YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తిచేయాలి సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్‌డేట్ చేయాలంటూ సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశంచేశారు. ప్రతి ఏటా ఒక వారంలో ల్యాండ్ రికార్డుల అప్‌డేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. నిషేధిత భూముల వ్యవహారాలకు (22 ఎ) చెక్‌పెట్టాల్సిందేనని సీఎం పేర్కొన్నారు. ఆ జాబితాలో పెట్టాలన్నా, తొలగించాలన్నా సరైన విధానాలు పాటించాలని అధికారులకు సూచించారు. లోపాలు లేకుండా ఆధీకృత వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.
కాగా.. శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం సమీక్షలో భాగంగా అధికారులు సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను సీఎంకు వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లు వివరించారు. డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. జూన్ 22, 2022 నాటికి 2400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. మరో 2400 గ్రామాల్లో ఆగస్టు 2022 నాటికి పూర్తి అవుతుందని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వే చేశామని అధికారులు పేర్కొన్నారు. సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన వ్యక్తి రికార్డుల్లోనూ, కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లోనూ అప్‌డేట్ కావాలని సూచించారు. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలన్నారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తగిన విధానాలను రూపొందించాలని సీఎం సూచించారు. ల్యాండు రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో ఉంచాలని సూచించారు. వీరు ఇచ్చిన సిఫారసుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు సంబంధించి ఎస్‌ఓపీలు రూపొందించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే ఈప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. ప్రజలు వీటికోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.
ల్యాండ్ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు. దీనికోసం తగినన్ని డ్రోన్లు కూడా సమకూర్చుకోవాలని సూచించారు. ల్యాండ్ రికార్డుల అప్‌డేషన్‌ను ప్రతి ఏటా ఒక వారంలో చేపట్టాలని, దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల అప్‌డేషన్, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మనం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కడా అవినీతికి చోటు ఉండకూడదని.. రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలని సీఎం సూచించారు. దీనికోసం సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 22ఎ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టంచేశారు. అధికారులు దీనిపై ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని సీఎం సూచించారు. తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
0 Comments:
Post a Comment