న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తి తగ్గినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర విద్యుత్తుశాఖ ప్రకటన జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు తమ వద్ద ఉన్న కేటాయించని విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేయాలని విద్యుత్తు శా ఖ తమ ఆదేశాల్లో పేర్కొన్నది. ఒకవేళ ఏదైనా రాష్ట్రం వద్ద అదనపు విద్యుత్తు ఉంటే, ఆ విషయాన్ని ఆయా రాష్ట్రాలు తెలియజేస్తే, అప్పుడు అవసరమైన రాష్ట్రాలకు ఆ విద్యుత్తును సరఫరా చేస్తామని పవర్ మినిస్ట్రీ తన ప్రకటనలో వెల్లడించింది.
కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు విద్యుత్తును సరఫరా చేయడంలేదని తమ శాఖకు ఫిర్యాదులు వచ్చినట్లు ఆ ప్రకటనలో పవర్ మినిస్ట్రీ చెప్పింది. అధిక ధరలకు కొన్ని రాష్ట్రాలు విద్యుత్తును అమ్ముకుంటున్నట్లు కూడా ఫిర్యాదులు అందినట్లు ఆ శాఖ పేర్కొన్నది. విద్యుత్తు కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్(సీజీఎస్)కు చెందిన 15 శాతం కేటాయించని విద్యుత్తును.. అవసరమైన రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల వినియోగదారుల కోసం కేటాయిస్తుంటామని తెలిపింది.
డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ వినియోగదారులకు విద్యుత్తును సరఫరా చేయడం బాధ్యత అని, ఆ కంపెనీలు తొలుత తమ వినియోగదారులకు నిరంతరం విద్యుత్తును అందించాలని ప్రభుత్వం చెప్పింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు స్వంత వినియోగదారులను వదిలివేసి, ఇతరులకు విద్యుత్తును అమ్మరాదు అని స్పష్టం చేసింది. కేటాయించని విద్యుత్తు కోటాను వినియోగిదారుల కోసం ఆయా రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. ఒకవేళ విద్యుత్తు నిరుపయోగంగా ఉంటే, ఆ అంశాన్ని చెబితే, అప్పుడు దాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని కేంద్రం వెల్లడించింది.
0 Comments:
Post a Comment