Kisan Credit Cards: త్వరలో వారికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు... కేంద్ర ప్రభుత్వం మరో వరం
భారతదేశంలోని మత్స్యకారులందరికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలోని అన్నదాతలు కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card) ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడా కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card) ప్రయోజనాలను మత్స్యకారులకు కూడా వర్తింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ప్రయోజనాలను అందించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (Sops) సిద్ధమవుతున్నాయని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆదివారం తెలిపారు.
"మా ప్రభుత్వం ఇప్పటికే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తోంది. మత్స్యకారులకు కూడా ఆ సదుపాయాలను విస్తరించడానికి మేం కృషి చేస్తున్నాం. త్వరలో మత్స్యకారులు కెసీసీ ప్రయోజనాల ద్వారా లబ్ధి పొందుతారు" అని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (NFDB) కార్యకలాపాలు సమీక్షించిన అనంతరం ఎల్.మురుగన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఈ కేసీసీ సదుపాయాలను మత్స్యకారులందరికీ వర్తింపజేయాలి. ప్రతి మత్స్యకారుడు ఈ సదుపాయాన్ని పొందాలి. అందుకు మేం కృషి చేస్తున్నాం. అతి త్వరలో మత్స్యకారులకు కేసీసీ కార్డులను పంపిణీ చేస్తాం. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రి పురుషోత్తం రూపాల (Parshottam Rupala) మార్గదర్శకత్వంలో కార్డుల జారీ విషయంలో ముందడుగులు వేస్తున్నాం. ఈ ప్రతిపాదనలను ముందుగానే పరిగణిస్తున్నాం" అని ఎల్.మురుగన్ వెల్లడించారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని.. దేశంలోని ఐదు ఫిషింగ్ హార్బర్(చేపల రేవులు)లను అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఆధునీకరిస్తామని మురుగన్ చెప్పారు. ఇందుకు ఐదు ఫిషింగ్ హార్బర్లలో అధునాతన ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర సౌకర్యాలతోపాటు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే తమిళనాడులో సీవీడ్ (seaweed) పార్కు శంకుస్థాపనకు పునాది రాయి వేస్తామన్నారు. ఈ తరహా పార్కులను తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా మరిన్ని పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదొక కొత్త కాన్సెప్ట్ అని.. తమ ప్రభుత్వం సముద్రపు పాచి సాగు(seaweed cultivation)ను ప్రోత్సహిస్తోందని వివరించారు. సీవీడ్ కల్చర్‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. దేశంలో అలాంటి కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మత్స్యకారులు, ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) సీవీడ్ కల్చర్, కేజ్ ఆక్వా కల్చర్(cage aqua culture) అనే సాంకేతికతలను చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు.
ఔషధ గుణాలు కలిగిన సీవీడ్‌కు భారతదేశంతో సహా విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉందని కేంద్ర మంత్రి వివరించారు. మత్స్యకారుల సంఘం, ముఖ్యంగా మహిళల సాధికారతకు సీవీడ్ వ్యవసాయం దోహదపడుతుందన్నారు. న్యూ-ఏజ్ ఫిషింగ్ టెక్నిక్‌లను ప్రోత్సహిస్తూనే, ప్రభుత్వం లోతట్టు చేపల వేటకు మద్దతు ఇస్తోందని.. పీఎంఎంఎస్ వై (PMMSY) కార్యక్రమం కింద ప్రతిపాదించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా చేపల ఎగుమతిని పెంచడానికి ఆసక్తి కనబరుస్తుందని చెప్పారు. అంతకుముందు, మురుగన్ బీహార్‌లో డా.రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జెయింట్ మంచినీటి రొయ్యల హ్యాచరీ(Giant Freshwater Prawn Hatchery)ను వర్చువల్ గా ప్రారంభించారు.
0 Comments:
Post a Comment