Kerala Couple World Tour: టీ కొట్టు ఆదాయంతో ప్రపంచాన్ని చుట్టివస్తున్న కేరళ దంపతులు.. ఇప్పుడు 26వ దేశానికి ప్రయాణం
ప్రపంచం చుట్టి రావాలని, అక్కడి వింతలు, విశేషాలు తనవి తీరా తిలకించాలనే కోరిక దాదాపు ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. కాని అది చాలా మందికి తీరని కలగానే ఉంటుంది.
బాగా ధనవంతులకు మాత్రమే అది సాధ్యమవుతుందనే భావన సర్వత్రా ఉంది. కాని, మనస్సు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించింది కేరళకు చెందిన ఒక వృద్ధ జంట. చిన్న టీ కొట్టు మాత్రమే వారికి ఆదాయ మార్గం. దాని ద్వారానే వారు తమ కలలు నిజం చేసుకుంటున్నారు. ప్రపంచమంతా తిరిగి రావాలనే వారి కోరికను ఏ శక్తిని వారిని అడ్డుకోలేకపోతోంది. 71 సంవత్సరాలు కె.ఆర్. విజయన్, ఆయన సతీమణి 69 సంవత్సరాల మోహన ఈ ఆక్టోబర్ 21న తమ విదేశీ పర్యటనలో భాగంగా 26వ దేశాన్ని చుట్టిరానున్నారు. ఈ పర్యటనలో వారు వెళ్తోంది రష్యాకు. ఈ పర్యటనలో కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఎజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు.
తన బాల్యంలో తన తండ్రి భారతదేశంలోని అన్ని ఆలయాలు సందర్శనకు తనకు తీసుకెళ్లాలని అలా తాను ప్రపంచాన్ని చూడగలిగానని, అంటారు విజయన్. ఆ కోరిక మరింత బలపడి విదేశీల పర్యటనలు చేపట్టేలా ఆయనను ప్రోత్సహించింది. కాని యుక్తవయస్సులో కుటుంబ బాధ్యతల కారణంగా ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది. 27 ఏళ్ల క్రితం వీళ్లు శ్రీ బాలాజీ కాఫీ హౌజ్ పేరుతో చిన్న కాఫీ దుకాణం ప్రారంభించారు. అదే వీరి జీవనోపాధి.
యాత్ర ప్రారంభం
కాఫీ దుకాణం ద్వారా రూపాయి రూపాయి దాచిపెట్టిన ఈ జంట 2007లో విదేశీ పర్యటనలు చేసేందుకు తగిన మొత్తం తమ దగ్గర సమకూరినట్టు గ్రహించింది. ఆ వెంటనే వారు మొట్టమొదటిసారిగా ఇజ్రాయేల్ పర్యటన చేశారు. ఈ వృద్ధ జంట స్ఫూర్తిదాయక యాత్ర గురించిన వార్తలు రావడంతో వీరి ఒక పర్యటన స్పాన్సర్ చేసేందుకు మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర 2019లో ముందుకొచ్చారు.
2019లో విజయన్, మోహన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఆ తర్వాత మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించడంతో వారి యాత్రలకు విరామం పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం వీరు అప్పులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చేవారు.
ఇప్పుడు కొవిడ్ సంక్షోభం నుంచి ప్రపంచం క్రమంగా బయటకు వస్తుండటంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు సిద్ధమవుతోంది. ఈ దఫా వీరు వెళ్తున్న దేశం రష్యా. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది. ఈ పర్యటనలో వీరి వెంట వీళ్ల మనవలు కూడా వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ!
0 Comments:
Post a Comment