
* చేతులు శుభ్రం చేసుకునే బేసిన్లు, గచ్చుల చిత్రాలు
* మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలు, వంట పాత్రలు, సరకుల నిల్వ గది, మెనూ, నీటి సదుపాయం, పిల్లలు కూర్చుని తినే గచ్చు ఇలా.. పలు అంశాలను పొందుపరచాలి.
♦మెరుగైన సేవల కోసమే..
- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం
సమాచార సేకరణ విధుల్లో భాగంగానే భావించాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసమే ప్రభుత్వం వీటిని సేకరిస్తోంది. విద్యార్థులకు మెరుగైన సేవలు అందుతాయి. రోజులో కొద్దిపాటి సమయం వెచ్చిస్తే సరిపోతుంది. త్వరలో అంతర్జాల సమస్యలను అధిగమిస్తాం.
0 Comments:
Post a Comment