✍40% ఫిట్‌మెంట్ ప్రకటించాల్సిందే
♦27 శాతం ఇస్తామంటే అంగీకరించం
♦ఏపీజీఈఎఫ్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పష్టీకరణ
♦సీఎం జన్మదినం సందర్భంగా ‘కృతజ్ఞత సభ’ నిర్వహిస్తామని వెల్లడి
*🌻ఈనాడు డిజిటల్, అమరావతి:* ఉద్యోగులకు 11వ పీఆర్‌సీలో 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి డిమాండు చేశారు. ప్రభుత్వం 27 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామంటే అంగీకరించబోమన్నారు. 2018 జులై నుంచి 11వ వేతన సవరణ అమలు చేయాలని, 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ (పెరిగిన వేతనం) ఇవ్వాలని కోరారు. 2022 జనవరి నుంచి వేతనంతో కలిపి చెల్లించాలని డిమాండు చేశారు. డిసెంబరు 10లోపు పీఆర్‌సీ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామని, అలా జరగకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య శనివారం విజయవాడలో సమావేశమైంది. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ తదితర అంశాలపై వివిధ సంఘాలతో చర్చించిన అనంతరం.. వెంకట్రామిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘వేతన సవరణపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. పది రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టంగా చెప్పారు. వచ్చే వారం ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశముంది. సీఎం జగన్ ఎవరో బెదిరిస్తే భయపడే వ్యక్తి కాదు. ప్రభుత్వం వెసులుబాటును బట్టి పీఆర్‌సీ ప్రక్రియను పూర్తి చేస్తుంది’ అని వెల్లడించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా డిసెంబరు 21న లక్ష మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ‘కృతజ్ఞత సభ’ ఏర్పాటు చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అక్టోబరు 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినా.. వివిధ కారణాలతో ఆలస్యమవుతోందన్నారు. సీఎం జన్మదినంలోగా ప్రొబేషన్ ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీజీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి అరవపాల్ ఉన్నారు.
♦ఏపీజీఈఎఫ్ ప్రధాన డిమాండ్లు
* సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదా ప్రత్యేక సమావేశం ఏర్పాటు
* రెగ్యులర్ ఉద్యోగులతో పాటు.. కార్పొరేషన్లు, ఆదర్శ పాఠశాలల ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు ఒకేసారి పీఆర్‌సీ ప్రకటన
* రాష్ట్రంలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ తగ్గించకుండా కొనసాగింపు
* మహిళా ఉద్యోగులకు రెండేళ్లపాటు శిశు సంరక్షణ సెలవులు
* పొరుగుసేవల ఉద్యోగులకు వేతనాల పెంపు
0 Comments:
Post a Comment