దేశంలో మళ్లీ గ్యాస్ ధర పెరిగింది. ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరను రూ.15 మేర పెంచాయి.
ప్రస్తుతం పెరిగిన ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50 నుంచి 899.50కి పెరిగింది. ఇక హైదరాబాద్లో ఇండియన్ గ్యాస్ ధర రూ.937 నుంచి రూ.952కి పెరిగింది. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీన కూడా గ్యాస్ ధరలను సవరించాయి. కమర్షియల్ గ్యాస్ ఎల్పీజీ ధరలను పెంచింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరలను పెంచడానికి రెండు కారణాలు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ రేట్ పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ ధర
నగరం ధర
హైదరాబాద్ రూ.952
వరంగల్ రూ.971
కరీంనగర్ రూ.971
విజయవాడ రూ.923.50
విశాఖపట్నం రూ.908.5
తిరుపతి రూ.934
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు అనుబంధంగా గ్యాస్ రేట్లు కూడా పెరగడంతో ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది.
గ్యాస్ సబ్సిడీ రావడం లేదా?
ప్రతీ ఏడాది 12 గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో సబ్సిడీ రూపంలో ఎంతో కొంత వెనక్కి వస్తుండటం కస్టమర్లకు కాస్త ఊరటే. అయితే సబ్సిడీ ఎంత వస్తుందన్నది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. సబ్సిడీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంటాయి. అయితే పలు కారణాల వల్ల సబ్సిడీ కస్టమర్ల అకౌంట్లకు జమ కాదు.
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రావాలంటే కస్టమర్లు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం తప్పనిసరి. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌ను ఎల్‌పీజీ ఐడీకి కూడా లింక్ చేయాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా సబ్సిడీ రాకపోవచ్చు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందరికీ రాదు. కుటుంబ వార్షికాదాయం రూ.10 లక్షల పైన ఉన్న ఉన్నవారికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాదు. కుటుంబ వార్షికాదాయం అంటే భార్యాభర్తల వార్షికాదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇద్దరి వార్షికాదాయం రూ.10,00,000 దాటితే సబ్సిడీ రాదు.
0 Comments:
Post a Comment