power cuts in AP: ఏపీకి కమ్ముకొస్తున్న కారు'చీకట్లు'!
power cuts in AP: కమ్ము కొస్తున్న కారు 'చీకట్లు' ఏపీని వెంటాడబోతున్నాయా? ఆ చీకట్లను చీల్చడం ఏపీలోని జగన్ సర్కార్ వల్ల కావడం లేదా? కరెంట్ సంక్షోభం ఏపీని ముసురుకుంటోందా?
విద్యుత్ కోతలు మొదలయ్యాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఏపీకి విద్యుత్ సంక్షోభం ఇప్పుడు అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కరెంట్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని నిర్దారణ అయ్యింది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం అధికారికంగా కరెంట్ కోతలను ప్రకటించింది. అయితే విద్యుత్ కోతల్లేకుండా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ప్రతినిధులు తెలుపుతున్నారు. అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటున్నారు. అయితే గ్రామాల్లో, పట్టణాల్లో మాత్రం అనుకోకుండా కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అక్వారంగం కూడా విద్యుత్ సరఫరాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున అప్రకటిత కరెంట్ కోతలతో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మూడు సంస్థల ద్వారా విద్యుత్ ను సరఫరా చేస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ నుంచి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. రాయలసీమ , నెల్లూరు జిల్లాకు ఏపీఎస్ పీడీఎస్ఎల్ విద్యుత్ అందిస్తోంది. ఇక కోస్తాంధ్ర కంటే రాయలసీమలో ఎక్కువగా విద్యుత్ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 15 నుంచి 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండగా రాయలసీమలో మాత్రం గంటల తరబడి విద్యుత్ సరఫరా ఆగిపోతున్నట్లు తెలుస్తోంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అంటున్నారు. ట్రాన్స్ ఫార్మర్ దెబ్బతిని, ఇతర కారణాల వల్ల విద్యుత్ ప్రసారం ఆగిపోతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. ఇక రాయలసీమలోనూ విద్యుత్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నామని అంటున్నారు. కానీ అప్రకటిత కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
విద్యుత్ కోతలు రాష్ట్రంలో కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య అవి విపరీతంగా అయ్యాయి. వారినికి ఒకసారి లైన్ మారుస్తారు. ఒకవారం ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు కరెంట్ ఉంటుంది. రెండో వారం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తారు. కానీ ఇప్పుడు కరెంట్ 9 గంటలు రావడం లేదని తూర్పుగోదావరి జిల్లాలోని రైతులు చెబుతున్నారు. ఇక అంతకుముందు మధ్య మధ్యలో మాత్రమే విద్యత్ సరఫరా ఆగిపోయింది. కానీ ఇప్ప్పుడు నిరంతరాయంగా కరెంట్ ఉండడం లేదని వారు వాపోతున్నారు.
రైతులే కాకుండా పరిశ్రమలు కూడా విద్యుత్ కోతలతో సతమతమవుతున్నాయి. అక్టోబర్ నెల ముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలిసేది. కానీ ఇప్పుడు అప్రకటితంగా సరఫరా నిలిచిపోతుందని చిన్న పరిశ్రమలకు చెందిన వారంటున్నారు. కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వారు మాత్రం తమకు కరెంట్ నిరంతరాయంగానే సరఫరా అవుతోందని అంటున్నారు. గతంలో కరెంట్ కోతలు ఉన్నా ఇప్పుడు అలాంటి సమస్యలేవి కనిపించడం లేదని అంటున్నారు. అయితే బొగ్గు కొరత గురించి వార్తల్లో వింటున్నామని, ఒకవేళ కరెంట్ కోతలు ఏర్పడితే ఇబ్బందులు ఏర్పడుతాయని అక్కడి వారంటున్నారు. ఇదే కాకుండా పశ్చిమగోదవారి జిల్లాలో అక్వా పరిశ్రమపై కరెంట్ కోతలు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కరెంట్ కోతలు లేవని మత్స్యకారులు అంటున్నారు. కానీ అనుకోకుండా కరెంట్ సరఫరా నిలిచిపోతే మాత్రం తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు.
ఏపీలలో బొగ్గు కొరత కారణంగా వీటీపీఎస్, ఆర్టీపీఎస్ వంటి ప్లాంట్లలో కొన్ని యూనిట్లు ఉత్పత్తి నిలిపివేయడంతోనే విద్యుత్ కొరత ఏర్పడిందని అంటున్నారు. అయితే ఏపీలో థర్మల్ పవర్ ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది. అక్టోబర్ 10 న ఏపీ జెన్ కో ఆధ్వర్యంలో మొత్తం 75.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. అక్టోబర్ 17 నాటికి అది 94.73 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయితే మహానది కోల్ పీల్డ్స్ నుంచి బొగ్గు అదనంగా రావడంతో ఇది సాధ్యమైంది. అయితే గడిచిన పది రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి పెరిగినా అల్పపీడనం సహా వివిధ కారణాలతో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో కరెంట్ కోతల నివారణకు తోడ్పిడినట్లు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment