చదువు చెప్పించడం తప్ప..అన్ని పనులూ చేయిస్తున్నారు
♦ఉపాధ్యాయులతో మరుగుదొడ్లూ కడిగిస్తున్నారు
♦రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలు
🌻ఈనాడు, అమరావతి:
విద్యా వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయులతో చదువు చెప్పించడం తప్ప.. అన్ని పనులూ చేయిస్తున్నారని, చివరకు మరుగుదొడ్లను సైతం కడిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులను వరుసలో నిలబెట్టే బాధ్యతను ఇటీవల టీచర్లకు అప్పగించింది. బడిలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా? మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలవుతుందా? లేదా అన్నది పర్యవేక్షించి ఆ ఫొటోలను ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్ చేసే పనిని వారికే అప్పగించింది. చదువు చెప్పడం తప్ప మిగిలిన పనులన్నీ ఉపాధ్యాయులే చేస్తున్నార’ంటూ ప్రస్తావించింది. ఇది తీవ్రమైన వ్యవహారమని పేర్కొన్న హైకోర్టు.. టీచర్ల సేవలను చదువు చేప్పేందుకే ఉపయోగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించండంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ఎస్.శ్రీరామ్‌కు హితవు పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ/ స్థానిక సంస్థల పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర నిర్మాణాలు లేకుండా చూడాలని గతేడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడాన్ని హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.
♦సంబంధం లేని కాగితాలు సమర్పిస్తారా?:
గ్రామ సచివాలయాలు తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో నిర్ధిష్ట వివరాలు ఇవ్వకుండా.. అధికారుల మధ్య జరిగిన రాతపూర్వక సంప్రదింపుల ఫైల్స్‌ను కోర్టు ముందు ఉంచితే ఉపయోగమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘సంబంధం లేని కాగితాలు సమర్పించి కోర్టును భ్రమింపజేయాలన్నది అధికారుల ఉద్దేశంలా ఉంది. వేల పేజీల జిరాక్స్ కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా కొన్ని పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయి. పురపాలక శాఖ అధికారులు సంతృప్తికరంగా స్పందించినా.. పాఠశాల విద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సచివాలయాలను ఖాళీ చేయించకుండా బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి ఉండటం తీవ్రమైన విషయం. అంతిమంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశార’ని న్యాయమూర్తి ఆగ్రహించారు. గతంలో రోడ్లపై ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కించేందుకు ఉపాధ్యాయులను రహదారులపై నిలబెట్టారని, వారిలో తన తండ్రి కూడా ఉన్నారని జస్టిస్ దేవానంద్ గుర్తుచేశారు. ఏజీ, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, పాఠశాల విద్య జీపీ స్పందిస్తూ.. పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాల తొలగింపునకు తీసుకున్న చర్యల వివరాలను సమగ్రంగా నివేదిస్తామని చెప్పారు. దీనిపై ప్రభుత్వం కూడా సమగ్ర స్థాయీ నివేదిక ఇవ్వాలంటూ.. కేసు విచారణను న్యాయమూర్తి ఈనెల 15కు వాయిదా వేశారు.
0 Comments:
Post a Comment