విలీనం సరే...గురువులేరీ?
రాష్ట్రంలో 3,4,5 తరగతుల విలీనంతో ఉపాధ్యాయుల కొరత - గదులు లేక పాత పాఠశాలల్లోనే బోధన
నూతన విద్యావిధానంలో భాగంగా కాకినాడలోని ఏపీఎస్పీ క్వార్టర్స్ ఉన్నత పాఠశాలకు సమీపంలోని ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులు 244 మంది వచ్చారు. ఇద్దరు ఉపాధ్యాయులనే కేటాయించారు. ఇప్పటికే ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా చినగదిలి మండలంలోని సునీల్‌శర్మ కాలనీ ఉన్నత పాఠశాలలకు 3,4,5 తరగతుల నుంచి 237మంది విద్యార్థులు రాగా ఒక్క ఉపాధ్యాయుడినీ కేటాయించలేదు. ప్రస్తుతం సబ్జెక్టుకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడి పోస్టూ ఖాళీయే.
*ఈనాడు - అమరావతి*
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉన్నత పాఠశాలలకు విద్యార్థులను కేటాయించిన అధికారులు ఆ మేరకు ఉపాధ్యాయులను మాత్రం సర్దుబాటు చేయడం లేదు. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతతో పిల్లలకు సబ్జెక్టులవారీగా బోధన ఎలా అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా ఉన్నత పాఠశాలల్లో గదుల కొరత నెలకొంది. దీంతో విలీనమైన తరగతులను మళ్లీ ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 250 మీటర్ల పరిధిలోని 2,663 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపారు. దీంతో 2,05,071మంది విద్యార్థులు విలీనమయ్యారు.
వచ్చే ఏడాది కిలోమీటరు పరిధిలోని 8,412 ప్రాథమిక పాఠశాలల నుంచి..* 2023-24నాటికి 25,396 ప్రాథమిక బడుల నుంచి 3,4,5తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేయనున్నారు. అయితే అందుకు అనుగుణంగా బోధన సిబ్బందిని మాత్రం కేటాయించడం లేదు.
ఇప్పటికే కొరత..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2.50లక్షల మంది విద్యార్థులు పెరిగారు. దీనికి అనుగుణంగా కొత్త నియామకాలు చేపట్టలేదు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో 1,795 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఇప్పుడు 3,4,5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులను కేటాయించేందుకు లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. బదిలీల సమయంలో 15వేల పోస్టులను బ్లాక్ చేశారు. ఇది కాకుండా ప్రతి నెలా పదవీ విరమణలు జరుగుతున్నాయి. ఇవన్నీ కలిపితే 18వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లే. డీఎస్సీ-2018 తర్వాత నియామకాలే చేపట్టలేదు. ఉన్నతాధికారులు మాత్రం ఉపాధ్యాయులనుసర్దుబాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తుండటం గమనార్హం.
*గదుల కొరత ఇలా.*. ఉన్నత పాఠశాలలకు కొత్తగా మూడు తరగతులు రావడంతో గదుల కొరత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ‘నాడు-నేడు’లో 18,496 గదులు నిర్మించాలని అంచనాలు రూపొందించారు. ఇందులో 11,400 గదులను 3,4,5 తరగతుల కోసం ఉన్నత పాఠశాలల్లో నిర్మించాల్సి ఉన్నా పనులను ప్రారంభించలేదు. రాష్ట్రంలో 220 పురపాలక పాఠశాలల్లో గదుల సమస్య నెలకొంది.
గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు ఉన్నత పాఠశాలలో 377 మంది విద్యార్థులకుగాను 14మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు 3,4,5 తరగతుల నుంచి 70మంది విద్యార్థులను చేర్చారు. ప్రాథమిక పాఠశాలనుంచి పిల్లలతోపాటు ఒక్కరే టీచర్ వచ్చారు. తరగతి గదులు లేకపోవడంలో పిల్లల్ని ప్రాథమిక పాఠశాలలోనే ఉంచారు.
0 Comments:
Post a Comment