AP News: రాజధాని నిర్ణయించి, కేంద్రం నిధులిచ్చిన తర్వాత ఎలా మారుస్తారు?
ఆ హక్కు రాష్ట్రానికి లేదు
ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములిచ్చారు
రాజధాని అమరావతిపై హైకోర్టులో రెండో రోజు కొనసాగిన వాదనలు
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి.
విచారణ సందర్భంగా 'రాజధాని రైతు పరిరక్షణ సమితి' తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. రెండో రోజు విచారణ వివరాలను హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మీడియాకు వివరించారు.
''అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో నిన్న ప్రారంభమైన వాదనలు ఈరోజు కూడా కొనసాగాయి. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు ఏవిధంగా చట్ట వ్యతిరేకమో న్యాయవాది శ్యాం దివాన్ వివరించారు. అనేక చట్టపరమైన అంశాలను ఆయన వాదనలో ప్రస్తావించారు. పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు .. హైదరాబాద్ అనే భాగ్యనగరాన్ని ఏపీ కోల్పోతోంది కాబట్టీ... అందుకు ప్రత్యామ్నాయంగా ఒక మహానగరాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వమే తగిన సహాయం చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు ఏర్పడినప్పడు చేసిన చట్టాల్లో ఇలాంటి విషయం ఎక్కడా లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ప్రత్యేకంగా రాజధాని నిర్మాణానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఏవిధంగా సాయం చేయాలనేదానిపై విభజనచట్టంలో ప్రస్తావించారు. పార్లమెంట్ చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని ఒకసారి నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇక్కడ ఖర్చు చేసిన తర్వాత రాజధాని మార్చేస్తామనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాజధాని నిర్ణయం ఒకేసారి ఉండాలనేది పార్లమెంట్ చట్టం స్పిరిట్. రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా మరో చట్టం తీసుకురావడానికి వీల్లేదు.
ప్రభుత్వ హామీని నమ్మే రైతులు భూములిచ్చారు
సీఆర్‌డీఏ చట్టం తీసుకురావడం, దానిలో అంతర్భాగంగా మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం చేయడం జరిగింది. 29 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వాధికారులు రైతులతో సంప్రదింపులు జరిపి .. అనేక హామీలు ఇచ్చి, అభివృద్ధికోసం భూములు ఇవ్వాలని చెప్పి రైతులను ఒప్పించారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్ని ప్రక్రియలు చట్ట పరంగానే జరిగాయి. మాస్టర్ ప్లాన్ సీఆర్డీఏలో అంతర్భాగం అయినప్పుడు, మాస్టర్ ప్లాన్ ప్రకారమే నవ నగరాలు నిర్మిస్తామని ప్రతిపాదన చేశారు. అందుకు కొంత కాలపరిమితి కూడా పెట్టారు. పెద్ద నగరాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో నివసించే ప్రజల జీవన స్థితిగతులు మారిపోతాయని ప్రజలకు చెప్పారు. విద్య, వైద్య సంస్థలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఇదంతా నమ్మి రైతులు భూములు ఇస్తే .. సరైన కారణం లేకుండా, చట్ట ప్రకారం ఇచ్చిన హామీని ఉల్లంఘించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
రైతులకు రూ.33వేల కోట్ల ఆదాయం లేకుండా చేసే హక్కు లేదు
రాజధాని నిర్ణయం తీసుకునేముందు ఈ ప్రాంతంలో భూమి విలువ గజం రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ఉందని ప్రభుత్వం నియమించిన ఆస్తుల మదింపు కమిటీ చెప్పింది. రాజధాని ఏర్పడితే ఈ ప్రాంతంలో గజం విలువ రూ.44 వేల నుంచి రూ.86వేల వరకు పెరుగుతుందని అప్పట్లో కమిటీ స్పష్టం చేసింది. అమరావతి, విజయవాడలో భూముల విలువలు ఎలా పెరుగుతాయో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు అంచనాలు వేసి చెప్పాయి. ఆ విధంగా భూమి అభివృధ్ధి చేసిన తర్వాత రైతలుకు ఇచ్చే భూమిలో ఎకరానికి 1250 గజాల చొప్పున లెక్కగడితే.. ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు మించి ఇవ్వాల్సి వస్తోంది. దాదాపు రూ.33వేల కోట్ల రూపాయల ఆదాయం రైతులకు లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉందని రైతుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇలాంటి వివాదాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు, రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు వచ్చిన సమస్యలు, రాష్ట్రాలు చట్టాలు చేసేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలపై పలు తీర్పులను ధర్మాసనం ముందు పెట్టారు. రేపు కూడా ఆయన వాదనలు కొనసాగించనున్నారు. న్యాయవాది శ్యాం దివాన్.. వాదనలు చేసేటప్పుడు పలుమార్లు 'అవర్ క్యాపిటల్' అని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కిశోర్ మిశ్రా... న్యాయవాదిని ఉద్దేశించి.. 'అమరావతి మీ రాజధానే మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని. భారతదేశం.. స్వాతంత్ర్యం తెచ్చిన సమరయోధులదే కాదు...దేశ ప్రజలందరిదీ' అని వ్యాఖ్యానించారు.
0 Comments:
Post a Comment