TS News: ఆర్నెల్లలోనే రూ. 30 లక్షల ఆదాయం
టమాట సాగుతో అద్భుతం చేసిన రాజేందర్‌రెడ్డి
జిల్లా ఉద్యానశాఖ అధికారితో రైతు రాజేందర్‌రెడ్డి
వ్యవసాయంతోనూ భారీ లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు కల్వకుర్తి మండలం ముకురాల గ్రామ రైతు రాజేందర్‌రెడ్డి. సాగుచేసింది టమాట పంటనే అయినా ఆధునిక పద్ధతులు, ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. తన 10 ఎకరాల పొలంలో ఎకరాకు రూ. 3 లక్షలు వెచ్చించి శాశ్వతమైన పందిరి వేయించారు. ఓ వేసవి మండుటెండనూ తట్టుకునే ఓ కంపెనీకి చెందిన టమాట విత్తనాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో నారును కొనుగోలు చేశారు. ముకురాల గ్రామంలోని తన ఆరు ఎకరాల భూమిలో రూ. 3 లక్షలతో పశువులు, కోళ్ల ఎరువు వేసి ‡ దున్ని మల్చింగ్ షీట్ వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న టమాట నారు నాటారు. వేసవి ఎండలతో పంట దెబ్బతినకుండా రూ. 4 లక్షలతో గ్రీన్నెట్ షెడ్డు ఏర్పాటుచేశారు. రసాయన ఎరువులు వేయలేదు. సస్యరక్షణకు కూడా వేపనూనె, వేస్ట్‌డీకంపోజర్ వంటి వాటినే ఎక్కువగా వాడారు. టమాట మొక్కలను దారాలతో పైకి కట్టేందుకు రూ. 2 లక్షల వరకు కూలీలకు ఖర్చు పెట్టారు.
మొక్కకు 7 కిలోల దిగుబడి
75 రోజులకు పంట కోతకు వచ్చింది. జూన్ 15 నుంచి ఇప్పటివరకు ఒక్కో మొక్క నుంచి 7 కిలోల టమాట దిగుబడి రావటం విశేషం. ఇప్పటివరకు ఆరు ఎకరాల్లో 16వేల బాక్సుల పంట రైతు చేతికి వచ్చింది. ఇంకా మార్చి వరకు పంట వచ్చే అవకాశముంది. మొదట్లో బాక్సుకు రూ. 500 వరకు ధర లభించింది. తర్వాత ధర తగ్గింది.
జిల్లాలోనే మార్కెటింగ్
రాజేందర్‌రెడ్డి సాగుచేసిన టమాట పశ్చిమ బంగ వంటి సుదూర ప్రాంతానికి రవాణా చేసినా దెబ్బతినకపోవటం విశేషం. రైతు కొంత పంటను కల్వకుర్తి మార్కెట్లో విక్రయిస్తున్నారు. టమాట నాణ్యత బాగుండటంతో అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంతాల వ్యాపారులే నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
ఈ పంటే గట్టెక్కింది
గతంలో ఉల్లి పంట సాగుచేసి నష్టపోయా. టమాట పంట మాత్రం మెరుగైన లాభాలు తెచ్చి ఆదుకుంది. నేను సాగుచేసిన లాంటి విత్తనాన్ని చాలా కంపెనీలు మార్కెట్లోకి తెచ్చాయి. మంచిదాన్ని ఎంచుకోవాలి. ఉద్యానశాఖ అధికారులు చంద్రశేఖర్‌రావు, ఇమ్రానా సూచనలు అందిస్తూ అండగా నిలిచారు. ఏ సందేహమున్నా పాలెంలోని కృషివిజ్ఞాన కేంద్రం శాస్రవేత్తలను సంప్రదిస్తూ వారి సలహాలు తీసుకున్నా.
- రాజేందర్‌రెడ్డి, ముకురాల(కల్వకుర్తి)
0 Comments:
Post a Comment