థర్డ్ వేవ్ లేనట్లే.. వచ్చినా తీవ్రత తక్కువే!
'హైబ్రిడ్ ఇమ్యూనిటీ', భారీగా వ్యాక్సినేషనే కారణం
సెకండ్ వేవ్‌లోనే వైర్‌సబారిన అధిక శాతం ప్రజలు
తర్వాత దేశంలో టీకా పంపిణీతో మారిన పరిస్థితులు
అందుకనే ప్రస్తుతం తక్కువ సంఖ్యలో కరోనా కేసులు
సెప్టెంబరు మధ్యలో థర్డ్ వేవ్ వచ్చి వెళ్లింది: నిపుణులు
న్యూఢిల్లీ, నవంబరు 23: దేశంలో కొవిడ్ సంక్షోభం సమసినట్టేనా?
థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం కూడా తక్కువేనా? దీనికి అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. దీపావళి ముగిసి 3 వారాలైనా కేసులు తక్కువగానే ఉండడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. ఇప్పటికే రెండో వేవ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడడం, కొన్ని నెలలుగా టీకా పంపిణీ వేగిరం కావడాన్ని ప్రస్తావిస్తూ మరో వేవ్ వచ్చినా ముప్పు తక్కువే అంటున్నారు. శీతాకాలానికి తోడు కొత్త, వ్యాప్తి రేటు అధికంగా ఉండే వేరియం ట్ ఉద్భవిస్తే డిసెంబరు చివరి నుంచి ఫిబ్రవరి వరకు కేసులు కొంత పెరగొచ్చని, కానీ సెకండ్ వేవ్ అంతటి తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు సోనేపట్‌లోని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్‌మీనన్. అయితే, జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అంటున్నారు. టీకా పొంది ఉన్నందున చాలామందికి ఇప్పటికే రక్షణ లభించిందని చెప్పారు. నేరుగా టీకా తీసుకున్నవారితో పోలిస్తే.. కరోనా బారినపడి కోలుకుని టీకా పొందినవారికి రక్షణ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇలాంటివారిలో కలిగిన రోగ నిరోధక శక్తిని.. ''హైబ్రిడ్ ఇమ్యూనిటీ''గా పేర్కొంటున్నారు. మరోవైపు 46 రోజులుగా దేశంలో కేసులు 20 వేలలోపునే ఉంటున్నాయి. మంగళవారం 7,579 కేసులే వచ్చాయి.
వచ్చే నెలలో సగం పైగా మిగలనున్న టీకాలు
దేశంలో వచ్చే నెల ఆఖరుకు 31 కోట్ల టీకాలు (కొవిషీల్ట్, కొవాక్సిన్) అందుబాటులోకి రానుండగా, ఇందులో అవసరం మాత్రం 15.63 కోట్లే ఉండనుంది. అంటే సగంపైగా టీకాలు మిగలనున్నాయి. నవంబరులో తొలిడోసు పెద్దఎత్తున పంపిణీ చేశారు. నిర్ణీత వ్యవధి కారణంగా ఈ నెలలో రెండో డోసు పొందాల్సిన వారు తక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రాల్లో టీకాల నిల్వ పేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 21 కోట్ల టీకాలు ఉండడం గమనార్హం. కాగా, భారత్ బయోటెక్ సంస్థ తయారీ కొవాక్సిన్ టీకా వాణిజ్య ఎగుమతులకు కేంద్రం ఆమోదం లభించింది. దీంతో ఆసక్తి ఉన్న దేశాలకు ఈ టీకా కొనుగోలుకు వీలు కలగనుంది.
0 Comments:
Post a Comment