మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్కూల్‌కు చెందిన రెండవ తరగతి చదువుతున్న విద్యార్థికి వేసిన శిక్ష కారణంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
స్కూల్ బిల్డింగ్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో అల్లరి చేస్తున్న ఓ విద్యార్థిని.. స్కూల్ ప్రిన్సిపాల్ తల కిందులుగా వేలాడదీశాడు. ఒక చేతితో విద్యార్థి కాలును పట్టుకుని.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వదిలేసే రీతిలో ఆ స్టూడెంట్‌కు శిక్ష వేశాడు. అయితే ఈ ఘటనకు చెందిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ఆధారంగా ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదును నమోదు చేయాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది.
రెండవ తరగతి విద్యార్థికి కఠిన శిక్ష వేసిన ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మపై పోలీసులు కేసు బుక్ చేశారు. అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మీర్జాపూర్‌లోని అహరౌరాలో ఉన్న సద్బావన శిక్షాన్ సంస్థాన్ జూనియర్ హై స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. భయంతో కేకలు వేస్తూ, క్షమించమని కోరిన తర్వాత ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని వదిలేసినట్లు తెలుస్తోంది. సుమారు 10 నిమిషాల పాటు విద్యార్థిని తలకిందలుగా వేలాడదీసినట్లు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. పిల్లవాడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 352 సెక్షన్ కింద కేసు బుక్కైంది. స్కూల్ గుర్తింపును రద్దు చేసి, దాంట్లో ఉన్న 300 మంది విద్యార్థులను మరో స్కూల్‌కు తరలించనున్నట్లు విద్యాశాఖ అధికారి గౌతమ్ ప్రసాద్ తెలిపారు.
0 Comments:
Post a Comment