✍ఒక్కరోజే.. అసెంబ్లీ...
🌻అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఒక్క రోజుకే పరి మితం కానున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు జరిగి ఆరు నెలలు పూర్తి కావస్తున్న నేప థ్యంలో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. తొలుత వారం రోజుల వరకూ నిర్వహిస్తామన్న సంకేతాలను పంపింది. అయితే కేవలం ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ఒక్క రోజు మాత్రమే నిర్వహించి వాయిదా వేస్తారు. మళ్లీ వచ్చే నెలలో వారం, పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు 17వ తేదీన కేబినెట్ భేటీ ఉంది. ఆ రోజున ఒక్క రోజులో ఏం చేయాలో ఖరారు చేస్తారు. ఈ ఒక్క రోజు కూడా ప్రభుత్వం ఎందుకు పెట్టాలని అనుకుంటోంది. అంటే.. రాజ్యాంగం ప్రకారం తప్పని సరి పరిస్థితి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఒక సారి అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుంది. రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ వర్షా కాల సమావేశాలను నిర్వహించలేదు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించేశారు. ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఒక్క రోజు నిర్వహించడం జరిగింది. గత మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. చివరికి మే 20వ తేదీన ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించి బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకుని వాయిదా వేశారు. నవంబర్ 20వ తేదీకి ఆరు నెలలుపూర్తయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20వ తేదీ కంటే ముందే అసెంబ్లీని సమావేశపర్చాలి. ఈ నేపథ్యంలో 18వ తేదీన శాసనసభ సమావేశం అవుతుంది. గతంలో జరిగిన ఒక్క రోజు సమావేశానికి విపక్ష తెదేపా హాజరు కాలేదు. ప్రస్తుతం ఒక్క రోజు జరిగే సమావేశానికి తెదేపా హాజరవుతుందో లేదో ఇప్పటి వరకు స్పష్టత లేదు. దాదాపు సమావేశాలకు తెదేపా హాజరు కాకపోవచ్చని సమాచారం.
0 Comments:
Post a Comment