metaverse: ఫేస్‌బుక్ 'మెటా'గా ఎందుకు మారింది..?
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
మనం సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే భూమి, ఆకాశం ఒక చోట ఏకమైనట్లు ఉంటుంది..
అది కేవలం మన కళ్లు చేసే మాయే.. మెటావర్స్ కూడా అటువంటి సాంకేతికతే. ఫేస్‌బుక్ తన మాతృ సంస్థ పేరును కొత్తగా 'మెటా'గా మార్చింది. ఇదే భవిష్యత్తని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. మెటా-వర్స్ అనే పదాలను కలిపి దీనిని సృష్టించారు. 1992లో నీల్ స్టీఫెన్సన్ రచించిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ నవల స్నోక్రాష్ దీనిని బాగా ప్రచారంలోకి తెచ్చింది. సైన్స్ కల్పనల్లో వర్చువల్ రియాల్టీని ఉపయోగించి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి దీనిని వాడతారు. దీని ద్వారా 2డీలో ఉన్న ప్రస్తుత కంప్యూటర్ ప్రపంచం 3డీలోకి మారుతుంది.
టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి చెందిందా..?
ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. సైన్స్ ఫిక్షన్ నవలలు, సినిమాల్లో అభివర్ణించినట్లు పూర్తిగా కృత్రిమ ప్రపంచం స్థాయిలో ఇది ఉండదు. ప్రజలు వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని ఉపయోగించి తమ కృత్రిమ క్యారెక్టర్లను సృష్టించి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సరళంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం డిజిటల్ స్క్రీన్‌పై 2డీ విధానంలో చూస్తున్నాం. కానీ, మెటావర్స్‌లో వీఆర్ టెక్నాలజీ హెడ్‌సెట్స్ వాడి డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన భావన పొందవచ్చు. ఇందుకోసం వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్స్, అగ్మెంటెడ్ రియాల్టీ గ్లాసులు, స్మార్ట్‌ఫోన్ యాప్స్, ఇతర పరికరాలు వాడాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి కనీసం 15ఏళ్లు పట్టవచ్చని అంచనా. ఉదాహరణకు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వర్క్‌ఫ్రం హోం ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణమైపోయింది. వీడియో కాల్‌లో సహోద్యోగులతో సంభాషిస్తున్నాం. కానీ, మెటావర్స్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు వర్చువల్ కార్యాలయంలో పనిచేసే అవకాశం ఉందని ఎన్‌పీఆర్.ఓఆర్‌జీ పేర్కొంది.
2000 సంవత్సరంలో లిండెన్ ల్యాబ్స్ అనే స్టార్టప్ 'సెకండ్ లైఫ్' పేరిట ఓ గేమ్‌ను పరిచయం చేసింది. ఆన్‌లైన్‌లో మనం ఇళ్లు నిర్మించుకోవడం, ఆడుకోవడం, మాట్లాడుకోవడం, దుస్తులు కొనుగోలు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, స్మార్ట్‌ఫోన్ల రాకతో దీనికి కాలక్రమంలో ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోయింది.
లక్ష్యం ఏమిటీ..?
ఫేస్‌బుక్ అనుకున్న స్థాయిలో ఇది పూర్తిగా ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా తెలియదు. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఐరోపాలో 10,000 మంది ఉద్యోగులను నియమించుకొంది. మెటావర్స్ అభివృద్ధిలో భాగంగా 2021 లాభాల్లో 10 బిలియన్ డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని ఫేస్‌బుక్ పేర్కొంది.
కొత్త మెటావర్స్ వ్యాపారం ఎప్పటికి లాభాల్లోకి వెళుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వచ్చే పదేళ్లలో మాత్రం ఇది 100 కోట్ల మందికి చేరువవుతుందని చెబుతున్నారు. వందల కోట్ల డాలర్ల డిజిటల్ వాణిజ్యంతో పాటు.. క్రియేటర్లు, డెవలపర్ల రూపంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనుంది.
వాస్తవానికి ఫేస్‌బుక్ మెటావర్స్ యాడ్ వ్యాపారంపై జుకర్‌బర్గ్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, ఫేస్‌బుక్ మెటావర్స్ కోసం బయటివారు కూడా గేమ్స్, కాన్సెర్ట్స్, ఇతర ఉత్పత్తులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. మెటావర్స్‌లోని డిజిటల్ ప్రపంచంలో యాడ్స్ ప్రదర్శన ద్వారా ఫేస్‌బుక్ నిధులు సంపాదించే అవకాశం ఉంది. అంతేకాదు మెటావర్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి దానిలో ప్రత్యేకమైన యాప్‌స్టోర్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఫార్చ్యూన్ పత్రిక పేర్కొంది.
దీనిపై ఫేస్‌బుక్ ఒక్కటే పనిచేస్తోందా..?
చాలా కంపెనీలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. వీటిల్లో ఫేస్‌బుక్ ఒకటి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చిప్ మేకర్ న్విడియా ఇప్పటికే వీటిపై పని మొదలుపెట్టాయి. ''చాలా కంపెనీలు వాటి వాటి కృత్రిమ డిజిటల్ ప్రపంచాలను సృష్టిస్తాయని అనుకుంటున్నాం. ప్రస్తుతం 'వరల్డ్ వైడ్ వెబ్'లో కంపెనీలు రకరకాల అద్భుతాలు ఎలా సృష్టిస్తున్నాయో అదే విధంగా మెటావర్స్‌లో కూడా చేయవచ్చు'' అని న్విడియా ఓమ్నివెర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ కెర్రిస్ పేర్కొన్నారు.
ఇక వీడియో గేమింగ్ కంపెనీలు కూడా ఈ రేసులో ఉన్నాయి. చాలా పాపులర్ వీడియో గేమ్ 'ఫోర్ట్‌నైట్' తయారీ దారు ఎపిక్ గేమ్స్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి బిలియన్ డాలర్లను సమీకరించింది. ప్రముఖ గేమింగ్ ప్లాట్ ఫామ్ రాబ్‌లాక్స్ కూడా దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రముఖ బ్రాండ్స్ కూడా తమ ఉత్పత్తుల విక్రయానికి మెటావర్స్‌ను వేదికగా చేసుకొనే అవకాశం ఉంది. ఫ్యాషన్ దిగ్గజం గూచీ బ్రాండ్ తమ ఉత్పత్తుల విక్రయ వేదిక కోసం రాబ్‌లాక్స్‌తో కలిసి పనిచేస్తోంది. కోకా కోలా, క్లినిక్ సంస్థలు కూడా ఉన్నాయి.
వినియోగదారుడికి మరింత డేటా భారం..?
ఫేస్‌బుక్ ప్రస్తుతం వ్యాపార మోడల్ వలే వినియోగదారుల ఇంటర్నెట్ డేటాను వాడుకుని వాణిజ్య ప్రకటనల విక్రయం చేపట్టే అవకాశం ఉంది. అంటే.. 3డీ ప్రపంచంలోకి వెళ్లేందుకు మన డేటాను ఫేస్‌బుక్ వాడుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment