నేడు ఒక రోజు అసెంబ్లీ
రెండున్నరేళ్లలో 31 రోజులు
దేశంలో అతితక్కువగా ఏడాదికి 12 రోజులే నిర్వహణ
కేరళలో సగటున 56 రోజులు
ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సిన అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఎపి వెనుకబడింది.
రెండున్నరేళ్లలో 31 రోజులు మాత్రమే సమావేశ పడింది. అంటే ఏడాదికి 12 రోజులు పాటు సమావేశాలు జరిగాయి. ఈ విషయంలో దేశంలోనే ఎపి అట్టడుగున ఉంది. అదే కేరళలో ఏడాదికి సగటున 56 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని అసెంబ్లీల్లోనూ పూర్తికాలం బడ్జెట్ సమావేశాలు నిర్వహించగా ఎపిలో ఒకరోజులో బడ్జెట్ ముగించేశారు. నేడు ఒకరోజు మాత్రమే సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఆరునెలల కాలంలో ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీతో ఆరునెలలు పూర్తవుతుంది. దీనికోసం 18వ తేదీన ఒకరోజుతో సమావేశం ముగించనున్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ ఆరు సెషన్లు జరిగాయి. నేడు జరగబోయేది ఏడోసెషన్. వరుసగా చూస్తే 33వ సెషన్ రెండు రోజులు, 34వ సెషన్ 14 రోజులు, 35వ సెషన్ ఏడు రోజులు, 36వ సెషన్ రెండు రోజులు జరిగింది. 37వ సెషన్ ఐదు రోజులు జరగగా, 38వ సమావేశాలు కూడా ఒకరోజే ముగించారు. 39వది ఒకరోజుతో ముగుస్తుంది. ప్రజా సమస్యలపై సావధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశాలు రెండుసార్లు రెండురోజులు, రెండుసార్లు ఒకరోజుతో ముగించడం చర్చనీయాంశం అవుతోంది. బిల్లులు కూడా పెద్దగా చర్చకు రావడం లేదు. ఆర్డినెన్స్ తీసుకురావడం, తరువాత దాన్ని బిల్లుగా మార్చుకోవడం గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా మారిపోయింది. గురువారం జరిగే సమావేశాల్లోనూ ఆర్డినెన్స్‌లు టేబుల్ చేయనున్నారు. ఒకఅంశంపై ప్రతిపాదన వస్తే అధికారపక్షంతోపాటు చట్టసభలో ఉన్న అన్ని పక్షాలూ చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు చేయాలి. అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై సీనియర్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎజెండా ఏమిటో ?
గురువారం జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతిపాదించిన ఎజెండాలో సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆర్డినెన్సులను టేబుల్ చేస్తున్నట్లు ప్రతిపాదించారు. వాటిపై చర్చకు అవకాశం లేదు. అయితే మహిళా సాధికారితతోపాటు మరో మూడు అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.
0 Comments:
Post a Comment