Torn currency notes: చిరిగిన కరెన్సీ నోట్లు మార్చుకోవాలా? ఇలా చేయండి!
ఇంటర్నెట్ డెస్క్: మనం ఏదైనా ఏటీఎంకు వెళ్లి నగదు విత్ డ్రా చేసినప్పుడో, లేదా దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసినప్పుడో మనకు చిరిగిన, ఖరాబైన కరెన్సీ నోట్లు రావడం అనేక సందర్భాల్లో జరుగుతుంటుంది.
బయట వాటిని ఎవరికి ఇచ్చినా తీసుకోరు. ఈ క్రమంలో మనం చాలా అవస్థలు ఎదుర్కొంటుంటాం. అయితే, ఇలాంటి కరెన్సీ నోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా మార్చుకోవాలనే అంశంపై ఆర్‌బీఐ పలు నిబంధనలు సూచించింది. వాటి ప్రకారం మీ వద్ద ఉన్న ఖరాబైన నోట్లను మార్చుకొని కొత్త నోట్లు పొందొచ్చు.
* ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. చిరిగిపోయిన/ఖరాబైన నోట్లను బ్యాంకుల వద్ద సులభంగా మార్చుకోవచ్చు. ఒకవేళ అవి నకిలీ నోట్లు అయితే తప్ప బ్యాంకులు వాటిని తీసుకొనేందుకు నిరాకరించడానికి వీల్లేదు. ఏ బ్యాంకు అయినా చిరిగిన నోట్లను తీసుకోకపోతే మీరు నేరుగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగైతే, ఆ బ్యాంకులపై చర్యలు ఉంటాయి.
* కరెన్సీ నోట్లు చిన్న ముక్కలుగా ఉన్నా.. చిరిగిపోయిన నోట్‌లో ఏదైనా భాగం మిస్ అయినా కూడా ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు. సాధారణంగా చిరిగిన నోట్లను కూడా ఏదైనా బ్యాంకు శాఖలో, ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకొనే వీలు ఉంది. ఇందుకోసం ఎలాంటి ఫారం కూడా నింపాల్సిన అవసరం లేదు.
* కరెన్సీ నోటుకు పెద్దగా దెబ్బతినకుండా ఎక్కడో చిన్న చిన్న ముక్కలుగా చిరిగితే వాటిని మార్చుకొని పూర్తి మొత్తంలో డబ్బును పొందొచ్చు. అదే, అదే పూర్తిగా చిరిగిన నోట్లకు మాత్రం మన వద్ద ఉన్న కరెన్సీ మొత్తం విలువలో కొంత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
* అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. రూ.1 నుంచి రూ.20 వరకు ఉన్న నోట్ల విషయంలో మాత్రం సగం మొత్తం ఇచ్చే నిబంధన ఏమీ వర్తించదు. అందువల్ల ఈ నోట్లకు పూర్తిగా మొత్తాన్ని చెల్లిస్తారు.
* ఒకవేళ కాలిన నోట్లు, పూర్తిగా నలిగి ముక్కలైన కరెన్సీ నోట్లను మాత్రం మార్చుకోవడం కుదరదని ఆర్‌బీఐ నిబంధన పేర్కొంటోంది. అలాంటి కరెన్సీని ఆర్‌బీఐ ప్రత్యేకంగా జారీచేసే కార్యాలయాల్లో మాత్రమే డిపాజిట్ చేసే వీలు ఉంటుంది. ఇలాంటి కరెన్సీ నోట్లతో బ్యాంకుల్లో మీరు మీ బిల్లులు లేదా పన్నులు చెల్లించుకోవచ్చు.
0 Comments:
Post a Comment