IMPS Transaction: గుడ్‌న్యూస్.. ఇకపై రూ.5లక్షల వరకు బదిలీ
ముంబయి: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని పెంచింది.
ప్రస్తుతం ఐఎంపీస్ ద్వారా గరిష్ఠంగా రూ.2లక్షల వరకు బదిలీ చేసే వీలుండగా.. తాజాగా దాన్ని రూ.5లక్షలకు పెంచింది. ఈ మేరకు ఆర్‌బీఐ గరవ్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
''ఐఎంపీఎస్ సేవల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు మరింత సౌలభ్యకరమైన సేవలను అందించేందుకు ఈ లావాదేవీలపై ఉన్న పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పెంచుతున్నాం'' అని ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను వెల్లడిస్తూ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయని, కస్టమర్లకు కూడా సులువుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐఎంపీఎస్.. బ్యాంకింగ్ లావాదేవీల్లో చాలా కీలకమైన చెల్లింపు వ్యవస్థ. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు క్షణాల్లో డబ్బు పంపించేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. 24 గంటలూ పనిచేసే ఈ సేవలను 2010లో తొలిసారిగా ప్రారంభించగా.. ఆ తర్వాత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. 2014 జవనరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ఠ పరిమితిని రూ.2లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పరిమితిని పెంచడం ఇప్పుడే.
0 Comments:
Post a Comment